Mission Telangana

సచివాలయం చేరుకున్న సీఎం కేసీఆర్

ఈరోజు ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ కొద్దిసేపటిక్రితం సచివాలయం చేరుకుని నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ ఉద్యోగులు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆశించిన ప్రగతి రావాలంటే ఉద్యోగులతో స్నేహంగా ఉండాలన్నారు. వీలైనంత త్వరలో ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్స్ ఇస్తామని, ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సౌకర్యాలు కల్పిస్తామని, కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించారు.

సమావేశం అనంతరం కేసీఆర్ సీ బ్లాకుకు చేరుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ రాక సందర్భంగా సమతాబ్లాకులో పండగ వాతావరణం కనిపించింది. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ తొలి కాబినెట్ మీటింగ్ జరగనుందని సమాచారం. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో పలువురు అభినందనలు అందజేసారు.

ప్రధానమంత్రి మోడీ 29వ రాష్ట్రంగా తెలంగాణను ఆహ్వానిస్తున్నానని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు, బొత్స, దానం నాగేందర్ తదితరులు కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతం పలుకుతూ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ కు ట్విట్టర్ లో అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *