– సుమంత్ గరకరాజుల
అవును, వచ్చే ఆదివారం ఆగస్టు 19వ తేదీన జరగబోయే ‘ఇండియా డే’ ఉత్సవాలలో ‘తెలంగాణ ఎన్నారై అసోసియేషన్’ (తెనా) ఆధ్వర్యంలో మన బతుకమ్మలు, మన బోనాలు, మన కట్టు బొట్టు, మన చరిత్రలను అమెరికా తెలంగాణ సమాజం ప్రపంచానికి చాటబోతోంది. ఈ ఉత్సవాలలో ‘తెలంగాణ’ అంటే ‘ఆంధ్రలో భాగం’ అని అనుకునే వారికి తెలంగాణది ఒక భిన్నమైన సంస్కృతని, ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కలిగి ఉందని తెలియజెప్పే అవకాశం దొరికింది.
ఇన్నాళ్ళు అణచివేతకు గురైన మన సంస్కృతిని ప్రపంచపటంలో పెట్టే రోజొచ్చింది.
న్యూయార్క్ నగరంలో ప్రతి యేటా భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘భారతీయ సంస్థల సమాఖ్య’ (Federation of Indian Associations) ‘ఇండియా డే’ ఉత్సవాలను ఇక్కడి భారత రాయబార కార్యాలయంతో కలిసి నిర్వహిస్తుంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, సాంకేతిక, ఆర్థిక పురోగతి మొదలైన అంశాలను ప్రపంచానికి చాటేందుకు ఈ ఉత్సవాలు ఆగస్టు 15 తరువాత వచ్చే తొలి ఆదివారం (అంటే ఈసారి ఆగస్టు 19న) జరుగుతాయి. అయితే, ఈ ఉత్సవాలలో ప్రదర్శన నిర్వహించే అవకాశం కేవలం అమెరికా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలకు మాత్రమే ఉంటుంది. ఈ సారి తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ పెట్టుకున్న దరఖాస్తుకు అనుమతి దొరికింది. దీంతో ఈ ఉత్సవం అమెరికాలో మన అస్తిత్వ ప్రకటనకు ఒక సాధికారిక అవకాశంగా మనం భావించాలి.
ఈ ఉత్సవాల్లో తెలంగాణ పరేడ్ జరపాలన్నది ఒక నిర్ణయం. న్యూయార్క్, పరిసర రాష్ట్రాల నుండి లక్షలాది మంది ఈ పరేడ్ చూడటానికి తరలి వస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మను, మన కళల బోనాన్ని, తెలంగాణ బిడ్డలందరూ తలకెత్తుకొని న్యూయార్క్ నగర నడిబొడ్డున నడవబోతున్నారు.
ప్రదర్శనలో బతుకమ్మలు, బోనాలు, పోచంపల్లి చీరలు, పెంబర్తి, నిర్మల్ కళాఖండాలు, మన చారిత్రక కట్టడాల పోస్టర్లు, డప్పులు, తెలంగాణ కీర్తి రత్నాలు జయశంకర్, కాళోజీ, పి.వి.నరసింహారావు ప్రభృతుల చిత్రపటాలు మొదలగునవి పట్టుకొని ఒక మైలు దూరం పరేడ్ చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది మన తెలంగాణ సాంస్కృతిక ఉనికిని ఘనంగా తెలిపే ఘట్టం.
తెలంగాణ బిడ్డలందరూ అమెరికాలో ఎక్కడున్నా న్యూయార్క్ పోవలసిందే. డప్పు దరువుకు అడుగు లేస్తూ తెలంగాణ సాంస్కృతిక జెండా ఎగుర వేయవలసిందే! ఇది యావత్ ప్రపంచానికి మన అస్తిత్వ ప్రకటన.
మీ ఆత్మీయులు, ఆప్తులు, బంధువులు, స్నేహితులు ఎవరు అమెరికాలో ఉన్నా ఉత్సవాలకు వెళ్ళమని తెలపండి.
వివరాలకు www.telangananri.com వెబ్‌సైట్‌ని సందర్శించండి. లేదా contact@telangananri.comకు ఇ-మెయిల్ చేయవచ్చు.
జై తెలంగాణ… జై భారత్…
[నమస్తే తెలంగాణ సౌజన్యంతో…]