mt_logo

తెలంగాణ – న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

By: ఆర్. విద్యాసాగర్‌రావు

తెలంగాణ ప్రజలు అధికారులు, నాయకులు మొద్దునిద్ర వీడి చైతన్యవంతులు కావాలి. అసలు తమకు సంక్రమించిన హక్కులేమిటో ముందు తెలుసుకోవాలి. వాటిని రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. దురదృష్టమేమంటే.. తెలంగాణలో ఇన్ని ఉద్యమాలు నడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం గాఢ సుషుస్తావస్థ నుంచి బయటికి రాలేదు. ఈ సందర్భంలో శాస్త్రవేత్త న్యూటన్ ప్రతిపాదించిన గమన సూత్రాలు (Law of motion)ను గుర్తు తెచ్చుకోవాలి. Every body preserves its state of rest or uniform motion in a straight line unless an external force acts on it – ఇది ప్రథమ సూత్రం అంటే ‘ఒక వస్తువు తానున్న స్థితినుంచి కాని, లేక అది నడుస్తున్న గతిలో నుంచి కాని మార్పు తేవాలంటే బాహ్యశక్తి అవసరం’ అన్నది. ప్రస్తుతం తెలంగాణను కదిలించాలంటే బాహ్యశక్తి కావాలి. అదేవిధంగా తెలంగాణ పట్ల కొందరు సీమాంధ్ర పాలకులు దురాగతాలు కొనసాగిస్తూ నిరంకుశ ధోరణి ప్రదర్శిస్తున్నారు. వారి చర్యలను అడ్డుకోవాలంటే బాహ్యశక్తి కావాలి. కనుక న్యూటన్ సూత్రాన్ని ఆలంబనగా చేసుకుని తెలంగాణ జేయేసి (టీజాక్) ప్రజాసంఘాలు, మేధావి వర్గం విద్యార్థులు ఒక బలమైన శక్తిగా ఏర్పడి సీమాంధ్ర నాయకుల దుష్ట చర్యలను అడ్డుకోవడానికి, తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపి ముందు కు నడిపించడానికి శక్తి ఉపయోగించాలి.

ఇక న్యూటన్ రెండవ సూత్రం. The rate of change of momentum is propor tional to the impressed force and takes place in the direction of force. క్లుప్తంగా చెప్పాలంటే ‘ప్రయోగించే బలాన్ని (శక్తిని) బట్టి ఫలితముంటుంది’ తెలంగాణ సమాజం ఎంత మొద్దు నిద్రలో ఉన్నది. దాన్ని జాగృతం చేయాలంటే ఏ మేరకు శక్తిని ఉపయోగించాలి? అదేవిధంగా సీమాంధ్ర పాలకుల ఆగడాల ఏ మేరకు కున్నాయి. వాటిని ఆపాలంటే ఏమేరకు శక్తినుపయోగించాలి అన్నది విశదీకరించేది రెండవ సూత్రం. మార్పు బలం నీటికున్న ప్రత్యక్ష సంబంధాలను రెండో సూత్రం వివరిస్తుంది.

మూడో సూత్రం- For every action there is an equal and opposite reaction చర్యకు ప్రతిచర్య సమానం అన్నది మూడో సూత్రం. అది మనం నిత్య జీవితంలో చూస్తూ అనుభవిస్తున్న మాట. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ర్యాలీ తీస్తారు. పోలీసులు ఎన్‌సీసీ గేటు దగ్గర అడ్డుకుంటారు. విద్యార్థులు ప్రతిఘటిస్తారు. ఇరువైపుల నుంచి రాళ్లవర్షం, టియర్‌గ్యాస్ షెల్స్ -ఇవి తప్పవు. సీమాంధ్ర నాయకుల అరాచకాలు ఆగడాలు కొనసాగుతున్నంత కాలం చైతన్యవంతులైన విద్యార్థులు ఊరుకోరు ప్రతిఘటిస్తారు. అది సహజమే. అంతే కాదు అవసరం కూడా. చెప్పొచ్చేదేమంటే న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన సూత్రాలను మనం కొత్త గొంతుక (న్యూ టోన్)లో పురోగమన సూత్రాలుగా భావించి ఉద్యమ మార్గదర్శకాలుగా భావించాలి. రాజకీయ పార్టీలతో ప్రమేయం లేకుండా టీజాక్‌లోని ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థులు తెలంగాణ సమాజాన్ని ముందుకు నడిపించాలి. నాయకులకు నిజాల సారాన్ని నూరిపోయాలి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి ఓపికతో వీలైన మాధ్యమాలు ఉపయోగించి ఉద్బోధ చేయాలి. తెలంగాణ వస్తే తప్ప తెలంగాణ బతుకులు బాగుపడవు అన్న కటిక సత్యాన్ని తెలియ చెప్పాలి.

తెలంగాణను అడ్డుకునే సీమాంధ్ర నాయకుల, దుష్ట పన్నాగాలు, ఎత్తుగడలు, నక్కజిత్తులను పసిగట్టి ఎక్కడికక్కడ సమాధి చేయాలి. ఇంత బృహత్కార్యక్షికమం తెలంగాణ టీజాక్, దాని అనుబంధ సంఘాలు సంస్థలపై ఉన్నది. ఇక రాజకీయ పక్షాల వ్యూహాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఒకపక్కన టీజాక్ నిర్వహించే ప్రజాస్వామ్య నిరసనలు, ర్యాలీలు, బంద్‌లు లాంటి కార్యక్రమాలకు పూర్తి మద్దతిచేస్తూ, కేంద్రంపై వత్తిడి తేవలసి ఉంటుంది. తమ కార్యకర్తలకు కూడా తెలంగాణ విషయంలో సంపూర్ణ అవగాహన కల్పిస్తూ, అనవసరమైన మేర శిక్షణ ఇప్పిస్తూ తెలంగాణ అవతరించే వరకు విశ్రమించకుండా ముందుకు సాగితే తప్ప ఏ పార్టీకి కూడా మనుగడ లేదు. ఈ బానిస బతుకులకు నిష్కృతి లేదు.

(నీళ్లు నిజాలు – నమస్తే తెలంగాణ నుండి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *