mt_logo

తెలంగాణపై ఎందుకింత ద్వేషభావం?

By: విశ్వరూప్

ఈ రోజు తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో తమ హక్కుల సాధనకోసం నినదిస్తున్నారు. తమ రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. లక్షలమంది ప్రత్యక్షంగా ఉద్యమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనపై తమకున్న బలమైన ఆకాంక్షను తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. ఎక్కడ తెలంగాణ కోసం సభ లేదా ర్యాలీ జరిగినా స్వఛ్చందంగా ప్రజలు పెద్దయెత్తున పాల్గొని తమ గొంతు వినిపిస్తున్నారు. వరుస బై-ఎలక్షన్లలో తెలంగాణ వ్యతిరేక శక్తులను చావుదెబ్బ కొట్టి ప్రజలు వోటు ద్వారా తమ ఆకాంక్షను బలంగా చాటారు. లక్షల ఉద్యోగులు నలభై నాలుగురోజులు సకలజనుల సమ్మెలో పాల్గొనగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వోర్చుకుని సమ్మెకు మద్దతునిచ్చి ప్రజలు తమ రాష్ట్రసాధనకోసం ప్రభుత్వాన్ని నిలదీశారు.

కానీ మన సొంతరాష్ట్రంలో పక్కప్రాంతంలో ప్రజల ఆకాంక్షలు మాత్రం గౌరవించబడట్లేదు. మానవహక్కుల హననం జరుగుతుంటే స్పందించే హృదయం కరువయింది. ఇక్కడి ఉద్యమాన్ని మీడియా, సీమాంధ్ర నాయకులు తీవ్రవాదంతో పోలుస్తున్నాయి. కొందరు చదువుకున్నవారు పక్కన జరుగుతున్న అన్యాయాన్ని ఖండించకపోగా  తెలంగాణప్రజలను సోమరిపోతులంటూ, తీవ్రవాదులూ, తాలిబన్లూ  అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది? సమస్య ఎక్కడుంది?

 
కొందరి ప్రచారం “ఉస్మానియాలో విద్యార్థులు చదవరు, అంతా రౌడీలు, సోమరిపోతులు. ఉస్మానియాను మూసేయాలి. ప్రొఫెసర్ కోదండరాం చదువులు చెప్పడం మానేసి గొడవలు చేస్తున్నాడు.” నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ సౌత్ఇండియాలోనే విద్యాప్రమాణాల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు ఒకసర్వే తేచిచెప్పింది . ప్రొఫెసర్ కోదండరాంతో సహా అనేకమంది తెలంగాణ ప్రొఫెసర్లు పౌరహక్కుల వేదికల్లో భాగంగా అనేకసార్లు సీమాంధ్రలో ప్రజలపై, దళితులపై జరిగిన దౌర్జన్యాలపై పోరాడారు.

ఇది ఒక్క తెలంగాణకే పరిమితం కాదు. తెల్లవారు భారతదేశాన్ని ఆక్రమించుకుని ఇక్కడి ప్రాంతాన్ని దోచుకునేటప్పుడు ఇక్కడి ప్రజలను నాగరికతలేనివారిగా, సోమరిపోతులుగా చిత్రీకరించారు. అరబ్ దేశాలపై అమెరికా, యూరప్ దేశాలు ఒకవైపు దాడులు చేస్తూ, ప్రజాహక్కులను కాలరాస్తుంటే అదే అరబ్బులపై ద్వేషభావన కూడా అంతే ఎత్తులో ప్రచారం చేయబడింది. అమెరికాలో నల్లవారిని దోచుకునే రోజుల్లో అదే నల్లవారిని తెల్లవారు ద్వేషించారు. మనదేశంలో మనరాష్ట్రంలో దళితులపై అగ్రకులాలవారు కారంచేడు, చుండూరుల్లో దాడులు చేసినపుడు  దాడులను ఖండిచాల్సింది పోయి అక్కడి అగ్రకుల విద్యావంతుల్లో అధికభాగం దళితులపై ద్వేషభావన నింపుకున్నారు.

James W. Loewen అనే మహానుభావుడు ఈవిషయంపై చెప్పిన కోట్:

“It is always useful to think badly about people one has exploited or plans to exploit… No one likes to think of him or herself as a bad person. To treat badly another person whom we consider a reasonable human being creates a tension between act and attitude that demands resolution. We cannot erase what we have done, and to alter our future behavior may not be in our interest. To change our attitude is easier.”

మనుషులు తము దోచుకునేవారిని చెడ్డవారిగా జమకడితే అది వారికి లాభదాయకం. అలా చేయకపోతే పక్కవాడిపై చేసే దోపిడీకి, దౌర్జన్యాలకు తమకు తామ సమాధానం ఇచ్చుకోవాల్సివస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు తమపనులమీద తమకే అసహ్యం వేసి తమ దోపిడీని ఆపాల్సొస్తుంది. అదే పక్కవాడిని దుర్మార్గుడిగా జమకడితే అప్పుడు తము చేసే దోపిడీకి జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం సులభం. మనుషులు తమ చర్యలను మంచివైపు మార్చుకోవడం కంటే ప్రవర్తనను దిగజార్చుకోవడం  సులభం.

 మొన్న జరిగిన తెలంగాణ మార్చ్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎంత కర్కషంగా అణచివేస్తుందో, మానవహక్కులను ఎలా కాలరాస్తుందో చెప్పడానికి ఒక నిదర్శనం. ప్రజలు తమ ఆకాంక్షను చెప్పడాని చేసిన ప్రయత్నాన్ని రైళ్ళూ, బస్సులూ ఆపేసి, ఎక్కడికక్కడ ప్రజలను మార్చ్‌కు రాకుండా అడుగడుగునా నిర్భందించి, లక్షలకొద్ది అరెస్టులు చేసి కాలరాసింది. ఉస్మానియా యూనివర్సిటీని నిర్భందించి విద్యార్థులు బయటికి రాకుండా వారిపై రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాలు, లాఠీలు ప్రయోగించింది. వేదికను చేరుకోవడానికి వీళ్ళేకుండా అడుగడునా ముల్లకంచెలు ఏర్పాటుచేసింది. ఒకవైపు మార్చ్ జరుగుతుంటే ఉద్యమకారులపై భాష్పవాయుగోళాలు నేరుగా మనుషులపైకి ప్రయోగిస్తే ఆ గోళాలు తాకి కొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.

 

 భాష్పవాయువు వల్ల ఎందరో పిల్లలు, స్త్రీలు అనారోగ్యానికి గురయ్యారు. పోచయ్య అనే వికళాంగుడు రెండు కాళ్ళు అవిటివయినా కర్రలతో నాల్గు కిలోమీటర్లు నడిచి మార్చిలో పాల్గొన్నాడు.

రాజకీయనాయకులు, వ్యాపారులు, కబ్జాకోరులూ తమ స్వార్ధలాభాలకోసం తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మవచ్చు. కానీ ఉద్యమంపై, తెలంగాణపై ద్వేషాన్ని ప్రకటించే ప్రజలూ, విద్యావంతుల్లారా ఒక్కసారి ఆలోచించండి. హక్కులకోసం పోరాడుతున్న ప్రజలపై జరిగే దౌర్జన్యాలను సమర్ధిస్తే రేపు మీపై దౌర్జన్యం జరిగినపుడు మీకు తోడు దొరకదు. ఆత్మవంచన చేసుకుని అన్యాయాన్ని సమర్ధించకండి, ధైర్యంగా న్యాయాన్ని సమర్ధించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *