mt_logo

ఇంత విషం కడుపులో దాచుకుని ఎలా కలిసుందామనుకుంటున్నారు?

By: కొణతం దిలీప్ (ఒక తెలంగాణ మీడియా మిత్రుడి సహకారంతో…)

పేరుకది విశాలాంధ్ర మహాసభ అయినా అదొక పచ్చి విషాంధ్ర మహాసభ అని వెనుకటికొకసారి రాశాను. వాస్తవానికి అది పట్టించుకోవలసినంత పెద్ద సంస్థ కాదు. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా నడుస్తున్న గుంపు కాబట్టి మన సీమాంధ్ర మీడియా దాని స్థాయికన్న ఎక్కువే “స్పేస్” ఇస్తోంది.

అందులో ఉన్నది గుప్పెడు మందే. గత ఏడాదిన్నరగా కష్టపడుతున్నా పాపం వారి సభలో సంఖ్య రెండంకెలు కూడా దాటట్లేదు. ఎలా దాటుతుంది? చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి కదా. విశాలాంధ్ర పేరిట వారు చేసేది అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ఉద్యమం మీద, ఇక్కడి ప్రజల మీద విషం చిమ్మడమే. ఈ మూకను పెంచి పోషిస్తున్నది బెజవాడ బ్రోకర్ ఉరఫ్ లగడపాటి అనే జోకర్.

వారి కడుపులో ఎంత విషం ఉందో తాజాగా పరకాల ప్రభాకర్ తెలంగాణ మార్చ్ పై చేసిన దొంగ విశ్లేషణతో మరోసారి బయటపడింది.  ఎప్పటిలాగానే ఈ చెత్త విశ్లేషణను పట్టుకుని లగడపాటి జోకర్ తెగ వాగుడు వాగుతున్నాడు. వీరిద్దరి అతి చేష్టల వల్ల సమైక్యాంధ్ర ఉద్యమానికి మేలు జరగకపోగా తెలంగాణ ప్రజల రాష్ట్రసాధన సంకల్పం రెట్టింపు అవుతుంది. 

సెప్టెంబర్ 30 నాడు తెలంగాణ మార్చ్ కు లక్షలాది మంది ప్రజలు వచ్చి మరోసారి తమ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష చాటారు. కానీ పరకాల బృందానికి మాత్రం ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి. పత్రికల్లో ప్రచురితమైన మీటింగు ఫొటోనొకదాన్ని తీసుకుని కోడి గుడ్డు మీద ఈకలు పీకే పని ఒకటి మొదలుపెట్టారు. ఆ ఫొటోపై పరకాల విశ్లేషణ చూస్తే వారి మెదడు మోకాల్లో కాదు కదా అరికాల్లో కూడా లేదని చిన్నపిల్లాడికైనా అర్థం అవుతుంది.

పరకాల చేసిన పిచ్చిపని చూడండి:

తెలంగాణ మార్చ్ ఫొటోను తీసుకుని దానిపై నిలువు, అడ్డం గీతల గ్రిడ్ ఒకదాని గీసి ఒక్కో చదరంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్కకట్టి మొత్తం మార్చ్ కు 18,000 మందే వచ్చారని తేల్చాడీ మట్టి బుర్ర.

ముందీ అవకతవక మేధావి విశ్లేషణలో ఉన్న డొల్ల వాదనను చూద్దం. ఆ తరువాత తెలుగు జాతి అంతా ఒక్కటిగానే ఉండాలని పైకి కోరుకునే ఇతగాడి మనసులో తెలంగాణపై ఎంత విషం ఉన్నదో చూద్దాం.

పరకాల వాదన ఇది:

 

ఈ ఫొటోలో కుడి వైపు ఉన్న ఒక చదరంలో 500 మంది ప్రజలు ఉన్నారని లెక్కేసి, ఫొటోలో మొత్తం 36 చదరాలు ఉన్నాయి కాబట్టి మార్చ్ కు వచ్చిన ప్రజల సంఖ్య 18,000 ఉంటుందని ఈ కోడి మెదడు మేధావులుంగారు అంచనా వేశాడు.

ఇక్కడే పరకాల హుస్సేన్ సాగర్ తీరంలోని రొచ్చులో అడుగేశాడు.

మార్చ్ ఫొటో తీసిన angle వేరు, దానిపై గీసిన గీతల angle వేరు అయినప్పుడు ఒక చదరంలో ఉన్న ప్రజల సంఖ్యను ఇంకో చదరంలో ఉన్న సంఖ్యతో పోల్చలేం అనేది ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది.

ఉదాహరణకు ఈ ఫొటో చూడండి:

పై చిత్రంలో కుడివైపు కింది భాగంలో “A” అని మార్క్ చేసిన చదరంలో కేవలం రెండు టైల్స్ (దాదాపు) మాత్రమే ఉన్నాయి. అదే ఇంకో చివర “B” చదరంలో చూడండి దాదాపు 20 వరకు టైల్స్ ఉన్నాయి. ఇరవై ఫీట్ల పొడవున్న లాన్ లోనే ఇంత వ్యత్యాసం వస్తే ఇక ఆయనే చెప్పినట్లు 1300 ఫీట్ల దూరాన్ని ఫొటో తీస్తే దానిలో ఎంత వ్యత్యాసం వస్తుందో వేరే చెప్పనక్కరలేదు కదా.

మరి ఫొటోలో పరకాల లెక్క ప్రకారం ఈ చివర 500 మంది ఉంటే అటు చివర ఎంత మంది ఉంటారో ఊహించుకోండి. 

ఫోటో తీసిన Angle ను గమనించకుండా చెత్త లాజిక్కులు తీసే పని ఏ చదువురాని నిరక్షరాస్యుడో చేస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టరేట్ పొందిన పరకాలకు ఇంత చిన్న విషయం తెలియదా? లేక తెలిసీ బుకాయిస్తున్నాడా?

ఇక రెండో విషయం. తెలంగాణమార్చ్ అనేది పబ్లిక్ మీటింగు కాదు. ఆరోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం పొద్దుపోయేంతవరకూ ప్రజా ప్రవాహం ఆగకుండా వస్తూనే ఉన్నది. అటువంటప్పుడు ఏదో ఒక ఫొటోను పట్టుకుని వచ్చినవారి సంఖ్యను అంచనా వేయడం తలకాయ ఉన్నవాడెవడూ చేయడు. కానీ మన పరకాలకు అది లేదు కాబట్టి ఇట్లాంటి చెత్త అయిడియాలు వస్తుంటాయి.

మూడో సంగతి: పరకాల వారి దివ్యజ్ఞానంతో నెక్లెస్ రోడ్డులో మార్చ్ జరిగిన ప్రదేశం పొడవు 1300 వందల ఫీట్లు, వెడల్పు 100 ఫీట్లు అని అంచనా వేశాడు. అయితే నిజానికి మార్చ్ జరిగిన ప్రదేశం పొడవు (నా అంచనా ప్రకారం ) కనీసం కిలోమీటర్ పైనే ఉంటుంది. అంటే 3280 ఫీట్లు. ఇక్కడా పరకాల లెక్కలు తప్పే.

అన్నిటికన్న ప్రధానమైనది అసలు అనేక నిర్బంధాల మధ్య జరిగిన తెలంగాణ మార్చ్ కు ప్రజలు తక్కువ వచ్చారని లెక్కలు వేయడం వీరి మనసుల్లో తెలంగాణ ప్రజల మధ్య ఎంత ద్వేషభావం ఉన్నదో తెలుపుతున్నది.

తెలంగాణ మార్చ్ కు వారం రోజుల ముందే జిల్లాల్లో వేలాదిమంది తెలంగాణవాదుల అరెస్టులు మొదలయ్యాయి. మార్చ్ జరిగిన రోజు హైదరాబాదుకు వచ్చే దాదాపు నలభై రైళ్లు రద్దు చేశారు. తెలంగాణ జిల్లాల నుండి హైదరాబాదుకు వచ్చే అనేక బస్సులు రద్దు చేశారు. వరంగల్ నుండి వస్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ ను జనగాం వద్ద నిలిపివేసి ఆఖరికి డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక నిజామాబాద్ వంటి జిల్లాల నుండి వస్తున్న వందల ప్రైవేటు వాహనాలను అడ్డుకున్నారని ఏకంగా “సాక్షి” వంటి సీమాంధ్ర పత్రికలే రాశాయి.

ఇక ఇన్ని అడ్డంకులు దాటుకుని హైదరాబాదుకు వచ్చిన తెలంగాణ ప్రజలను నెక్లెస్ రోడ్డు మీదికి రాకుండా అన్ని రహదారులూ దిగ్బంధించింది పోలీస్ శాఖ. ప్రతి చోటా ప్రజలు పోలీస్ బారీకేడ్లను బద్ధలు కొట్టుకుని, లాఠీ దెబ్బలు, టియర్ గ్యాస్ మోతల మధ్య మార్చ్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు.  ఉద్యమ పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ముందైతే ఆరోజు మొత్తం యుద్ధమే సాగింది. ఒక్క విద్యార్ధి కూడా బయటికి రాకుండా పోలీసులు నిర్బంధించారు.

ఆరోజు పరిస్థితి తెలియాలంటే మచ్చుకు ఈ చిత్రాలు చూడండి:

ఫొటో: నెక్లెస్ రోడ్డులోకి ఎవరూ రాకుండా వేసిన రంపపు ముళ్లతీగెలు.

ఫొటో: అనేక బ్యారీకేడ్లు, పోలీసులని దాటుకుని తెలంగాణ మార్చ్ కు వచ్చారు ప్రజలు

ఫొటో: టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న పోలీసులు

ఫొటో: సభాస్థలి వద్ద టియర్ గ్యాస్ పొగ భరించలేక ముక్కు మూసుకుంటున్న చిన్న పాప

సభాస్థలి వద్ద పోలీసుల ఓవరాక్షన్ అంతా ఇంతాకాదు. నెక్లెస్ రోడ్డులోని మార్చ్ వేదిక వద్ద ఆరోజు మొత్తం 150 రౌండ్ల భాష్ప వాయువు గోళాలు పేల్చారంటే ఈ మార్చ్ పై సీమాంధ్ర ప్రభుత్వం, పోలీసులు ఎంత దమనకాండకు పాల్పడ్డాయో అర్థం అవుతుంది. ఈ టియర్ గ్యాస్ వల్ల మార్చ్ కు వచ్చిన చిన్నపిల్లలు, వృద్ధులతో సహా అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. సభాస్థలి వద్ద నేరుగా ప్రజలపైకి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడం వల్ల ఇద్దరు ఉద్యమకారులకు తలలో ఫ్రాక్చర్లు అయ్యి ప్రస్తుతం మహావీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇన్ని కష్టనష్టాలకు ఓర్చి అక్కడికి లక్షలాదిగా ప్రజలు వచ్చింది ఒక ఆకాంక్షను వ్యక్తబరచడానికి మాత్రమే.

ఈజిప్టులో హోస్నీ ముబారక్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తహ్రీర్ స్క్వేర్ లో గుమికూడినప్పుడు కూడా అక్కడి నియంతృత్వ ప్రభుత్వం తమ ప్రజల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించలేదు.

ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మార్చ్ కు ప్రజలు రాకుండా చూడాలనే ప్రయత్నించామని సాక్షాత్తూ అధికారులే ఓవైపు చెబుతుంటే పరకాల లాంటి మేతావులు మాత్రం వచ్చిన జనాలను తక్కువచేసి చూపడానికి ఇలాంటి తలతిక్క విశ్లేషణలు చేస్తున్నారు.

సీమాంధ్ర ప్రభుత్వం మా గుండెలపై చేసిన గాయాలపై మీరు కారం జల్లుతున్నారు పరకాల ప్రభాకర్. ఇలాంటివి చేసి తెలంగాణ ప్రజలకు మీరు ఏం సంకేతాలు పంపదలుచుకున్నారు? ఈ చర్యలద్వారా మీరు సీమాంధ్ర నాయకులపై తెలంగాణ ప్రజలకు ఇంకొంచెం కోపం తెప్పించి మా సంకల్పాన్ని బలోపేతం చేయగలరేమో కానీ సమైక్యతను మాత్రం ఎన్నటికీ సాధించలేరు. 

 ఇన్ని నిర్బంధాలు దాటుకుని ఒక మహోజ్వల పోరాటస్ఫూర్తిని కనబరచిన ప్రజల పట్ల జాలి లేకపోయినా పరవాలేదు కానీ మరీ ఇంత దుర్మార్గపు మాటలా? అసలు మీరు మనుషులేనా? ఇంత విషం కడుపులో దాచుకుని మాతో ఎలా కలిసి ఉందామనుకుంటున్నారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *