చిత్రం: రాష్ట్ర సాధన దిశగా మరో పోరాటానికి శ్రీకారం చుడుతూ నల్లగొండ జిల్లా సరిహద్దులోని కొండప్రోల్ గ్రామంలో రెండు రోజుల దీక్ష చేపట్టాడు తెలంగాణ మట్టి మనుషులు వ్యవస్థాపకుడు వేనేపల్లి పాండురంగారావు. ఆయన దీక్షను జలసాధన సమితి దుశ్చర్ల సత్యనారాయణ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ దీక్ష సందర్భంగా ఆంధ్రవైపు వెళుతున్న వాహనాలను ఆపి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరించి పంపిస్తున్నారు “మట్టి మనుషులు” ప్రతినిధులు.
—
వేనేపల్లి పాండురంగారావు – తెలంగాణ ఉద్యమంలో ఆ పేరు విననివారు చాలా అరుదు.
2003లో ఆలగడప సర్పంచ్ గా ఉన్న వేనేపల్లి, తన పనితీరుపై గ్రామపంచాయతీ ప్రజలతో ఒక రెఫరెండం నిర్వహించి జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా సంచలనం సృష్టించాడు.
ఒక సారి ఎన్నికైతే మళ్ళీ అయిదేళ్ల వరకూ ప్రజల ముఖం చూడని ప్రజాప్రతినిధులున్న ఈ కాలంలో వేనేపల్లి వంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు.
తెలంగాణ ఉద్యమంలో తొలి నుండీ పాండురంగారావుది క్రియాశీలక పాత్రనే. అనేక సృజనాత్మక నిరసన, ఆందోళనా కార్యక్రమాలతో నల్లగొండ జిల్లాలో ఉద్యమాన్ని నిరంతరం సజీవంగా నడిపిస్తున్నాడు.
2006లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జిల్లాలో ఒక రెఫరెండం నిర్వహించి రాష్ట్ర ఏర్పాటు కాంక్ష ప్రజల్లో ఎంత బలంగా ఉన్నదో చాటాడు. తెలంగాణ మట్టి మనుషులు పేరిట ఒక ఉద్యమ సంస్థను ఏర్పాటు చేసుకుని, దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాడు వేనేపల్లి.
గత యేడాది తెలంగాణ ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ సీమాంధ్ర కవులు రాసిన కవిత్వంతో “కావడి కుండలు” అనే అద్భుతమైన కవితా సంపుటిని కూడా వెలువరించాడు ఆయన.
వేనేపలి పాండురంగారావు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకుటున్న విధానం జాగ్రత్తగా గమనిస్తే ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది మనకు.
ఆయన ఏ రాజకీయ పార్టీ కొమ్ముకాయడు. ఏ నాయకుడో, పార్టీనో తనను పట్టించుకోవాలనే తాపత్రయం అస్సలు కనపడదు. ఉద్యమ నాయకత్వాన్ని అనవసరంగా విమర్శించడు. రాష్ట్ర సాధనకు తాను ఏమి చేస్తే బాగుంటుందో ఆలోచిస్తాడు, తన ఉద్యమమార్గం తనే నిర్దేశించుకుంటాడు. తల వంచుకుని తనపని తను చేసుకుంటూపోతుంటాడు.
అనేకమంది తెలంగాణ ఉద్యమకారులకు ఆయన నిత్యం స్ఫూర్తిగా నిలుస్తుంటాడు.