ముంబైలోని రాజ్ భవన్ లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తలపెట్టిన అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. మూడు సాగునీటి ప్రాజెక్టులపై ఇరువురు సీఎంలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గోదావరి నదిలోని 160 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కింద ముంపు ప్రాంతాన్ని తగ్గిస్తామని సీఎం కేసీఆర్ ఫడ్నవిస్ కు హామీ ఇచ్చారు.
లెండి ద్వారా 6 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని, లోయర్ పెన్ గంగ ప్రాజెక్టులో భాగంగా మూడు బ్యారేజీల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరువురు సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా గోదావరీ నదీ జలాలను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు రెండు రాష్ట్రాలు సమన్వయంతో పని చేయాలని, ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఇరు రాష్ట్రాల నిపుణులతో కూడిన కమిటీని నియమించుకోవాలని నిర్ణయించారు.
సమావేశం అనంతరం ఇద్దరు సీఎంలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ, ఇరుగు పొరుగు రాష్ట్రాలుగా తెలంగాణ, మహారాష్ట్ర ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తాయని, మూడు ప్రాజెక్టుల విషయంలో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతామని, పరస్పరం సంప్రదించుకుంటూ ముందుకు పోతామని అన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఆకాంక్షలు, అవసరాలు ఉన్నాయని, వాటికి తగ్గట్లుగా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంటామని, నదీ జలాలను సమర్ధవంతంగా వినియోగించుకుంటామని చెప్పారు.
ఇదిలాఉండగా సీఎం కేసీఆర్ కు ఫడ్నవిస్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, పుట్టినరోజునాడు సంబరాలకు దూరంగా రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి వచ్చారని ప్రశంసించారు. అదేవిధంగా మహాశివరాత్రి పండుగనాడు రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం కోసం సమయం కేటాయించినందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ కు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.