ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు 61వ జన్మదినం సందర్భంగా మంగళవారం తెలంగాణ భవన్ లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకే కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరాగా, కేసీఆర్ 61 వ పుట్టినరోజుకు సంకేతంగా తయారుచేసిన 61 కిలోల కేకును రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కవిత కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జీ జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తెలంగాణ జాతిపిత కేసీఆర్ లాంగ్ లివ్ అని నినాదాలు చేస్తూ భవన్ ముందు భారీ ఎత్తున బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ దర్శకుడు ఎన్ శంకర్ రూపొందించిన పాట అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర సాకారంలోని కీలక పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాసి, పాడిన చిన్ని చరణ్ పాటకు అనుగుణంగా దర్శకుడు శంకర్ దృశ్యాలను జోడించారు. ఈ పాట సీడీని మంత్రి జగదీష్ రెడ్డి, కవిత ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని వీరిద్దరూ ప్రారంభించారు. అదేవిధంగా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ లో బందూక్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కూడా జరిగింది. తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తిగా రూపొందించిన బందూక్ పాట, ఎన్ శంకర్ రూపొందించిన పాట కూడా బాగున్నాయని ఎంపీ కవిత, మంత్రి జగదీష్ రెడ్డి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.