జీహెచ్‌ఎంసీ, పురపాలక సంఘాల చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఆయా సవరణలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టగా… సభ దానిని ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గతంలో ఆమోదించిన పురపాలక చట్టానికి.. తాజాగా సభ ముందుకు సవరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్‌గా ఉన్నప్పుడు.. మహానగరానికి సంబంధించి 100 వార్డులు ఉన్న సమయంలో అప్పటి జనాభా, అప్పటి వార్డుల సంఖ్య ప్రతిపాదికనగా కో ఆప్షన్ సభ్యుల సంఖ్యను ఐదుకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్యను ఐదు నుంచి 15కు పెంచుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో సమీప గ్రామాల విలీనం, పెరుగుతున్న జనాభా దృష్ట్యా.. కార్పొరేషన్‌లో కూడా కో ఆప్షన్ సభ్యులను అదనంగా పెంచాలని సవరణలు ప్రతిపాదించినట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యులు, శాసన సభ సభ్యులకు ఎక్స్ అఫిషియో మెంబర్ షిప్ విషయంలో ఉన్న టైపో ఎర్రర్‌ను సవరించామని, పంచాయతీరాజ్ చట్టం తీసుకుంటే.. మండల పరిషత్, జిల్లా పరిషత్‌లు గానీ నాలుగేళ్ల పాటు అవిశ్వాసం పెట్టకుండా వీలు లేకుండా అందులో చట్టం తీసుకువచ్చామో.. మున్సిపల్ చట్టాన్ని కూడా వాటితో పాటు ఒకటే ప్రాతిపదికన.. మూడేళ్లు ఉన్నదాన్ని నాలుగేళ్లకు మారుస్తూ అవిశ్వాసాన్ని తీర్మానాన్ని నాలుగేళ్లకు ప్రవేశపెట్టేలా సవరణ ప్రతిపాదించినట్లు చెప్పారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బ్యాలెట్ బాక్సులను భద్రపరుచుకునేందుకు.. ఎన్నికల సంఘం వెసులుబాటు కోసం ప్రైవేటు వ్యక్తుల భవనాలు అద్దెకు తీసుకునేందుకు సవరణ చేస్తున్నామన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్‌పల్లి అనే మున్సిపాలిటీ ఉందని, అందులో రామకృష్ణాపూర్ ప్రాంతానికి విస్తరించి ఉందని చెప్పారు. రామకృష్ణాపూర్ బాగా పాపులర్ అనీ, ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు ఉన్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలు, శాసన సభ్యుడి విజ్ఞప్తి మేరకు క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా పేరును మారుస్తున్నట్టు తెలిపారు. దాంతో పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసున్నామన్న కేటీఆర్.. అందులో స్వపక్షం, విపక్షం అని తేడా లేకుండా, పద్ధతి ప్రకారం, శాస్త్రీయంగా గిరిజన ప్రాంతాల్లో భౌగోళిక విస్తీర్ణం ఎక్కువగా ఉండి, జనాభా తక్కువగా ఉన్నా, ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఆ క్రమంలో ములుగు జిల్లాగా ఏర్పాటైందని, విపక్ష శాసనసభ్యురాలు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ.. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం.. జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కానీ, జిల్లాకేంద్రంగా ఏర్పాటైన ములుగు గ్రామ పంచాయతీగా ఉండడం సబబు కాదు అనే ఉద్దేశంతో ములుగు గ్రామ పంచాయతీ టర్మ్ ముగిసిన తర్వాత.. ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ కొత్త మున్సిపాలిటీగా ప్రకటిస్తున్నామన్నారు. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపల్‌గా మార్చినందుకు సీఎం కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు స్థానిక ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ పరిధిలో సౌకర్యాలు కల్పించాలని, కలెక్టరేట్ నిర్మాణం వేగంగా జరిగేలా చూడాలని ఈ సందర్భంగా సీతక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.