ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా పాటించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హైదరాబాద్ లో అధికారికంగా కాళోజీ జయంతిని నిర్వహించడంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ భాషా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా అన్ని పాఠశాలల్లో తెలంగాణ భాషపై వ్యాసరచన పోటీలు, ఉపన్యాస, కవితా పోటీలు, చర్చాగోష్ఠులు నిర్వహించాలని సూచించారు. తెలంగాణలో భాష, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసినవారికి కాళోజీ స్మారక పురస్కారం అందివ్వాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.