mt_logo

తెలంగాణ, షికాగో స్టేట్ యూనివర్సిటీల మధ్య కుదిరిన ఒప్పందం..

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ, అమెరికాలోని షికాగో స్టేట్ యూనివర్సిటీల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు యూనివర్సిటీల మధ్య విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర బదిలీపై కుదిరిన అంగీకార పత్రాలపై ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ పార్థసారథి, షికాగో యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ కానిస్ లు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇకపై జీఆర్ఈ, టోఫెల్ లేకుండానే షికాగో యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి అవకాశం లభిస్తుంది. సుమారు 75వేలమంది విద్యార్థులకు దీనిద్వారా అవకాశం కల్పిస్తారు. నిజామాబాద్ ఎంపీ కవిత చొరవతోనే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు డేవిడ్ చెప్పారు.

ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలోని గ్రామీణ విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించడానికి ఇకపై సులభమవుతుంది. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో విద్యార్థుల బదిలీకి ఒప్పందం కుదిరినట్లు, భవిష్యత్తులో ఫార్మా, నర్సింగ్, కెమికల్ టెక్నాలజీ తదితర రంగాల్లో అవకాశాలు ఉంటాయని, తెలంగాణ యూనివర్సిటీ ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డీ శ్రీనివాస్, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ లింబాద్రి, షికాగో యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి రోహన్ అటెలే, నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ ప్రెసిడెంట్ రవి ఆచంట తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *