mt_logo

కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణ అన్నిట్లో ముందంజ : మంత్రి కేటీఆర్

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన సదస్సులో మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌, హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-విజయవాడ పారిశ్రామిక కారిడార్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని విభజన సమయంలో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదని గుర్తుచేశారు. అయినా.. కేంద్రంతో సంబంధం లేకుండా 19వేల ఎకరాల్లో ఫార్మాసిటీని, 1,200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్క్‌ను అభివృద్ధి చేశామన్నారు.

కేంద్ర సహకారం లేకున్నా ఇటీ అభివృద్ధి :

కేంద్రం నుంచి ఆశించిన సహకారం లేకున్నా రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పెట్టుబడులకు మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమో మానవ వనరులు కూడా అంతే ముఖ్యమని.. దానికోసం రాష్ట్రానికి ఐఐటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, కరీంనగర్‌లో ఐఐఐటీ, మెడికల్‌ కాలేజీలు, ట్రైబల్‌ యూనివర్సిటీ మంజూరు చేయాలని కోరినా కేంద్రం లెక్క చేయలేదన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ తనవంతు పాత్ర పోషిస్తున్నదని అన్నారు. కేంద్రానికి తెలంగాణ చెల్లించిన ప్రతి రూపాయి తిరిగి రాష్ట్రానికి రావాలని తాము కోరుకోవటం లేదని, కనీసం సగమైనా రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నామన్నారు.

ఆర్బీఐ తెలంగాణను మెచ్చుకుంది :

దేశ జనాభాలో తెలంగాణ జనాభా రెండున్నర శాతమే. జీడీపీలో మాత్రం రాష్ట్ర వాటా 5 శాతంగా ఉందని ఇటీవల రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నదని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. భౌగోళికంగా 12వ, జనాభాపరంగా 11వ పెద్ద రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఎకానమీ కాంట్రిబ్యూషన్‌లో 4వ అతిపెద్ద రాష్ట్రంగా అవతరించినదని ఆర్బీఐ నివేదికలో పేర్కొన్నట్టు తెలిపారు. చిన్న రాష్ట్రంగా ఉన్నా దేశానికి ఆర్థికంగా ఎక్కువ సహకారం అందిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన టీఎస్‌ఐపాస్‌ను నేడు దేశవ్యాప్తంగా సింగిల్‌ విండో రూపంలో అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. టీఎస్‌ఐపాస్‌ అమల్లోకి తెచ్చాక రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. మేక్‌ ఇన్‌ తెలంగాణ పేరుతో ఆన్‌లైన్‌ మాల్‌ను సోమవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దీనివల్ల ఎంఎస్‌ఎంఈలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *