తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వికాస్ రాజ్ గురువారం జీవో నం. 25 విడుదల చేశారు. దీంతో తెలంగాణలో పరీక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించుకోవడానికి మార్గం సుమగమైంది. ఈ బోర్డుకు విద్యాశాఖ మంత్రి చైర్మన్ గా, రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి వైస్ చైర్మన్ గా ఉంటారు. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యకలాపాలు జరుగుతాయి. ఈ బోర్డుకు కార్యదర్శిగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ ను నియమిస్తూ మరో జీవో జారీ చేశారు. అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి వీరభద్రయ్యను బోర్డుకు లీగల్ అడ్వైజర్ గా నియమిస్తూ జీవో నం. 26 ను విడుదల చేశారు.
ఇంటర్ బోర్డుపై, ఇంటర్మీడియట్ పరీక్షలపై పెత్తనం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం చేసిన కుట్రలకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. రెండు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలను తామే నిర్వహిస్తామంటూ ఏపీ సర్కారు ప్రచారం కూడా చేసింది. అయితే రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 75 ప్రకారం భౌగోళికంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న సంస్థలన్నీ తెలంగాణ రాష్ట్రానికే చెందుతాయని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి గవర్నర్ ముందు తన వాదన బలంగా వినిపించారు. మార్చి 9 నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలను తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వహించాలని ప్రభుత్వం గురువారమే ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల ఇంటర్ బోర్డు ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.