mt_logo

ప్రభుత్వ భూమిని తాకాలంటే భయపడాలి! – కేసీఆర్

భూమిని కబ్జా చేసే వారిని వదిలే ప్రసక్తే లేదని, అక్రమార్కులు ఎవరైనా వారిని ఉపేక్షించకూడదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రెవెన్యూ అధికారులకు సూచించారు. సచివాలయంలో గురువారం ప్రభుత్వ భూములపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్ లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే ముఠాలు ఉన్నాయని, నకిలీ స్టాంపులు, నకిలీ సర్టిఫికెట్లు సృష్టించే వారున్నారని, వాటితో ప్రభుత్వ భూములపై హక్కులు పొందుతున్నారని సీఎం అన్నారు.

ప్రభుత్వ భూమిని ముట్టుకోవాలంటే భయపడాలని, ఇప్పటికే అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని వెంటనే క్రమబద్దీకరించుకోవాలని, లేకపోతే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. భూమిని అక్రమంగా కబ్జా చేసే వారి ఆట కట్టించడానికి త్వరలో పటిష్టమైన చట్టాన్ని తీసుకొస్తామని, వారికోసం పైరవీలు చేసే ఖర్మ తమ ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. భూ ఆక్రమణలకు పాల్పడ్డ వారు ఏ పార్టీకి చెందినవారైనా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నా వదలొద్దని, వారిపైనా కేసులు నమోదు చేయాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. పేదలు గుడిసెలు వేసుకుంటే దౌర్జన్యంగా కూల్చేశారని, ఆక్రమణదారులు మాత్రం వేల ఎకరాలు కబ్జా చేశారన్నారు.

ప్రభుత్వం ఏదైనా చేద్దామంటే స్థలం దొరక్కుండా చేశారని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పేదల పక్షాన ఉంటూనే అక్రమార్కుల విషయంలో మూడోకన్ను తెరవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి విషయంలో నేను కఠినంగా ఉంటే కొందరికి గిట్టదు.. బద్నాం చేయాలని చూస్తారు. అయినా నేను భయపడేది లేదు. ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదు. నన్నెవరూ ఒత్తిడికి గురిచేయలేరు.. నాకు స్వప్రయోజనాలు లేవు. ప్రభుత్వ భూములు కాపాడటమే లక్ష్యం అని సీఎం స్పష్టం చేశారు. గ్రామాల్లో పని దొరకక ఉపాథి కోసం వచ్చి తలదాచుకోవడానికి చాలామంది పేదలు గుడిసెలు, రేకుల షెడ్డులు వేసుకుని జీవిస్తున్నారని, అలాంటి వారి పట్ల ఔదార్యాన్ని చాటాలని, నాలాలపై ఇళ్ళు నిర్మించుకున్న వారిని ఖాళీ చేయించి హైదరాబాద్ నగరాన్ని ముంపు నుండి కాపాడాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. అలా ఖాళీ చేయించిన వారికి మరోచోట ఇళ్ళు నిర్మించి ఇచ్చే ప్రణాళిక రూపొందించాలని సీఎం చెప్పారు.

నగరంలో సుమారు లక్షన్నర కుటుంబాలు నిలువనీడలేకుండా ఉన్నాయని, వారంతా రైల్వే ప్లాట్ ఫారాలు, ఫుట్ పాత్ లపై పడుకుంటున్నారని, అలాంటివారికి రాత్రివేళ ఆశ్రయం కల్పించేందుకు వెంటనే నగరంలో 50 నైట్ షెల్టర్లు నిర్మించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బీఆర్ మీనా, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు మీనా, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *