mt_logo

స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాలు భారీగా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం..

స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఏప్రిల్ నెల నుండే ఈ వేతనాలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కార్పొరేటర్ల నుండి కౌన్సిలర్ల వరకు అందరి వేతనాలను భారీగా పెంచుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం శాసనసభలో ప్రకటన చేశారు. ఇకపై జిల్లా పరిషత్ చైర్ పర్సన్లకు రూ. లక్ష, కార్పొరేషన్ మేయర్లకు రూ. 50 వేలు చెల్లిస్తారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల అమలులో పంచాయితీ రాజ్, పట్టణ స్థానిక సంస్థలు కీలక పాత్రను పోషిస్తున్నాయని, స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రతినిధుల గౌరవం పెంచేలా వేతనాలు ఉండాలని తమ ప్రభుత్వం భావిస్తున్నదని అన్నారు.

ఈ వేతనాల పెంపు అంశం ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నప్పటికీ వారి అభ్యర్థనలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వారి సేవలను మెరుగు పరిచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఏప్రిల్ నెల జీతం నుండే ఇది అమల్లోకి వస్తుందని సీఎం పేర్కొన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు పెరిగిన వేతనాలు క్రింది విధంగా ఉన్నాయి.

జెడ్పీ చైర్ పర్సన్ కు 7,500 నుండి లక్ష రూపాయలు, జెడ్పీటీసీ సభ్యుడికి 2250 నుండి 10 వేలు, ఎంపీటీసీ కి 750 నుండి 5000, ఎంపీపీ కి 1500 నుండి 10,000, సర్పంచ్ కు 1500 నుండి 5,000, మేయర్ కు 14,000 నుండి 50,000, డిప్యూటీ మేయర్ కు 8,000 నుండి 25,000, కార్పొరేటర్లకు 4,000 నుండి 6,000, చైర్ పర్సన్(స్పెషల్ గ్రేడ్) కు 10 వేలనుండి 15 వేలకు, వైస్ చైర్ పర్సన్(స్పెషల్ గ్రేడ్) కు 5 వేల నుండి 7,500 కు పెంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *