తెలంగాణలో అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆగస్ట్ 26 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి లే అవుట్ క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్)కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులు ఆగస్ట్ 31 నుండి అమల్లోకి వస్తాయని మున్సిపల్ శాఖ తెలిపింది.
హెచ్ఎండీఏ తో పాటు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల పరిధిలోని లే అవుట్లకు ఈ అవకాశం వర్తించనుంది. రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తుదారులు సేల్ డీడ్/టైటిల్ డీడ్ ను సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన గడువు దాటితే ఎట్టి పరిస్థితుల్లోనూ రెగ్యులరైజేషన్ వర్తించదు. ప్లాట్ ఓనర్లు దరఖాస్తుతో పాటు రిజిస్ట్రేషన్ కింద రూ. 1000 చెల్లించాలి. లే అవుట్ ఓనర్లు రూ. పదివేలు రుసుం చెల్లించాలి. ఆన్ లైన్ దరఖాస్తు లేదా మీ సేవా కేంద్రాల ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
ప్రభుత్వ నిబంధనలు:
నాలాలు, చెరువులు, శిఖం భూములు, కుంటలు వంటి గ్రీన్ బఫర్ జోన్ లో లే అవుట్లకు రెగ్యులరైజేషన్ వర్తించదు.
10 హెక్టార్ల లోపు విస్తీర్ణంలో ఉన్న కుంటలు, శిఖం భూములకు 9 మీటర్ల దూరంలో ఉండాలి.
10 హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువుకు 30 మీటర్ల దూరంలో లే అవుట్ ఉండాలి.
కెనాల్స్, వాగులకు 9 మీ. దూరంలో ఉండాలి. నాలాలకు 2 మీ. దూరంలో ఉండాలి.
విమానాశ్రయ సమీపంలో రెస్ట్రిక్ట్ చేయబడిన జోన్ లోపల లే అవుట్ అభివృద్ధి కార్యకలాపాల కోసం లేదా రక్షణ ప్రాంతాల బౌండరీ నుండి 500 మీటర్ల దూరంలో లే అవుట్ కోసం సంబంధిత రక్షణ, విమానాశ్రయ అధికారుల అనుమతి పొందాలి.