నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, పత్తిసాగు విస్తీర్ణంలో దేశంలో రెండో స్థానంలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలో ఈసారి పత్తి సేకరణ లక్ష్యం 33.20 లక్షల మెట్రిక్ టన్నులని చెప్పారు. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది రెట్టింపు పత్తి ఉత్పత్తి అవుతుందన్నారు. పత్తి కొనుగోలుకు జిన్నింగ్ మిల్లులకే నోటిఫైడ్ ఏజెన్సీలుగా గుర్తింపునిచ్చామన్నారు. మార్కెట్‌లో వ్యాపారులు చెల్లించే ధర కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉంటేనే సీసీఐ కొంటుందన్నారు. రైతులకు సబ్సిడీ మీద టార్ఫాలిన్స్ ఇచ్చామని తెలిపారు. కరోనా సమయంలో జిన్నింగ్ మిల్లులపై విద్యుత్ పెనాల్టీల విషయం పరిశీలనలో ఉందన్నారు. జిన్నింగ్ మిల్లులో జరిగే ప్రమాదాలతో రైతుకు సంబంధం ఉండదని చెప్పారు. ఇప్పటివరకు రైతుల బీమా కోసం రూ.989 కోట్లకుపైగా ప్రీమియం చెల్లించామన్నారు. రైతులు అప్పు చేయకూడదనే రైతు బంధు పతకం తెచ్చామన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు.