mt_logo

తెలంగాణ నలుదిశలా అభివృద్ధి… ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ పరిశ్రమల వెల్లువ

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి పెట్టింది. జిల్లా కేంద్రాలను, ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాలను హైదరాబాద్‌ తరహాలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో పరిశ్రమలను రాష్ట్రంలోని ఇతర నగరాలకు విస్తరిస్తున్నది. దీంతో యువతకు స్థానికంగానే ఉద్యోగావకాశాలు వస్తుండటంతో వలసలు తగ్గుతున్నాయి. ఇక జిల్లా కేంద్రాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసే పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించి పూర్తి సహకారాన్ని అందజేస్తున్నది. ఈ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌ లాంటి మారుమూల జిల్లాలకు సైతం పెద్ద ఎత్తున పరిశ్రమలు వెల్లువెత్తున్నాయి.

కరీంనగర్‌ టాప్ 

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్‌ ఐ-పాస్‌ ద్వారా రాష్ట్రంలో 2015 నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు 18,761 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయి. వీటి ద్వారా రూ.2,26,806 కోట్ల పెట్టుబడులు, 16.32 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ క్రమంలో 1,273 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు పొందిన కరీంనగర్‌ జిల్లా పారిశ్రామికంగా రంగారెడ్డి జిల్లా (1,137)ను అధిగమించింది. వీటిలో ఐటీ, టెక్స్‌టైల్‌, ఫార్మా, కెమికల్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఇంజినీరింగ్‌, లైఫ్‌ సైన్సెస్‌ తదితర రంగాలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి.

ఉద్యోగాల్లో వరంగల్‌ రూరల్‌ టాప్‌

టీఎస్‌ ఐ-పాస్‌ ద్వారా ఇప్పటి వరకు అనుమతులు మంజూరైన పరిశ్రమల్లో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా 22.2% యూనిట్ల ఏర్పాటుతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో సంగారెడ్డి (8.25%), కరీంనగర్‌ (7.4%) జిల్లాలు ఉన్నాయి. మొత్తం పెట్టుబడుల్లో సంగారెడ్డి జిల్లా 7.59 శాతాన్ని ఆకర్షించి ప్రథమ స్థానంలో నిలవడం గమనార్హం రంగారెడ్డి (7.29%), భద్రాద్రి కొత్తగూడెం (6.57) జిల్లాలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ఉద్యోగాల కల్పనలో వరంగల్‌ రూరల్‌ జిల్లా 11.68 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

ప్రభుత్వ విధానాలు భేష్‌

రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక విధానాల వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సులభంగా అనుమతులు, అనేక ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. ఫలితంగా జిల్లాల్లోనూ ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి.

– దీకొండ రఘు, జీఎం, పరిశ్రమల శాఖ, ఆసిఫాబాద్‌ జిల్లా

జిన్నింగ్‌ మిల్లు అడ్డా ఆదిలాబాద్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో విస్తారంగా పండే పత్తి గతంలో వరంగల్‌కు, ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అయ్యేది. ఇప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల జిల్లాలోనే జిన్నింగ్‌ మిల్లులు వచ్చాయి. అలాగే దళితబంధు లబ్ధిదారులు బ్రిక్స్‌ తయారీ, ఇంజినీరింగ్‌, చిన్నతరహా ఫుడ్‌ ప్రాసెసింగ్‌, రైస్‌, నూనె మిల్లుల్ని తెస్తున్నారు.

– పద్మభూషణ్‌ రాజు, జీఎం,పరిశ్రమల శాఖ, ఆదిలాబాద్‌ జిల్లా

హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు పరిశ్రమలు : 

ముడి సరకు లభ్యత ఆధారంగా జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడి దారులు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌లో యూనిట్లున్నా.. తమ రెండో యూనిట్‌ను జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రైస్‌, ఆయిల్‌ మిల్లులు, ఫర్నీచర్‌, బ్రిక్స్‌ తయారీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు డిమాండ్‌ ఉన్నది.

– గోపాల్‌రావు, ఉపాధ్యక్షుడు,తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *