mt_logo

తెలంగాణ ఉద్యోగులే ఇక్కడ ఉండాలి- దేవీప్రసాద్

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలని కమలనాథన్ కమిటీకి తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలు తేల్చిచెప్పారు. ఆప్షన్ల పేరుతో ఇక్కడకు సీమాంధ్ర ఉద్యోగులను తరలించొద్దని, తమ మాట కాదని తెలంగాణ ఆఫీసుల్లోకి సీమాంధ్ర ఉద్యోగులు చేరితే ప్రతీ ఆఫీసు ఒక ఉద్యమక్షేత్రం అవుతుందని వారు హెచ్చరించారు. సీమాంధ్ర నేతలు మాత్రం ఆప్షన్లు వర్తించేలా చేయాలని, రాష్ట్ర కేడర్ కు చెందిన ఉద్యోగులకు రెండు రాష్ట్రాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. రాజధానిపై స్పష్టత వచ్చేవరకు ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కమలనాథన్ కమిటీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగమైన ఉద్యోగుల విభజనపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారని, మిగతా రాష్ట్రాలలో ఉద్యోగుల విభజనకు అనుసరించిన సూత్రాలు ఏపీ విభజనకు ఎందుకు పని చేయవు? ఉద్యోగుల విభజన ఎందుకు సామరస్యంగా జరగనివ్వడంలేదని ఇరు ప్రాంతాల ఉద్యోగసంఘాలను కమలనాథన్ కమిటీ ప్రశ్నించింది. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలు ఓపికగా, వివరణాత్మకంగా సమాధానాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఒప్పందాలపై ఏర్పడిన రాష్ట్రమని, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన రోజునుండే ఉల్లంఘనలు మొదలయ్యాయని, ఉద్యోగులకు జరిగిన అన్యాయాలన్నిటిని విడమర్చి చెప్పారు. ముల్కీ నిబంధనలు, ఆరు సూత్రాలు, గిర్ గ్లానీ సిఫారసులు, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610జీవో ల విషయంలో జరిగిన అన్ని ఉల్లంఘనలు వివరించారు. తెలంగాణ ఉద్యమం నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే జరిగిందని గుర్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో లక్షమందికి పైగా సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారి స్థానికత ఆధారంగా ఏపీ ప్రభుత్వంలో పని చేయడానికి పంపించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ లో ఉన్న హెచ్వోడీలలో 20వేలమంది పనిచేస్తుంటే అందులో 15వేల మంది సీమాంధ్రులే అని, మిగిలిన 5వేలమందిలో కూడా అసలైన తెలంగాణ వారు 3వేలమంది మాత్రమే అని, మిగతా 2వేలమంది చాలా కాలం క్రితం సీమాంధ్రనుండి వచ్చి స్థిరపడిన వారి పిల్లలని తెలంగాణ ఉద్యోగసంఘాలు కమిటీకి స్పష్టం చేశాయి. జిల్లా జోనల్ మల్టీ జోనల్ పోస్టుల్లో నాన్ లోకల్ కాటగిరీ కింద సీమాంధ్ర నుండి వచ్చిన ఉద్యోగులు 70వేల నుండి 75వేలమందికి పైగా ఉంటారని, వారందర్నీ స్థానికత ఆధారంగా వెనక్కు పంపించాలని కోరారు. ఇవేకాక మరిన్ని అంశాలపై తెలంగాణ ఉద్యోగసంఘాలు కమిటీకి వివరించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *