mt_logo

తెలంగాణ ఏం సాధించింది?

By: కట్టా శేఖర్‌రెడ్డి

ఆంధ్రా మీడియా రాతలు పైకి ఒక రకంగా కనిపిస్తాయి. అసలు లక్ష్యాలు వేరే ఉంటాయి. వాళ్లు మనుషులు, పత్రికలే ఇక్కడ… వాళ్ల ఆలోచనలు, ప్రయోజనాలు మాత్రం ఆంధ్ర కోసమే. బూర్గంపాడును కొట్టేయాలన్న కుట్రలు వారిని చలింపజేయవు. తెలంగాణ పల్లెలు కరెంటు లేక, తాగునీరు, సాగునీరు లేక విలవిల్లాడడమూ వారికి బాధ కలిగించదు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కుయుక్తులు కూడా వారిని కదిలించవు.

తెలంగాణపై ఆంధ్ర రాజకీయ పెత్తనం అంతరించినా ఆంధ్ర మీడియా కుట్రలు, ప్రచార యుద్ధాలు మాత్రం ఆగలేదు. తెలంగాణ విఫలం అయిందని, విఫలం కావాలని ఆశిస్తూ, తెలంగాణలో కుళ్లిపోయిన రాజకీయ పీనుగలకు ప్రాణం పోయాలని యజ్ఞం చేస్తారొకాయన. తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్రా ప్రయోజనాలను పతాక శీర్షికల్లో పెట్టుకుని ఊరేగిస్తారింకొకాయన. వారి పరిష్వంగంలో ఒదిగిపోయి తెలంగాణ ఏమి సాధించింది అని ప్రశ్నించేవాళ్లు, సమైక్య రాష్ట్రంలోనే బాగుందని చెప్పే వాళ్లు, తెలంగాణకు ఇంకా ఎలా జెల్లకొట్టవచ్చో సూచించేవాళ్లు ఈ గడ్డపై ఇంకా మేధావులుగా చెలామణి అవుతున్నారు.

తెలంగాణ ఏమి సాధించిందో ప్రజలకయితే తెలుస్తూనే ఉంది. సమైక్యపాలన నుంచి వారసత్వంగా సంక్రమించిన రైతుల ఆత్మహత్యల సమస్యను తెలంగాణ ప్రభుత్వానికి అంటగట్టి విఫల ముద్రను రుద్దాలని చూస్తున్నారు. రైతు ఆత్మహత్యలు తెలంగాణకు గుండెకోత. ఎప్పుడొచ్చినా, ఎలా వచ్చినా ఈ సమస్యను ప్రభుత్వం పట్టించుకుని తీరాలి. పట్టించుకోకపోవడం వల్ల సమస్య మరింత జటిలం అవుతుందనేది వాస్తవం. రైతు లోకానికి తక్షణం స్థెర్యం కలిగించే చర్యలు ప్రారంభించాలి. దీనిపై రాజకీయ శషభిషలకు పోవడం అనవసరం.

ఇదే అదనుగా తెలంగాణ అంటేనే ఆత్మహత్యలు, ఆకలి చావులు అని ప్రచారం చేస్తున్నారు కొందరు. ఒక అష్ట వంకరల మేధావి సమైక్యాంధ్ర ఒకప్పుడు రైతులకు బువ్వపెట్టిందని, తెలంగాణ పట్టించుకోవడం లేదని వాదించాడు. ఇప్పుడు ఆంధ్రలో ఆత్మహత్యలే జరగడం లేదట. ఇంతకంటే దివాలాకోరుతనం ఇంకేముంటుంది? తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మక, మౌలికమైన నిర్ణయాలేవీ మీడియాకుగానీ, ఈ మేధావులకు గానీ కనిపించడం లేదు.

తెలంగాణ ప్రభుత్వం సామాజిక దృక్పథంతో నిర్ణయాలు చేస్తున్నది. మానవీయ చైతన్యంతో వ్యవహరిస్తున్నది. స్వరాష్ట్ర ఫలితాలు అందరికీ అందే దృష్టితో విధానాలు రూపొందిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెట్టాలని నిర్ణయించడం, మహిళా శిశు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నడిచే వసతి గృహాలలో మెస్ చార్జీలను రెట్టింపు చేయడం, ఆసరా పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేయడం, వికలాంగుల పింఛన్ను 1500 రూపాయలకు పెంచడం… తెలంగాణ ప్రభుత్వం పెద్దమనసుకు తార్కాణం. హైదరాబాద్‌తో సహా కొన్ని జిల్లాల్లో గత ప్రభుత్వాలు ఇచ్చిన పింఛన్ల కంటే ఎక్కువ సంఖ్యలో పింఛన్లు ఇచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆడపిల్లల పెళ్లిళ్ళకు ఆర్థిక సహాయం అందిస్తున్నది.

వ్యవసాయ మార్కెట్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీకి ఒకేసారి 4250 కోట్ల రూపాయలు చెల్లించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిల చెల్లింపు ప్రారంభించారు. దళితులకు మూడెకరాల భూపంపిణీకి శ్రీకారం చుట్టారు. గిరిజన తండాలను పంచాయతీలుగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసిని బలోపేతం చేయడానికి ఏకకాలంలో 400 కోట్ల రూపాయలు విడుదల చేసింది. పెద్ద ఎత్తున బస్సులను కొనుగోలు చేసింది. నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యధికంగా 6500 కోట్ల రూపాయలు కేటాయించారు. తెలంగాణకు ఆయువుపట్టు వంటి చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ఇంటింటికీ తాగునీరు అందించడం కోసం జలహారం(వాటర్ గ్రిడ్) నిర్మించాలని తలపెట్టారు.

తాజా బడ్జెటులో 2000 కోట్లు కేటాయించారు. మక్కజొన్న రైతుల బకాయిలన్నీ చెల్లించారు. కోళ్ల పరిశ్రమకు మునుపెన్నడూ లేని విధంగా రాయితీలు ప్రకటించారు. ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను రద్దు చేసింది. పెద్ద ఎత్తున విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నది. ప్రభుత్వాసుపత్రులకు, వైద్య కళాశాలలకు గత రెండున్నర దశాబ్దాల్లో ఎవరూ కేటాయించని విధంగా నిధులు కేటాయించి, ఆధునీకరణకు చర్యలు తీసుకుంది. ప్రభుత్వ విద్యాసంస్థలను పటిష్ఠపరిచే దిశగా అడుగులు వేస్తున్నది. విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడానికి నిధులు విడుదల చేసింది. అమరవీరుల కుటుంబాలకు పదిలక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఆ కుటుంబాలకు అన్ని విధాలుగా అండదండలు అందించడానికి చర్యలు తీసుకున్నది.

విద్యార్థులపై ఉద్యమకాలంలో పెట్టిన కేసులన్నీ ఎత్తివేసింది. క్రీడాకారులకు మునుపెన్నడూ లేని విధంగా అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయడానికి వేగంగా పథకాలు రచిస్తున్నది. ఇంతతక్కువ వ్యవధిలో ఇన్ని రకాలుగా తెలంగాణ సమాజానికి మేలు జరిగే నిర్ణయాలు గతంలో ఎప్పుడయినా జరిగాయా?

మన ప్రభుత్వం, మన నాయకులు, మనలను ఏలుతున్న భావన అందరిలోనూ కలుగుతున్నది. తెలంగాణకు మంచి నాయకత్వం చేతికంది వచ్చింది. సగానికిపైగా కొత్తతరం ఎమ్మెల్యేలు. బీద, మధ్యతరగతి నేపథ్యం నుంచి ఎదిగివచ్చినవారు. ఉద్యమాల్లో, రాజకీయాల్లో పోరాడి పైకి వచ్చినవారు. ప్రజల సమస్యలను గురించి అవగాహన ఉన్నవాళ్లు. తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యల మూలాలను తెలిసినవాళ్లు. రాజకీయ ఎత్తుపల్లాలను అనుభవించిన వాళ్లు. ఇంతమంది కొత్తతరం బీసీ, దళిత నాయకులు ఎదిగి వచ్చిన చరిత్ర ఏ ఉద్యమానికి ఉంది? ఒక దళితుడు, ఒక మైనారిటీ నేత ఉప ముఖ్యమంత్రులు అయిన సందర్భం తెలంగాణ చరిత్రలో ఎప్పుడున్నది? మన ప్రాధాన్యాలను, మన ప్రణాళికలను మనం నిర్ణయించుకునే అవకాశం ఎప్పుడు వచ్చింది?

మన సమస్యలపై మన పార్లమెంటు సభ్యులు ఇప్పుడు మాట్లాడినంతగా ఎప్పుడు మాట్లాడారు? అసలు పార్లమెంటులో ఇంతమంది మాట్లాడే ఎంపీలు మనకు ఇంతకుముందు ఎప్పుడున్నారు? అసూయాద్వేషాలతో మేధోనేత్రం మూసుకుపోయినవాళ్లకు కనిపించకపోవచ్చు, కానీ తెలంగాణ సాధించిన గొప్ప గుణాత్మకమైన మార్పు ఇది. మీ వాళ్ల(ప్రజాప్రతినిధుల)లో అత్యధికులు ఉద్యమకారులు, రాజకీయవేత్తలు. మా వాళ్లలో అత్యధికులు కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, దళారీలు, పారిశ్రామికవేత్తలు…దందాలు చేసి పైకి వచ్చినవాళ్లు. ఒక్కరికీ నోరుపెగలదు అని విజయవాడకు చెందిన మేధావి ఒకరు వ్యాఖ్యానించారు.

ఆయనే మరోమాట కూడా చెప్పారు.. మా నాయకుడు మోసగాడు.. మీ నాయకుడు మొండివాడు. కానీ ఇక్కడి కొందరు మేధావులకు, ఇక్కడ వ్యాపారం చేసుకునే పత్రికలకు ఆ మాత్రం కూడా విచక్షణ లేదు. తెలంగాణ నాయకత్వాన్ని న్యూనతపర్చడంకోసం, రాజకీయంగా దెబ్బతీయడంకోసం మొదటి నుంచీ ఆంధ్ర నాయకత్వం ప్రయోగించిన ప్రచార యుద్ధాన్నే ఇప్పుడు కొంతమంది వారి ఏజెంట్లు, వారి పత్రికాధిపతులు కొనసాగిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్‌పై చేసిన విషప్రచార దాడినే ఇప్పుడూ చేస్తున్నారు. ఆయనకు లేనిపోనివన్నీ ఆపాదించి ఉన్మాదపూరిత ప్రచారం సాగిస్తున్నారు.

ఈ దుష్ప్రచారం ఖండాంతరాలు దాటింది. సోషల్ నెట్‌వర్క్స్‌లో కేసీఆర్‌పై ఎంత దుష్ప్రచారం జరుగుతున్నదో….అమెరికాలో ఆంధ్రా నెటిజన్లు కేసీఆర్‌పై అత్యంత నీచమైన ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై ఏదిపడితే అది రాస్తున్నారు. వ్యక్తిగత అలవాట్లపై యథేచ్ఛగా చెలరేగుతున్నారు. ఇవన్నీ చూసి మాకు కూడా కేసీఆర్‌పై అటువంటి చిన్నచూపే ఏర్పడింది అని ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ అన్నారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కేసీఆర్ సాధించిన విజయం ఎంత గొప్పదో, ఆయన చేస్తున్న పనులు ఎంత నిర్మాణాత్మకమైనవో, తెలంగాణ సమాజం ఆయనకు ఇస్తున్న విలువ ఏమిటో మాకు అర్థమవుతున్నది అని ఆ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.

మరో ప్రధాన పత్రిక కృష్ణా జలాల పంపిణీపై హైదరాబాద్‌లో కూర్చుని పిల్లి పెత్తనం చేస్తుంది. తెలంగాణ ప్రయోజనాల గురించి రాయదు. ఆంధ్ర ఆందోళన గురించి, బాధల గురించి తెగ ఆవేదన పడిపోతుంది. శ్రీశైలం అడుగంటిపోతుందని, ఆంధ్ర, రాయలసీమల్లో తాగునీటికి సమస్య ఏర్పడుతుందని జోస్యం చెబుతుంది. శ్రీశైలం విద్యుత్‌తోనే తెలంగాణ ప్రజలు ఇన్ని మంచినీళ్లు తాగుతున్నారని, ఎప్పుడో దాహం తీర్చడం గురించి కాదు, ఇప్పుడు దాహం తీర్చడం ముఖ్యమని ఆ పత్రిక భావించదు. శ్రీశైలానికి వరద వస్తే ఎలాగని తాజాగా మరో వార్త వండివార్చింది. 2009 అక్టోబరులో వచ్చిన వరదలను ప్రస్తావిస్తూ ఇప్పుడీ కథనాన్ని అల్లింది.

అప్పటిలాగా భారీ వరదలు వస్తే ఏంచేయాలో సూచించడం ఆ వార్త పరమార్థం. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన వరద మళ్లించడానికి ఏర్పాట్లు చేయాలట. శ్రీశైలానికి ఎగువన తుంగభద్రపై మరో ప్రాజెక్టును నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగిస్తున్న ఎత్తులకు కొనసాగింపు ఈ వార్తాకథనం. ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలకు సమర్థనను సమకూర్చే వ్యూహంలో భాగం ఈ వార్తా కథనం. వాస్తవానికి శ్రీశైలంలో ఆ రోజు వరద బీభత్సాన్ని ఎవరూ సరిగ్గా విశ్లేషించలేదు. శ్రీశైలం ఎగువన వరదల బీభత్సానికి అసాధారణ వరద రావడం ఒక్కటే కారణం కాదు, ఆంధ్రా అధికారుల దురాశ కూడా కారణమే. ఎగువన వర్షాలు వస్తున్నాయంటే, వర్షాలు, వరద తీవ్రతను అంచనా వేసి శ్రీశైలం రిజర్వాయరును ముందుగా ఖాళీ చేయాలి. కానీ రాయలసీమకు నీరివ్వాలనే పేరుతో శ్రీశైలం రిజర్వాయరులో 880 అడుగులకు పైన నీరు చేరేదాక కూడా కిందికి నీరు వదల లేదు.

ఇంజనీర్లు వరద ముప్పును అంచనా వేయడంలో విఫలమయ్యారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయడంలో జాప్యం చేశారు అని రిటైర్డు చీఫ్ ఇంజనీరు సిఎల్‌ఎన్ శాస్త్రి, జలవనరుల నిపుణుడు విద్యాసాగర్‌రావు అప్పట్లోనే వ్యాఖ్యానించారు. అధికారులు శ్రీశైలంలో చాలా ఎక్కువరోజులు నీటిని నిలువ చేశారు. శ్రీశైలం నీటిని ముందునుంచే ఒక క్రమపద్ధతిలో కిందికి వదులుతూ ఉంటే వెనుకప్రాంతాల ముంపు తప్పేది అని వారు చెప్పారు. అన్ని గేట్లు ఎత్తి ఒక్కరోజు ముందుగా నీటిని ఖాళీ చేసినా వరద ఉధృతి కర్నూలు, నంద్యాల పట్టణాలను ముంచేది కాదు. వరద వచ్చేనాటికి శ్రీశైలం రిజర్వాయరు నిండుగా ఉండడం వల్ల నీరు వెనుకకు తన్ని కర్నూలును ముంచెత్తింది. పోతిరెడ్డిపాడు నుంచి భారీగా నీరు పొంగి నంద్యాలను ముంచెత్తింది.

ఆంధ్రా అధికారుల సంకుచితం వల్ల ఆరోజు రాయలసీమ అటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు ఆ వరద ముచ్చటను ముందుకు తెచ్చి వరద మళ్లింపు వాదనను తీసుకువస్తున్నారు. ఆంధ్రా మీడియా రాతలు పైకి ఒక రకంగా కనిపిస్తాయి. అసలు లక్ష్యాలు వేరే ఉంటాయి. వాళ్లు మనుషులు, పత్రికలే ఇక్కడ… వాళ్ల ఆలోచనలు, ప్రయోజనాలు మాత్రం ఆంధ్ర కోసమే. బూర్గంపాడును కొట్టేయాలన్న కుట్రలు వారిని చలింపజేయవు. తెలంగాణ పల్లెలు కరెంటు లేక, తాగునీరు, సాగునీరు లేక విలవిల్లాడడమూ వారికి బాధ కలిగించదు.

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కుయుక్తులు కూడా వారిని కదిలించవు. తెలంగాణ కళ్లల్లో కారం కొట్టేవాళ్లంటే వారికి చాలా ప్రేమ. కేసీఆర్‌పైన, తెలంగాణ రాజకీయ నాయకత్వంపైన దాడి చేసేవాళ్లు వాళ్లకు హీరోలు. అందుకే కాలం చెల్లి, ప్రాంతహితమూ, ప్రజాహితమూ చెడి, ఆంధ్రా ఆధిపత్య భావజాల మురికి గుంటలో పొర్లుతున్న మేధావులను తమ పత్రికల్లో, తమ పార్టీల్లో పతాక శీర్షికల్లో ఊరేగిస్తుంటారు. ఈ పత్రికలను, వారికోసం రాసేవారిని, కూసేవారిని ఎక్కడ ఉంచాలో తెలంగాణ సమాజం నిర్ణయించుకోవాలి.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *