mt_logo

విభజనంటే ఇదేనా?

By: కట్టా శేఖర్‌రెడ్డి

నిజమే. విభజన చట్టాన్ని సవరించాలి. సవరించాల్సింది ఆంధ్రకు ఎనిమిది సీట్లు పెంచడం కోసమో, నాలుగు వందల ఎకరాలు కలుపడంకోసమో కాదు. రెండు రాష్ట్రాల మధ్య విభజనను పూర్తి చేయడంకోసం సవరించాలి. రెండు ప్రాంతాల మధ్య కొనసాగుతున్న గందరగోళాన్ని పరిష్కరించడం కోసం సవరించాలి. పొత్తుల పాలనకు స్వస్తి చెప్పే దిశగా సవరించాలి. లక్షలాదిమంది విద్యార్థులను దిక్కుతోచని స్థితికి నెట్టేస్తున్న ఉమ్మడి పరీక్షలు, ఉమ్మడి ఎంసెట్ విధానాన్ని తొలగిస్తూ సవరించాలి. సిబ్బంది విభజనను తక్షణం పూర్తి చేసే విధంగా సవరణలు చేయాలి. ఆంధ్రను బుజ్జగించడం కోసం ఏ విభజన చట్టంలో లేని విధంగా చేర్చిన క్లాజులన్నింటినీ తొలగించాలి. కాంగ్రెస్, బీజేపీలు అన్యమనస్కంగా, అర్ధమనస్కంగా చేసిన సగంసగం విభజన వల్ల ఇవ్వాళ తెలంగాణ ఇంకా అడుగులు ముందుకు వేయలేకపోతున్నది.

అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొంటున్నది. మన ముఖ్యమంత్రి, మన మంత్రులు, మన ప్రజాప్రతినిధులు మనకు పనిచేస్తున్నారు. కానీ వారి ఆలోచనలను ఆచరణలో పెట్టాల్సిన మన కార్యనిర్వాహక యంత్రాంగమే ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. మన కోర్టులు, మన న్యాయమూర్తులు మనకు రాలేదు. ఆంధ్ర ఆధిపత్య వ్యవస్థలే ఇంకా కొనసాగుతున్నాయి. వేలాది ఉద్యోగాలొస్తాయన్నారు. ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు…మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? అని బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ పదేపదే ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షపార్టీగా అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టడం కోసం వారలా మాట్లాడుతూ ఉండవచ్చు.

కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మేమొచ్చి ఇస్తాం అని బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్ర విభజనకు ముందు పదేపదే చెప్పింది. తీరా విభజన ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత నరేంద్రమోదీ మాట్లాడిన తీరు, ఖమ్మం జిల్లాలో కొన్ని మండలాలను ఆంధ్రలో విలీనం చేయించిన తీరు బీజేపీ నిజాయితీపై అనుమానాలను రేకెత్తించాయి. ఇటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత బీజేపీ నాయకత్వానిదే.

కానీ ఢిల్లీలోని వారి ప్రభుత్వమే ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు ఇంత సమయాన్ని ఎందుకు తీసుకుంటున్నదో కూడా ప్రశ్నిస్తే బాగుండేది. ఈ ఉమ్మడి పితలాటకం ఎందుకు పెట్టారో నిలదీస్తే బాగుండేది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నారో అడిగితే బాగుండేది. కృష్ణా జలాల బోర్డు ఆంధ్ర ఫిర్యాదులకు అంత వేగంగా ఎందుకు స్పందిస్తున్నదో, తెలంగాణ ఫిర్యాదులు చేస్తే ఎందుకు చేతులెత్తేస్తుందో తెలుసుకుంటే బాగుండేది.

తెలంగాణకు తన సొంత అధికార యంత్రాంగం లేకపోవడం వల్ల ఇంకా బాలారిష్టాలను ఎదుర్కొంటున్నది. ఉన్న కొద్ది మంది అధికారులు అన్ని పనులు చేయలేకపోతున్నారు. పని ఒత్తిడితో కొన్ని సార్లు అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మన చట్టాలను మనం రూపొందించుకోలేకపోతున్నాం. మన విధానాలను మనం ఖరారు చేసుకోలేకపోతున్నాం.

ఇక పనులు ప్రారంభించేదెలా? నోటిఫికేషన్లు జారీ చేసేదెలా? అసంపూర్ణ విభజన కారణంగా ఇప్పటికీ ప్రభుత్వం ఇక్కట్లపాలవుతున్నది. కిందిస్థాయి అధికార యంత్రాంగం ఇంకా ఆంధ్ర ఆధిపత్య భావజాలం నుంచి బయటపడలేదు. విభజన కారణంగా హైదరాబాద్ ఖాళీ అవుతున్నదన్న అర్థం వచ్చే విధంగా ఒక అధికారి నివేదిక తయారు చేశారు. అది ముఖ్యమంత్రి కేంద్రానికి పంపాల్సిన నివేదిక. బహుశా అలా రాస్తే నిధులు ఎక్కువగా వస్తాయని ఆ అధికారి భావించాడేమో. హైదరాబాద్ ప్రతిష్ఠను మరింత పెంచడానికి, ఉన్నతీకరించడానికి ముఖ్యమంత్రి ఆరాటపడుతుంటే ఇటువంటి నివేదికను ఊహించగలమా? సచివాలయంలో ఇటువంటి ఉదాహరణలు ఎన్నో. నీటిపారుదల శాఖలో పదవీ విరమణ చేసిన ఇంజనీర్ల సర్వీసులను ఉపయోగించుకోవాలని మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారు.

అందుకనుగుణంగా నీటిపారుదల అధికారులు ఒక జాబితాను తయారు చేసి ఆమోదానికి పెట్టారు. మంత్రివద్దకు వచ్చేసరికి ఆ జాబితాలో ఒక కడప ఇంజనీరు పేరు వచ్చి చేరింది. ఒక కిందిస్థాయి అధికారి ఆ పేరును చేర్చుకుని వచ్చాడు. మంత్రి పేషీలో దానిని పసిగట్టి తొలగించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్, సభ్యులు,అధికారులకు కూర్చునేందుకు స్థలం సంపాదించడానికి కూడా నానాతిప్పలు పడాల్సివచ్చింది. పూర్తిస్థాయి సిబ్బందిని ఇవ్వలేదు. ఇప్పుడున్న సిబ్బందిలో ఎవరు ఏరాష్ర్టానికి వెళతారో ఇంకా తేలలేదు. విద్యావ్యవస్థకొస్తే, మనకంటూ ప్రత్యేకమైన సిలబస్ లేదు.

పరీక్షా విధానం లేదు. రిక్రూట్‌మెంట్ విధానం ఇంకా రూపొందించుకోవాల్సి ఉంది. ఆరోగ్య విశ్వవిద్యాలయం అడ్మిషన్లలో ఇంకా మనవాళ్లకు అన్యాయం జరుగుతూనే ఉంది. వివిధ విభాగాలు, విశ్వవిద్యాలయాల్ల్లో ఇంకా ఆంధ్రప్రాంత ఆధిపత్య వ్యవస్థ కొనసాగుతున్నది. కార్మిక సంక్షేమ నిధి మళ్లింపు వివాదం చూశాం. ఖనిజాభివృద్ధి సంస్థ నిధుల మళ్లింపునూ చోద్యంలా చూడాల్సి వస్తోంది. చాలా మంది అధికారులు తాము ఏ రాష్ట్రానికి వెళతామో తేలక ఫైళ్లు ముట్టుకోవడం లేదు. నిర్ణయాలలో భాగస్వాములు కావడం లేదు.

విభజన చట్టంలో లోపాలకు అంతులేదు. మన ప్రాంత రాజ్యసభ సభ్యులను ఆంధ్రకు కేటాయించారు. ఆంధ్ర ప్రాంత సభ్యులను ఇటు కేటాయించారు. సమైక్యరాష్ట్రంలో సాగునీరు, తాగునీరు విషయంలో నష్టపోయింది తెలంగాణ రాష్ట్రం. న్యాయంగా ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదాను ఇచ్చి పూర్తిచేయడానికి సహకరించాలి. కానీ సాగునీరు సమృద్ధిగా అనుభవిస్తున్న ప్రాంతాలకే అదనపు నీరిచ్చే పోలవరం ప్రాజెక్టుకు విభజన చట్టంలో ప్రాధాన్యం ఇచ్చారు. పైగా తెలంగాణలోని ఆరు మండలాలను ఏకపక్షంగా ఆంధ్రలో విలీనం చేశారు.

అక్కడి గిరిజనులను నిర్వాసితులను చేశారు. తెలంగాణ ఉద్యమానికి మూల కారణాల్లో ఒకటి విద్యావకాశాల్లో జరుగుతున్న అన్యాయం. కానీ ఆ అన్యాయాన్ని మరో పదేళ్లపాటు కొనసాగించాలని విభజన చట్టంలో పొందుపర్చడం దుర్మార్గం. ఉమ్మడి హైకోర్టును కొనసాగించడంలో కూడా ఆధిపత్య ప్రయోజనాల దృష్టే తప్ప, న్యాయదృష్టి ఏమీ లేదు.

స్వరాష్ట్ర భావనను జీర్ణించుకోలేని న్యాయవ్యవస్థ నిష్పక్షపాతమైన తీర్పులు చెప్పడం కష్టసాధ్యం. ప్రభుత్వరంగ సంస్థల విభజన విషయంలో తాత్సారం వల్ల అనవసర వైషమ్యాలు పెరుగుతున్నాయి. పైగా చంద్రబాబు నాయుడు ఊరుకోవడంలేదు. విభజన చట్టంలో పెట్టిన మెలికలను ఉపయోగించుకుని తెలంగాణకు వీలైనన్ని సమస్యలు సృష్టిస్తున్నారు. వివిధ ఉమ్మడి విభాగాల నుంచి నిధుల మళ్లింపు ఆయనకు తెలియకుండా జరిగే అవకాశాలు లేవు.

ఆయన ఆ సిబ్బందిని ఒక్క మాట కూడా అనలేదు. శ్రీశైలం నీటిపై ఎక్కడలేని యాగీ చేశారు. ఎంత విడ్డూరమంటే కృష్ణానదిపై అత్యధికంగా నీటిని ఉపయోగించుకునే కాలువలు, ప్రాజెక్టులన్నీ ఆంధ్ర, రాయలసీమల్లోనే ఉన్నాయి. సుంకేశుల, హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడుల ద్వారానే 150 టీఎంసీలకు పైగా నీటిని వాడుకునే అవకాశం రాయలసీమకు ఉంది. కేవలం ఇంత కరువు సీజనులో కూడా రాయలసీమకు 60 టీఎంసీలను మళ్లించుకున్నట్టు ఆంధ్ర ప్రభుత్వమే ప్రకటించింది. నాగార్జుసాగర్ కుడికాలువ, డెల్టాకాలువల ద్వారా 350 టీఎంసీలకుపైగా నీటిని వాడుకునే వెసులుబాటు ఆంధ్రకు ఉంది.

శ్రీశైలంకు దిగువన మనకు వాడుకునే అవకాశం ఉన్నది నాగార్జున సాగర్ ఎడమకాలువ, ఎఎంఆర్ ప్రాజెక్టులు మాత్రమే. మొత్తం వినియోగ సామర్థ్యమే 130 టీఎంసీలు. శ్రీశైలంకు ఎగువన జూరాల, ఆర్డీఎస్‌ల, ఇతర ఎత్తిపోతల పథకాల ద్వారా మనం వాడుకున్నది కేవలం 20 టీఎంసీలు మాత్రమే. వాస్తవాలు ఇలా ఉంటే శ్రీశైలం నుంచి మనమేదో అక్రమంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామంటూ ఢిల్లీ దాకా పంచాయితీ చేశారు చంద్రబాబు. శ్రీశైలం విద్యుత్ కోసం మనం వినియోగించే నీటిలో అత్యధికభాగం తిరిగి ఉపయోగించుకునేది కూడా ఆంధ్రప్రాంతమే. ఈ దుర్వినియోగాన్ని అరికట్టి తెలంగాణకు న్యాయం చేయాల్సిన కృష్ణా బోర్డు ఇప్పుడేమో మేమేమి చేయలేమని సన్నాయినొక్కులు నొక్కుతున్నది. తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలను సరిచేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నది.

కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మేమొచ్చి ఇస్తాం అని బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్ర విభజనకు ముందు పదేపదే చెప్పింది. తీరా విభజన ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత నరేంద్రమోదీ మాట్లాడిన తీరు, ఖమ్మం జిల్లాలో కొన్ని మండలాలను ఆంధ్రలో విలీనం చేయించిన తీరు బీజేపీ నిజాయితీపై అనుమానాలను రేకెత్తించాయి. కాంగ్రెస్ హయాంలో విభజన జరకపోయి ఉంటే బీజేపీ విభజన చేసి ఉండేది కాదు. విభజన సందర్భంగా, ఆ తర్వాత బీజేపీ వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం. విదర్భ విషయంలో ఆ పార్టీ పూర్తిగా మాటమార్చేయడం కూడా ఇందుకు ఉదాహరణ. ఒక వేళ విభజన చేసినా తెలంగాణకు ఇంకా ఎక్కువ నష్టం జరిగి ఉండేది.

ఇప్పటికీ ఆ పార్టీ నాయకత్వం రెండు రాష్ట్రాల విషయంలో పెద్దరికాన్ని ప్రదర్శించడం లేదు అని రాజకీయ విశ్లేషకుడొకరు వ్యాఖ్యానించారు. ఇటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత బీజేపీ నాయకత్వానిదే. విభజన చట్టానికి సవరణలు చేసేప్పుడయినా రెండు రాష్ట్రాలను సంప్రదించి సకల సమస్యలను పరిష్కరించే దిశగా చొరవను చూపాల్సిన అవసరం ఉన్నది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *