mt_logo

తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ధి చెప్పాలి..

తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. సోమవారం నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, గరిడేపల్లిలో నిర్వహించిన ఎమ్మెల్సీ ప్రచార సభల్లో మంత్రులు హరీష్ రావు, జీ జగదీష్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో పరుగులు పెట్టిస్తున్నారని, రాత్రికి రాత్రే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపిన బీజేపీ అభ్యర్థికి ఓటేస్తే తెలంగాణకు కష్టాలు తప్పవన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఉద్యోగుల విభజనను అడ్డుకుంటున్న బీజేపీ, టీడీపీలు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉమ్మడి అభ్యర్థిని నిలిపారని, పట్టభద్రులు ఆ కుట్రను భగ్నం చేయాలని హరీష్ కోరారు.

అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్ళారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా తనను గెలిపించి తెలంగాణ వ్యతిరేక పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా ఇప్పటికే మూడు జిల్లాల్లో సన్నాహక సమావేశాలు ముగించుకున్నారు. నల్గొండ జిల్లా హాలియాలో రోడ్ షో నిర్వహించిన అనంతరం నాగార్జునసాగర్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సింహయ్య, మంత్రి జగదీష్ రెడ్డి, బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నెప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి జీ దేవీప్రసాద్ కు మద్దతు ప్రకటించాలని సీపీఐ నిర్ణయించింది. దేవీప్రసాద్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గానూ ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. సీపీఐ నేతలు తనకు మద్దతు ఇవ్వడంపై దేవీప్రసాద్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఎస్సీ సంక్షేమ సంఘం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జీ నర్సింగ్ రావు కూడా దేవీప్రసాద్ కు మద్దతు ప్రకటించారు. ఉపాథి, శిక్షణ శాఖ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం దేవీప్రసాద్ కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సైదాబాద్ డివిజన్ పరిధిలోని తిరుమల హిల్స్ లో నివాసముండే డీపీఎస్ విద్యాసంస్థల అధినేత ఏవీఎన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. దేవీప్రసాద్ విజయం కోసం కృషి చేస్తామని తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు హెచ్ రాములు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *