mt_logo

విజన్ వికటించి..!

By: సవాల్‌రెడ్డి

ఠింగణాలు బలిసి నింగికి నెగిరిన
జెట్టు చివర పండు చేత బడునె?
పుస్తకముల సదువ బొందునా మోక్షంబు!
విశ్వదాభిరామ వినుర వేమ!

ఠింగణాలు బలిసి ఎగరడం అంటే పొట్టివాడి గంతులు.. మరుగుజ్జు ఎంత ఎగిరి ఎగిరి గంతులు వేస్తే మాత్రం చిటారుకొమ్మన పండు చేతికి అందుతుందా?. డాబుకు పోయి పురాణ గ్రంథాలు ముందేసుకున్నంత మాత్రాన మోక్షప్రాప్తి కలుగుతుందా?.. అని వేమన డబ్బారాయుళ్లు, డంబాచారులను ఎపుడో నిలదీశాడు. అయినా కొందరికి ఎదురు దెబ్బల అనుభవాలు కలిగితే తప్ప జ్ఞానప్రాప్తి కలుగదు. తాజాగా రాధాకృష్ణకు సదరు జ్ఞానప్రాప్తి కలిగింది. వాస్తవంలో బతకాలన్న లోకాచారం బోధపడింది. ఇదే మాట చంద్రబాబుకు హితబోధ చేశారు. నేల విడిచి ఇక సాములు వద్దని ఇటు ఏపీ ప్రజలకూ సుద్దులు చెప్పారు. ఏపీ ప్రభుత్వం దగ్గర భిక్షాపాత్ర తప్ప మరేమీ లేదని తేల్చేశారు. హైదరాబాద్‌ను చూసి వగచి లాభం లేదని, అది ఒక్క రోజులో అభివృద్ధి చెందింది కాదు.. నాలుగువందల ఏండ్లు పట్టిందని కొత్త కొత్తగా చెప్పారు. సరే.. శ్మశానంలో వైరాగ్యం సహజం.

తాజా కేంద్ర బడ్జెట్ దేశానికి కొత్త దారి చూపినా లేకున్నా చంద్రబాబు బృందానికి కొత్త పాఠాలు చెప్పింది. కానీ ఈ పరిస్థితికి కారకులెవరు? ఇన్నాళ్లూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తి ప్రజల్లో లేని ఆశలు కల్పించిందెవరు? రాధాకృష్ణలాంటి భజన బృందం కాదా?.. చంద్రబాబు పోరాట పటిమగలవాడు. నూతన రాష్ట్రాన్ని తీర్చి దిద్దాలని ఆయన కలలు గంటున్నారు.. ప్రమాణం చేయకముందే ఢిల్లీ వెళ్లి నరేంద్రమోదీ సహా కేంద్రమంత్రులను కలిసి తమకు ఏమి కావాలో విన్నవించుకున్నారు. వెంకయ్య పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాజధానికి విరివిగా నిధులు వచ్చే అవకాశం ఉంది… ఇవి రాధాకృష్ణ పలుకులే. అంతేనా జపాను పర్యటనకు వెళితే ఆ దేశంలోని ఐటీ అంతా దిగివచ్చేస్తుందోచ్ అంటూ ప్రచారం.. ఢిల్లీ పర్యటనలు చేస్తే కేంద్రం టన్నులకు టన్నులు వజ్రవైఢూర్యాలు పంపడమే ఆలస్యం అన్నంత బిల్డప్. సింగపూర్ ఇక మీ ఇంటి పక్కకు వచ్చేసినట్టే అంటూ సినిమాలు.

విజనరీ అన్నారు.. చురుకైన నేత అన్నారు.. కేసీఆర్ హైదరాబాద్ దాటలేదు.. బాబు ఢిల్లీ వెళ్లి కరెంటు తెచ్చుకున్నాడు, ముందుచూపున్న వాడు అన్నారు. చక్రాలు తిప్పుతున్నాడన్నారు. కేసీఆర్ కేంద్రంతో సఖ్యతగా లేడు.. బాబు తెలివైన రాజకీయవేత్త అన్నారు. ఇవికూడా రాధాకృష్ణ పలుకులే. కానీ చివరికి ఏమైంది. కొండంత రాగం తీసి…. అన్నట్టు పరిస్థితి. జోగీజోగీ రాసుకుంటే రాలేదేంటి… మా దగ్గర మాత్రం భోషాణాలున్నాయా? ఉన్నంతలో సర్దేశాం అని తేల్చారు వెంకయ్యగారు. బలిష్టుండొకడు ఏనుగునెక్కి విసిరిన నాణెము ఎగిరినంత ఎత్తు.. ధనము కావాలె.. అని మీరనుకుంటే సరిపోతుందా? మా దగ్గరుండవద్దూ..! అని కసిరారు. భగవద్గీతతో అర్జునుడికి కర్తవ్యం బోధపడినట్టు .. రాధాకృష్ణకు వాస్తవం తెలిసివచ్చింది. అందుకే ప్లేటు ఫిరాయించి ఇవాళ వాస్తవాలు గ్రహించాలి అంటూ హితోక్తులు.

గొంతుకోసి వెన్న రాయుట..!
ఈ దుస్థితికి కారకులెవ్వరు? రాధాకృష్ణ లాంటి వారు కాదా? 2009 డిసెంబర్ 9 కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రకటన చేసింది. విజ్ఞత కలిగిన వారు.. ఇక్కడ 60 ఏండ్ల పోరాటాన్ని ప్రజల గాఢవాంఛను గమనించి ఉంటే ఉమ్మడి రాష్ట్రం ఇక సాధ్యం కాదని గ్రహించే వారు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఉండేవారు. వాస్తవానికి ఆరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం మాత్రమే ప్రకటించారు. దానికి అంగీకరించి భవిష్యత్తు ఏమిటి? ఏ రాష్ట్రంలో ఏముండాలి? ఏ రాష్ట్రానికి ఏమివ్వాలి? అని సీమాంధ్ర నాయకులు గానీ, సీమాంధ్ర మీడియా కానీ చర్చలకు తెర తీసి ఉంటే… ఖచ్చితంగా ఏపీకి ఇవాళ్టి దుస్థితి వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే ఆ రోజున తెలంగాణవారు కూడా చర్చలకు సిద్ధంగానే ఉన్నారు. ఎవరికి కావలిసింది వారు డిమాండ్ చేయడం.. ఏదో స్థాయిలో ఒక రాజీ కుదరడం వంటి ఉభయతారక విధానాలకు అవకాశం చిక్కేది. ఎన్నికలకు నాలుగేండ్ల వ్యవధి ఉండేది. అపుడే రాష్ట్ర విభజన జరిగి ఉంటే ఆ నాలుగేండ్లలో విభజన చట్టాల అమలు పరిపూర్ణంగా జరిగి ఉండేది.

రెండు రాష్ట్రాల్లో అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అది తేలికయ్యేది. బహుశా ఇంకా అనేక ప్రయోజనాలు ఏపీకి లభించి ఉండేవి. కానీ చంద్రబాబు లాంటి హ్రస్వ రాజకీయవాదులకు తోడు సీమాంధ్ర మీడియా సొంత ఆస్తుల పరిరక్షణ కోసం ప్రజలను రెచ్చగొట్టాయి. విభజన అనడమే పాపం అన్నట్టు అందరి నోళ్లూ మూయించాయి. బస్సులు పంపి డబ్బులు పంపి ఆందోళనలు రాజేశాయి. ఫలితం తాత్కాలిక ప్రయోజనాలు కలిగినా శాశ్వత నష్టం మిగిలింది. ఇవాళ భిక్షాపాత్రలు మిగిలాయంటే దానికి ఒక జాతి రెండు రాష్ట్రాలు, రాష్ట్రం ముక్కలు చెక్కలు అంటూ రాతలు రాసి రెచ్చగొట్టిన రాధాకృష్ణవంటి వారూ బాధ్యులే! ఇవాళ సుద్దులు చెబితే ప్రయోజనమేమిటి?

ఇన్నాళ్లకు తెలిసింది..
హైదరాబాద్ అభివృద్ధికి నాలుగు వందల ఏండ్లు పట్టిందని ఆర్కే నోట కొత్త మాట వినిపించింది. ఇదేమాట తెలంగాణవాదులు దశాబ్దాలుగా మొత్తుకుంటున్నారు. అయినా సీమాంధ్రులు మేమే నగరాన్ని అభివృద్ధి చేశామని దబాయిస్తున్నప్పుడు రాధాకృష్ణకు నాలుగువందల ఏండ్ల ముచ్చట గుర్తుకు రాలేదు. పైగా సీమాంధ్రనుంచి అనేక మంది వచ్చి వ్యాపారాలు చేసి అభివృద్ధి చేశారని ఇన్నాళ్లూ రాసుకున్నారు. ఇతరులు ఇక్కడ పన్నులు కడుతుంటే ఇక్కడి వాళ్లు సోంబేరుల్లా అనుభవిస్తున్నారని రాయించారు. ఇవాళ చంద్రబాబు మరో హైదరాబాద్‌ను సీమాంధ్రలో సృష్టించడం ఇక సాధ్యం కాదని తేలడంతో అటునుంచి నరుక్కువస్తున్నాడు. సీమాంధ్రులను రాజీకి సిద్ధం చేస్తున్నాడు.

నిజమే.. సంహారం సాధ్యపడనపుడు ఉపసంహారమే శరణ్యం మరి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *