ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు రాయికల్ కు చేరుకుని కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన వృత్తి విద్యా శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ట్రస్ట్ ఆవరణలో ఏర్పాటు చేయబోయే నూతన కళ్యాణ మండపానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి ఓరమ్, చిన్నజీయర్ స్వామి, మంత్రి చందూలాల్, ఎంపీ కవిత, ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, సోమారపు సత్యనారాయణ, రసమయి బాలకిషన్, శోభ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాకముందు నేను ఢిల్లీకి వెళ్ళేటప్పుడు తెలంగాణలోనే అడుగుపెడతానని చెప్పాను.. చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టా. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ.. తల తెగినా అనుకున్నది సాధిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అంకిత భావంతో ఉందని, పెన్షన్ల విషయంలో తీవ్రంగా ఆలోచించి రూ. వెయ్యి పెన్షన్ ఇస్తున్నామని, పెన్షన్లు రానివారు అధైర్యపడకుండా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క అర్హునికీ పెన్షన్లు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
బీడీ కార్మికుల సమస్యలు తనకు తెలుసని, వారి ఇళ్ళల్లో ఉండి చదువుకున్నానని, జగిత్యాల, మేట పల్లిలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, పెన్షన్లు రానివారికి సర్పంచ్ లు సహకరించి వారి పేర్లు నమోదు చేయాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వాలు ఒక్కో కుటుంబానికి కేవలం 20 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు కుటుంబంలోని ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని చెప్పారు. మిషన్ కాకతీయ పేరిట చెరువుల పూడికలు తీసి పూర్వ వైభవం తెస్తామని, మీ ఊరి చెరువు నిండితే మీ ఊరి కడుపు నిండినట్టేనని వివరించారు.
2017 నాటికల్లా తెలంగాణ రైతాంగానికి ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ అందిస్తామని, 2018 నాటికి రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. వాటర్ గ్రిడ్ ద్వారా 2019 లోపు పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ప్రతీ చోటా పరిశుభ్రమైన మంచినీరు అందిస్తామని, ప్రభుత్వం ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సి ఉందని, పార్టీలకతీతంగా కలిసి పని చేద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు.