mt_logo

సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష విజయవంతం

మంగళవారం నాడు టీజేఏసీ తలపెట్టిన సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష విజయవంతమైంది. ఈ దీక్షలో పలువురు తెలంగాణ వాదులు, అన్ని పార్టీల తెలంగాణ నాయకులు, ప్రజాసంఘాలు, జేఏసీ భాగస్వామ్య పక్షాలు, వివిధ సంస్థలు వేల సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా టీ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ, ఆంక్షలు లేని తెలంగాణ మాత్రమే కావాలని, 60 సంవత్సరాలకుపైగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతూ వస్తుందని, కొత్త రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే సహించేది లేదని హెచ్చరించారు. నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు విపరీతమైన అన్యాయం జరిగిందని, ఇకపై కూడా అలాంటి కుట్రలు చేద్దామని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన బిల్లులో తెలంగాణకు నష్టం కలిగించే 13 అంశాలు ఉన్నాయని, వాటిపై సవరణలు జరిపి బిల్లును పార్లమెంటుకు వెంటనే పంపించాలని కోదండరాం అన్నారు. ఇవాళ కాకపోతే రేపైనా తెలంగాణ సాధించుకుంటామని, సీమాంధ్రులు కుట్రలు ఆపి చర్చ జరిగేలా చూడాలని, చర్చ జరక్కపోతే నష్టం జరిగేది సీమాంధ్రకేనని ఈ సందర్భంగా కోదండరాం సూచించారు.

13 అంశాలపై సవరణలు ఈ విధంగా ఉన్నాయి. అవి, హైదరాబాద్ ను రెండేళ్ళు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, అత్యంత ఆధునిక టెక్నాలజీతో కొత్త రాజధానిని నిర్మించుకోవచ్చని, ఉమ్మడి రాజధాని పరిధి ఖైరతాబాద్ కు పరిమితం చేయాలని, శాంతి భద్రతలపై గవర్నర్ గిరీ అక్కర్లేదని, ఇరు రాష్ట్రాలకూ వేర్వేరు హైకోర్టులు ఉండాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవకతవకలు ఉండరాదని, తెలంగాణకు అవసరమైన విద్యుత్ కేంద్ర విద్యుత్ సంస్థల ద్వారా అందించాలని, గోదావరీ జలాల వినియోగాన్ని బోర్డులు పర్యవేక్షించాల్సిన అవసరం లేదని, పోలవరం ప్రాజెక్టు నిర్మించ వద్దని, ఉమ్మడి ఎంట్రెన్స్ పరీక్షల పద్దతి వద్దని, ఉద్యోగుల నియామకం స్థానికత ఆధారంగా తీసుకోవాలని, అక్రమంగా తెలంగాణలో ఉద్యోగం పొందిన సీమాంధ్ర ఉద్యోగుల పెన్షనులు సీమాంధ్ర ప్రాంతం నుండే చెల్లించాలని, తెలంగాణకు పీఎస్ సీని ఏర్పాటు చేయాలని టీ జేఏసీ ఈ సందర్భంగా సూచించింది. దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సంపూర్ణ తెలంగాణ తమ హక్కని, సర్వశక్తులు ఒడ్డైనా తెలంగాణను సాధించుకుంటామని చెప్పారు.

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తీరుతుందని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు స్పష్టం చేశారు. దోచుకున్న భూముల కోసమే సీమాంధ్ర నాయకులు ఉమ్మడి రాజధాని ప్రతిపాదన తెచ్చారని, తెలంగాణను అడ్డుకునేవారిని వదిలిపెట్టమని జేఏసీ కోచైర్మన్ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ, సమైక్యాంధ్ర సింహం కావాలని కిరణ్ కుమార్ రెడ్డి కలలు కంటున్నారని, ఆఖరి బంతి మిగిలే ఉందని చెబుతున్న స్టార్ బ్యాట్స్ మెన్ ను ఎలా పంపించాలో తమకు తెలుసని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 13 లక్షలమంది ఉద్యోగుల్లో 5.40 లక్షలమంది తెలంగాణ ఉద్యోగులు ఉండాల్సింది అందులో సగం మంది కూడా లేరని, జీవో 610, రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా నియామకమైన వారంతా తిరిగి వారి వారి ప్రాంతాలకు వెళ్లాల్సిందేనని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *