తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తమకు నూకలు చెల్లిపోతాయని భావించిందో ఏమో గానీ, ల్యాంకో మహమ్మారి ఒక్కసారిగా వొళ్ళు విరుచుకుని తన ప్రతాపాన్ని మరోసారి తెలంగాణ మీద చూపించడానికి తయారయ్యింది. అందిన కాడికి దోచుకోవడానికి ఏమేం మార్గాలుంటాయో అని తెలివిగా చూస్తుంది.
ల్యాంకో పవర్ ప్రాజెక్టుతో కుదుర్చుకున్న పీపీఏ 2015 సం.తో పూర్తి కావస్తుండడంతో మొదటి పది సంవత్సరాలకు వంద శాతం ట్యాక్స్ హాలిడే ఉంటుంది. ఆదాయపన్ను చట్టంలోని 80(1) ప్రకారం ఇండిపెండెంట్ పవర్ ప్రాజెక్టు మొదలైనప్పటినుండి పది సంవత్సరాల వరకు టాక్స్ హాలిడే వర్తిస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. కానీ ల్యాంకో యాజమాన్యం సుప్రీంకోర్టునుంచి రీఇంబర్స్ మెంట్ ఆఫ్ మినిమం ఆల్టర్నేటివ్ టాక్స్(మ్యాట్) కింద పరిహారం ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు పొందింది. దీనిద్వారా డిస్కంలకు మరో వెయ్యికోట్ల కుచ్చుటోపీ పెట్టదల్చుకుంది. ఈ వ్యవహారాన్నంతా డిస్కంలుగానీ, ఏపీపీసీపీ చైర్మన్ గానీ చూసీ చూడనట్లు ఊరుకుని ల్యాంకోకు పరిహారం చెల్లించడానికే సమాయత్తమవడం క్షమించరాని నేరం.
ల్యాంకోకు రాజకీయ నేతల అండదండలు ఉన్నాయనడం జగమెరిగిన సత్యం. ఇప్పటికే వేలకోట్ల నష్టాల్లో ఉన్న డిస్కంలు నష్టాల పేరుతో 4వేలకోట్ల వరకు చార్జీల పెంపు భారాన్ని ప్రజలపై వేసింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో సుప్రీంకోర్టు నుండి మ్యాట్ చెల్లింపులపై కొంత సమయం తీసుకోవచ్చు. కానీ అదేమీ చేయకుండా సీమాంధ్ర పాలకులు ల్యాంకో పవర్ ప్రాజెక్టు కు వంద కోట్ల మేర చెల్లించడానికి సిద్ధమవుతున్నారు. 50 కోట్లు బ్యాంక్ గ్యారెంటీగా, మరో 50కోట్లు నగదు రూపంలో చెల్లించనున్నారు. ఇదే బాటన మరికొన్ని సీమాంధ్ర పవర్ ప్రాజెక్టులు కూడా సుప్రీంకోర్టు ను ఆశ్రయించి తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు పొందే అవకాశం ఉంది. ఒకవేళ ఫైనల్ తీర్పు డిస్కం లకు అనుకూలంగా వచ్చినా, ల్యాంకో నుండి చెల్లించిన మొత్తం రికవరీ చేసుకోవడం అసాధ్యం. ఎందుకంటే విద్యుత్ ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికే చెందుతాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి రికవరీ చేయడం కుదరదని విద్యుత్ నిపుణులు అభిప్రాయం వెల్లడిస్తున్నారు.