mt_logo

స్టార్టప్స్ కి కేరాఫ్ అడ్రస్ తెలంగాణ : మంత్రి కేటీఆర్

స్వతంత్ర భారతావనిలో విజయవంతమైన స్టార్టప్‌గా తెలంగాణ నిలుస్తున్నదని, రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ అనేక రంగాల్లో విశేషంగా అభివృద్ధి సాధిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. భౌగోళికంగా, జనాభాపరంగా చిన్నదే అయినా దేశ స్థూలజాతీయోత్పత్తి వృద్ధికి తోడ్పాటునందిస్తున్న నాలుగవ అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సోమవారం నోవాటెల్‌లో ది ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌(టై) గ్లోబల్‌ సమిట్‌-2022ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎనిమిదిన్నర ఏండ్లల్లో తెలంగాణ ఎన్నో సంచలన విజయాలను నమోదు చేసిందన్నారు. తలసరి ఆదాయంలో 130 శాతం, జీఆర్‌డీపీలో 130 శాతం పెరుగుదల సాధించిందని, ఐటీ ఎగుమతులు 250 శాతం, వ్యవసాయ యాక్టివిటీ 190 శాతం పెరిగాయని వివరించారు. రాష్ట్రంలో పచ్చదనం 24 శాతం పెరిగిందని తెలిపారు. ‘దేశంలో భౌగోళికంగా 11వ స్థానంలో, జనాభాపరంగా 12వ స్థానంలో ఉన్నప్పటికీ.. దేశ స్థూలజాతీయోత్పత్తికి అత్యధికంగా దోహదపడుతున్న 4వ అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ రాణిస్తున్నది. 50 కేజీల బాక్సర్‌ 100 కేజీల క్యాటగిరీలో ఆడినట్టుంది’ అని కేటీఆర్‌ చమత్కరించారు.

కరోనా సందర్భంగా ప్రపంచంలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లలో మూడింట ఒక వంతు హైదరాబాద్‌లోనే తయారయ్యాయని కేటీఆర్‌ చెప్పారు. తొమ్మిది బిలియన్‌ డోసులు ఇక్కడినుంచే ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అయ్యాయని, వచ్చే ఏడాది ఇవి 14 బిలియన్లకు పెరుగనున్నాయని, ఇది గ్లోబల్‌ ప్రొడక్షన్‌లో 50శాతంగా ఉండనున్నాయని వివరించారు. లైఫ్‌సైన్సెస్‌తోపాటు ఐటీ రంగంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. యాపిల్‌, గూగుల్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌, ఊబర్‌, మైక్రాన్‌, క్వాల్‌కామ్‌.. ప్రపంచంలోని అతిపెద్ద దిగ్గజ సంస్థలు తమ రెండవ అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో నెలకొల్పాయని కేటీఆర్‌ గుర్తుచేశారు.

తొలి స్పేస్‌ స్టార్టప్‌ :

ఇన్నోవేషన్‌ ద్వారా దేశాలు పోటీ ప్రయోజనాన్ని సృష్టించగలవని, తద్వారా సమ్మిళిత వృద్ధిని సాధించగలవని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత అనిశ్చిత, సంక్లిష్ట, సందిగ్ధ పరిస్థితుల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సంపద సృష్టికి కృషిచేసే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణ స్టార్టప్‌ ఎకోసిస్టం సాధించిన విజయాలను వివరిస్తూ, 50కిపైగా రంగాల్లో 6500 పైచిలుకు స్టార్టప్‌లు తెలంగాణలో ఉన్నాయని కేటీఆర్‌ వివరించారు. ప్రైవేట్‌రంగంలో భారత తొలి స్పేస్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ టీహబ్‌ లోనే అంకురించిండం గర్వంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా హైదరాబాదీ స్టార్టప్‌.. డార్విన్‌బాక్స్‌ ఈ ఏడాది ప్రారంభంలో యూనికార్న్‌గా మారిందని పేర్కొన్నారు.

ప్రముఖ హెచ్‌ఆర్‌ టెక్నాలజీ సంస్థ కేకా భారతదేశంలోనే అతిపెద్ద సిరీస్‌ ఏసస్‌ నుంచి 57 మిలియన్‌ డాలర్ల నిధులను సేకరించిందన్నారు. టీహబ్‌, టీఎస్‌ఐసీ, వీహబ్‌, రిచ్‌, టాస్క్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వంటి ఎకోసిస్టం ద్వారా టై వంటి సంస్థలకు తమ సహకారం ఉంటుందని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఇన్నోవేషన్‌ ఎకోసిస్టం పెట్టుబడిదారులు, వాటాదారులకు ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఈ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు టై 30 ఏండ్ల ప్రస్థానంలో ఎంతగానో కృషిచేసిందని ప్రశంసించారు. వివిధ అంశాల్లో నైపుణ్యం గలవారితో తగిన సహకారం అందించడమే కాకుండా మార్గదర్శకత్వం, విద్య, సాంకేతికత, ఉత్పత్తి మద్దతు, ప్రపంచ విస్తరణ, వ్యాపార నెట్‌వర్క్‌ అభివృద్ధి, ఫైనాన్సింగ్‌, మార్కెటింగ్‌, ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడిదారులు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార భాగస్వామ్యం వంటి అంశాల్లో సహకారం అందించిందన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ స్పేస్‌:

ప్రజలకు ఉపయోగపడే టెక్నాలజీ రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరుకుంటారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈ ఏడాది జూన్‌ 28న టీ-హబ్‌ 2.0ను 2.1మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ స్పేస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్టు తెలిపారు. 7 సంవత్సరాల ప్రయాణంలో టీహబ్‌ 1,100మంది వ్యవస్థాపకులకు మద్దతును అందించిందని, 1.9 బిలియన్ల సేకరణలో వారికి సహాయపడిందని వివరించారు. రాష్ట్రంలో బలమైన ఎకోసిస్టంను అభివృద్ధి చేయడంలో డీపీఐఐటీ తెలంగాణను టాప్‌ పెర్ఫార్మర్‌గా గుర్తించిందన్నారు. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ నివేదికలోనూ తెలంగాణ నాలుగవ స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు.

టైతో పారిశ్రామిక ప్రోత్సాహం: బీజే అరుణ్‌

మంత్రి కేటీఆర్‌ పారిశ్రామికవేత్తలకు ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నారని టై గ్లోబల్‌ చైర్మన్‌ బీజే అరుణ్‌ కొనియాడారు. పారిశ్రామికవేత్తలను తయారుచేయడంలో 30 ఏండ్లుగా టై ఎంతో కృషి చేస్తున్నదని, వారికి ప్రోత్సాహం అందించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రిలియన్‌ డాలర్‌ సంపద సృష్టికి దోహద పడిందని చెప్పారు. ఇది భారత జీడీపీలో మూడింట ఒక వంతు అని వివరించారు.

కేటీఆర్‌ సారథ్యంలో ఎంతో అభివృద్ధి: శంతను నారాయణ్‌

అడోబ్‌ సిస్టమ్స్‌ చైర్మన్‌ శంతను నారాయణ్‌ మాట్లాడుతూ.. సొంత నగరానికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉన్నదని చెప్పారు. తాను హైదరాబాద్‌లోని పెరిగానని, ఇక్కడే చదువుకొన్నానని అన్నారు. ఇక్కడి వారితో ‘మనవాడు’ అని అనిపించుకోవటం ఇంకా గొప్పగా ఉన్నదని తెలిపారు. సంపద సృష్టిలో తెలంగాణ ఎంతో పురోగతి సాధిస్తున్నదని కొనియాడారు. మంత్రి కేటీఆర్‌ సారథ్యంలో పారిశ్రామిక రంగం ఎంతగానో అభివృద్ధి చెందుతున్నదని, ముఖ్యంగా హైదరాబాద్‌ నగరం అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించిందని శ్లాఘించారు. స్టార్టప్‌ల అభివృద్ధిలో టీ-హబ్‌ విశేషంగా కృషిచేస్తున్నదని గుర్తుచేశారు. టెక్నాలజీ, మెడిసిన్‌, విద్య తదితర రంగాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విశేష అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహం అందించడంలో కృషి చేస్తున్నందుకు ‘టై’ని శంతను ప్రశంసించారు.

మంత్రి కేటీఆర్‌తో పీఅండ్‌జీ ప్రతినిధి బృందం భేటీ

ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్‌ (పీ అండ్‌ జీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో ఎల్‌వీ వైద్యనాథన్‌ నేతృత్వంలో సంస్థ ప్రతినిధిబృందం సోమవారం నోవాటెల్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, సంస్థ సీనియర్‌ డైరెక్టర్‌ శుభ్రాంశు దత్తా, డైరెక్టర్‌ సచన్‌ సైనీ, మేనేజర్‌ ముత్తుప్రశాంత్‌ తదితరులు మంత్రిని కలిసినవారిలో ఉన్నారు.

శంతను నారాయణ్‌కు సీఈవో ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు
సోమవారం జరిగిన టై గ్లోబల్‌ సమిట్‌లో అడోబ్‌ చైర్మన్‌, సీఈవో శంతను నారాయణ్‌కు సీఈవో ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును మంత్రి కేటీఆర్‌ అందజేశారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టై హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ సురేశ్‌ రాజు, వైస్‌ చైర్మన్‌ మురళి బుక్కపట్నం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *