mt_logo

12న రాజ్యసభకు తెలంగాణ బిల్లు

తెలంగాణ బిల్లుపై అనేక కుట్రలు చేసి అడుగడుగునా కవ్వింపు ధోరణితో రెచ్చగొట్టిన సీమాంధ్ర నేతల ఆటలకు ఇక చెల్లుచీటీ. నెత్తీ నోరూ బాదుకుంటూ తెలంగాణ ఏర్పాటు జరగదు, బ్రహ్మాస్త్రం ఉపయోగించాను అని ప్రగల్భాలు పలికిన సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, సీమాంధ్ర నేతలకు చెంపపెట్టులా కేంద్ర కేబినెట్ తెలంగాణను ఆమోదిస్తూ శుక్రవారం సాయంత్రం నిర్ణయం తీసుకుంది. ఇక బిల్లుపై ఏవైనా కొన్ని సందేహాలుంటే అవీ పటాపంచలయ్యాయి. హైదరాబాద్ యూటీ ప్రతిపాదన, రాయల తెలంగాణ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ నో చెప్పింది. భద్రాచలం డివిజన్ తెలంగాణకు, పోలవరం ముంపు గ్రామాలు ఏపీకి అని నిర్ణయించారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని 32 ప్రభుత్వ సవరణలు, 294 పేజీలతో బిల్లును తయారు చేశారు. అసెంబ్లీకి పంపిన బిల్లునే యథాతథంగా ఆమోదించి దానికి రాష్ట్ర అసెంబ్లీలో చర్చ సందర్భంగా వచ్చిన 32 సవరణలు చేర్చారు. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు హోం శాఖకు పంపిన తర్వాత అక్కడినుండి రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత బిల్లు 12న రాజ్యసభలో సుశీల్‌కుమార్ షిండే ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ తో పాటు కేంద్రమంత్రులు సుశీల్‌కుమార్ షిండే, జైరాం రమేష్, చిదంబరం, వీరప్ప మొయిలీ, తెలంగాణ నుంచి జైపాల్‌రెడ్డి, సీమాంధ్ర నుంచి పళ్ళంరాజు, కావూరి,కిశోర్ చంద్రదేవ్ తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న సీమాంధ్ర మంత్రుల డిమాండ్‌ను కేబినెట్ కొట్టిపారేసిందని, అసలు ఈ డిమాండే తప్పని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్యాకేజీని ఇవ్వడానికి అంగీకరించింది. తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు కూడా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు, భద్రాచలం తెలంగాణ పరిధిలోకి ఒస్తుందని, పోలవరం ముంపు గ్రామాలు సీమాంధ్ర ప్రాంతపరిధిలోకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. పదేళ్ళపాటు సీమాంధ్ర విద్యార్థులకు తెలంగాణలోని విద్యాసంస్థల్లో సీట్లు రిజర్వ్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌కు శాంతిభద్రతల అధికారం అప్పగించడాన్ని తెలంగాణ వాదులు తిరస్కరించినా, కేంద్ర కేబినెట్ ఆమోదించింది. హైదరాబాద్‌లో తమకు రక్షణ లేదని సీమాంధ్ర మంత్రి కావూరి సాంబశివరావు అనగానే జైపాల్‌రెడ్డి అలాంటిదేమీ ఉండదని వారించినట్లు తెలిసింది. 15వ లోక్‌సభకు ఈ సమావేశాలే చివరివి కావడంతో ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని, రాజ్యసభకు బిల్లు పంపితే బిల్లు వీగిపోయే అవకాశాలు లేకపోవడం, ప్రశాంతంగా ఆమోదం జరుగుతుందని ఆలోచించి బిల్లును మొదట రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *