mt_logo

ఢిల్లీకి తెలంగాణ బిల్లు షురూ…

రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు-2013 పై చర్చ అసెంబ్లీలో గురువారంతో ముగిసిపోయింది. సభ్యుల అభిప్రాయాలను, సవరణలను రాష్ట్రపతికి పంపనున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి తెలిపారు. వారి ప్రకటనతో తెలంగాణ బిల్లు ప్రక్రియ అసెంబ్లీ నుండి ఢిల్లీకి చేరుకోనుంది. ఇక తెలంగాణ బిల్లు కేంద్రం పరిధిలోనిదేనని, సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాలు ఆర్టికల్ 3ని ఏవిధంగానూ ప్రభావితం చేయబోవని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. సీమాంధ్ర పెట్టుబడి చానళ్ళు మాత్రం బిల్లు తిరస్కరించబడిందనే ప్రచారంతో ఎన్నిరకాల ఎత్తుగడలు వేసినా బిల్లు రాష్ట్రపతికి పంపించే ఏర్పాట్లు అత్యంత వేగంగా జరిగిపోతున్నాయి. సీమాంధ్ర మీడియా రక్కసి కోరలు చాపి విషాన్ని చిమ్ముతున్న తరుణంలో దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, రాష్ట్రానికి చెందిన అన్నిపార్టీల తెలంగాణ నేతలు, పలువురు తెలంగాణ వాదులు సీమాంధ్ర చానళ్ళ దుష్ప్రచారన్ని తిప్పికొట్టారు. తాత్కాలిక ఆనందం పొందడం తప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేమని తెలిసికూడా ఈ విధమైన ప్రచారం చేయడం వారి అవివేకానికి, అవగాహనారాహిత్యానికి నిదర్శనమని టీఆర్ఎస్ నేత కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఫిబ్రవరి 15కల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, తెలంగాణ ప్రజలు ఏవిధమైన భావోద్వేగాలకు గురికావొద్దని ఆయన యావత్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించరాదనే నిబంధనలు ఉన్న తరుణంలో సీమాంధ్ర నాయకులు సమైక్య సింహం అని తమను తాము గొప్పగా ఊహించుకొని విర్రవీగుతున్నారని పలువురు తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లు ఫిబ్రవరి 2న కేంద్రానికి పంపబడుతుందని, 4న జరిగే జీవోఎం సమావేశంలో కమిటీ సభ్యులు అసెంబ్లీ నుండి వచ్చిన సవరణలు, అభిప్రాయాలు చర్చించి అవసరమైన సవరణలు చేసి పూర్తి బిల్లును పార్లమెంటుకు పంపి ఆమోద ప్రక్రియ ప్రారంభిస్తారని సమాచారం. రాష్ట్రపతి సంతకంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముగుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *