గురువారం హైదరాబాద్ లోని టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ డైరీ ఆవిష్కరణలో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. సీఎం, శైలజానాథ్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ బిల్లు అడ్డుకోలేకపోయారని, అసెంబ్లీలో ఎందుకూ పనికిరాని తీర్మానం ప్రవేశపెట్టి సీఎం ఎంత తొండి చేసినా తెలంగాణ ప్రక్రియ ఆగిపోదని, త్వరలో తెలంగాణ రాష్ట్రంలో విజయోత్సవాలు చేసుకోవాలని తెలంగాణ ప్రజలకు కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలెవ్వరూ ఆందోళన పడవద్దని, రాష్ట్ర ఏర్పాటు ఖాయమని, తెలంగాణపై ఉన్న 13 ఆంక్షలను సవరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని వివరించారు.
టీ జేఏసీ కార్యాలయంలో జరిగిన జేఏసీ స్టీరింగ్ కమిటీలో పాల్గొన్న తర్వాత ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో టీ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ, సంపూర్ణ తెలంగాణ సాధనే మనముందున్న లక్ష్యమని, ఫిబ్రవరి 6న బయలుదేరి ఢిల్లీ వెళ్లి వారంరోజులపాటు అక్కడే ఉండి పార్లమెంటు సభ్యులను కలిసి తెలంగాణ బిల్లుపై ఆమోదం తెలపమని కోరుతామన్నారు. మరో 20రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితీరుతుందని, సంబురాలకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో కో చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, సీ.విఠల్, జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.