తెలంగాణ బిల్లు తిరస్కరించబడలేదని, కేవలం అభిప్రాయాలు మాత్రమే సభలో చెప్పారని, బిల్లుపై అసలు ఓటింగ్ జరగలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. గురువారం తననివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం తనకున్న అభ్యంతరాలను మాత్రమే సభలో తీర్మానం రూపంలో ప్రవేశపెట్టారని, అదే మూజువాణి ఆమోదం పొందిందని స్పష్టం చేశారు. అది బిల్లును తిరస్కరించడం కాదని, స్పీకర్ అసెంబ్లీ అభిప్రాయాలను రాష్ట్రపతికి పంపించనున్నారని తెలిపారు. గురువారం అసెంబ్లీలో జరిగిన గందరగోళ పరిస్థితులు రాజ్యాంగబద్ధమైన విభజన ప్రక్రియను ఏవిధంగానూ ప్రభావితం చేయవన్నారు. రాష్ట్రపతి పంపిన విభజన బిల్లు పై చర్చ జనవరి 30న ముగిసిందని, చర్చలో వచ్చిన అభిప్రాయాలు, సవరణలు కేంద్ర కేబినేట్ పరిశీలించినమీదట తగు నిర్ణయాలు తీసుకుని పార్లమెంటుకు బిల్లు పంపబడుతుందని, బిల్లు ఆమోద ప్రక్రియ అప్పుడు మొదలవుతుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అసెంబ్లీలో సీఎం ప్రవేశపెట్టిన తీర్మానం ఆర్టికల్ 3ని ప్రభావితం చేయలేదన్నారు. రెండూ వేర్వేరు అంశాలని, తెలంగాణ బిల్లుకు, సీఎం అభిప్రాయాలు ఉన్న తీర్మానం ఒక్కటికాదని మరోసారి స్పష్టం చేశారు.