mt_logo

స్వచ్ఛభారత్ మిషన్‌లో తెలంగాణకు అవార్డుల పంట.. ఏకంగా 12 అవార్డులు

స్వచ్ఛభారత్ మిషన్‌లోని పలు విభాగాల్లో తెలంగాణ ఏకంగా 12 అవార్డులు దక్కించుకొని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్వచ్ఛ్ అవార్డులకు దేశంలోని 4,300 నగరాలు,పట్టణాలు పోటీ పడగా అన్నిటినీ దాటుకొని తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు పట్టణాలకు అవార్డులు దక్కాయి. తెలంగాణలోని 9 పట్టణాలు ( గ్రేటర్‌ హైదరాబాద్‌, సిరిసిల్ల, సిద్దిపేట, నిజాంపేట, ఇబ్రంహీంపట్నం, కొస్గి, హుస్నాబాద్‌, ఘట్‌కేసర్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌) స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు గెలవడంతో పాటు సఫాయి మిత్ర సురక్ష విభాగంలో రాష్ట్రాల కేటగిరీ కింద బెస్ట్ స్టేట్ గా తెలంగాణ రాష్ట్రం, పట్టణాల విభాగంలో కరీంనగర్ ఎంపికయ్యాయి. అలాగే గార్బెజ్ ఫ్రీ సిటీ విభాగంలో హైదరాబాద్ కు అవార్డు దక్కింది. సఫాయి మిత్ర సురక్ష విభాగాన్ని కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టినప్పటికీ.. పారిశుద్ధ్య కార్మికుల భద్రతతో పాటు పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే విధానంలో అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణ, అత్యుత్తమ పట్టణంగా కరీంనగర్ ముందు వరుసలో నిలిచాయి. సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో దేశం మొత్తం మీద 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 243 పట్టణాలు పోటీ పడగా కరీంనగర్ పట్టణం మొదటి మూడింట్లో ఒకదానిగా నిలవడం గమనార్హం. ఈ అవార్డు కింద మొదటి స్థానంలో నిలిచిన పట్టణానికి 8 కోట్లు,రెండవ స్థానంలో నిలిచిన పట్టణానికి 4 కోట్లు, మూడవ స్థానానికి 2 కోట్లు ఇవ్వనున్నారు. కరీంనగర్ పట్టణం ఏ స్థానానికి ఎంపికైంది అనేది ఈ నెల 20న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేత అవార్డులు అందుకునేప్పుడు తెలియనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *