ప్రపంచ స్పేస్ టెక్నాలజీ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ నిర్ణయించింది. అంతరిక్ష సాంకేతిక కార్యకలాపాలకు హైదరాబాద్ ఇప్పటికే కీలక కేంద్రంగా నెలకొంది. ఈ నేపథ్యంలో సంబంధిత రంగానికి చెందిన పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ‘తెలంగాణ స్పేస్‌టెక్ పాలసీ ఫ్రేమ్‌వర్క్’ను రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రూపొందించిన ఇందుకు సంబంధించిన ముసాయిదాను విడుదల చేసిన ఐటీ శాఖ, దీనిపై ఈ నెల 25లోగా సలహాలు ఇవ్వాల్సిందిగా కోరింది.
రోజువారీ సవాళ్ల పరిష్కారం :
ప్రజల దైనందిన జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలకు చూపడంలో అంతరిక్ష సాంకేతికత అంచనాలకు మించి ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. భారతీయ అంతరిక్ష సాంకేతిక రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సాహించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ‘స్పేస్‌కామ్ పాలసీ 2020’, ‘స్పేస్ ఆర్‌ఎస్ పాలసీ 2020’, ‘జియో స్పేషియల్ పాలసీ 2021’ వంటి వాటిని విడుదల చేసింది. దీంతో ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’(ఎన్‌ఎస్‌ఐఎల్), ‘ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్’(ఇన్‌స్పేస్) వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి.
ఈ నేపథ్యంలో అంతరిక్ష ఆర్థిక రంగంలో ప్రైవేటు రంగం మద్దతు కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ స్పేస్‌టెక్ పాలసీ ఫ్రేమ్‌వర్క్’ను సిద్ధం చేసింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సాంకేతికతకు తెలంగాణ రాష్ట్రాన్ని తొలి గమ్యస్థానంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వ్యాపార, వాణిజ్యాభివృద్ధి, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్లకు పరీక్ష కేంద్రంగా తీర్చిదిద్దడం, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, భాగస్వామ్యాలను ఆహ్వానించడం వంటి లక్ష్యాలను ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా సాధించాలని భావిస్తోంది. దీనికోసం మౌలిక వసతులు, వాణిజ్య అవకాశాలు, నైపుణ్యాభివృద్ది, శిక్షణ, పరిశోధన, ఆవిష్కరణల కోసం అనేక విధాన నిర్ణయాలు తీసుకోనుంది.
ఇప్పటికే స్పేస్ టెక్నాలజీ రంగంలో పేరొందిన అనంత్ టెక్నాలజీస్, వీఈఎం టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్ వంటి సంస్థలు, స్కై రూట్, ధ్రువ వంటి స్టార్టప్‌లతోపాటు డీఆర్‌డీఓ, ఎన్‌ఆర్‌ఎస్, అడ్రిన్, డీఆర్‌డీఎల్, ఆర్‌సీఐ, బీడీఎల్, ఆర్డినెన్స్ ప్యాక్టరీ వంటి రక్షణ రంగ పరిశోధన, తయారీ సంస్థలు హైదరాబాద్‌లో అంతరిక్ష సాంకేతిక వాతావరణానికి ఊతమిస్తున్నాయి. మార్స్ ఆర్బిటర్ మిషన్‌లోని 30 శాతం విడిభాగాలు రాష్ట్రంలోనే తయారయ్యాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర టెక్నాలజీ పాలసీ ఆశించిన ఫలితాలను రాబడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.