mt_logo

పంపిణీకి సిద్దమైన కోటి బతుకమ్మ చీరలు

తెలంగాణలో బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆడపడుచులందరికి బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధం అయినట్టు టెస్కో ప్రత్యేక అధికారిని శైలజరామయ్యర్ తెలిపారు. ఈ మేరకు.. శైలజరామయ్య మాట్లాడుతూ.. “తెలంగాణ రాష్ట్రంలో శుభఫ్రదమైన అతి పెద్దదయిన బతుకమ్మ పండుగను సాంప్రదాయబధ్ధంగా ఎంతో ఘనంగా జరుపుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. ఇది ముఖ్యంగా మహిళలందరికీ ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ సందర్భంగా 2017 సంవత్సరము నుండి రాష్ట్రంలోని 18 సంవత్సరములు పైబడి ఆహార భద్రత కార్డ్ క్రింద నమోదు కాబడిన మహిళలకు చీరలను బహుమతిగా పంపిణీ చేయుటకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంచినది.

ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.. మరమగ్గాల నేత పని వారికి కూలీ పెంపుదల ద్వారా నిరంతరం పని కల్పిస్తూ వారి యొక్క జీవన స్థితిని మరియు వారి నైపుణ్యమును మెరుగుపర్చుట మరియు  తెలంగాణ యొక్క అతిపెద్దయిన, మహిళలందరికీ ఇష్టమైన బతుకమ్మ పండుగ శుభదినాన, తెలంగాణ రాష్టంలోని మహిళలను ఒక బహుమతితో గౌరవించడం.

2017 లో బతుకమ్మ పండుగ శుభదినాన ఆహార భద్రత కార్డు క్రింద నమోదు కాబడిన 95,48,439 మహిళా లబ్దిదారులకు, 2018 లో 96,70,474 మహిళా లబ్దిదారులకు 2019 లో 96,57,813 మహిళలకు మరియు 2020 లో 96,24,384 చీరలను ఆడపడుచులకు ప్రభుత్వ కానుకగా పంపిణి చేసినది. ఈ క్రమంలో ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 2021 నెలలో రానున్న బతుకమ్మ పండుగ శుభసందర్భాన చీరలను ప్రభుత్వ కానుకగా పంపిణి చేయుటకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

మెప్మా మరియు సెర్ప్ క్రింద స్వయం సహాయక బృందములు యొక్క మహిళా ప్రతినిధులు నుండి అభిప్రాయములు మరియు సలహా సంప్రదింపుల ఆధారంగా మరియు నిఫ్ట్ డిజైనరులతో సరైన డిజైన్ పాటర్న్ లతో మరియు ప్రామాణికములతో ఈ సంవత్సరం బతుకమ్మ చీరలను నూతన డిజైనులతో ఉత్పత్తి చేయడమైనది.

ఈ సంవత్సరం 30 సరికొత్త డిజైన్లను రూపొందించి వాటిని 20 విభిన్న రంగులతో మొత్తం 810 రకాల చీరలను అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఈ చీరలన్నీ జరి అంచులతో తయారు చేయబడిన 100% పాలిస్టర్ ఫిలిమెంట్ / నూలు తో తయారు చేయబడి అర్హత కల్గిన అందరు మహిళలకు పంపిణి చేయుటకు సిద్ధం చేయబడినవి. 6.30 మీటర్ల పొడవుగల ఒక కోటి సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించు 9.00 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షలు తయారుచేయించడమైనది. సదరు ప్రాజెక్టు కొరకు మొత్తం రూ.333.14 కోట్లు కేటాయించడమైనది.

సిరిసిల్ల ప్రాంతంలోని చేనేత సామాజిక వర్గాలలోని పేదరికము మరియు ఆత్మహత్యలను నివారించే విధంగా సిరిసిల్ల పవర్ లూమ్ క్లస్టర్ లో గల 16,000 మంది నేత పనివారు మరియు సంబంధిత కార్మికులకు నిరంతరంగా పని కల్పించుటకు గాను 20,000 పవర్లూమ్స్ మీద బతుకమ్మ చీరలు ప్రతి సంవత్సరము ఉత్పత్తి చేయబడుతున్నవి. ఈ సంవత్సరం కూడా సిరిసిల్ల కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాలోని (373)మాక్స్ సంఘాలు / ఎస్.ఎస్.ఐ యూనిట్లలో 10,000 – 16,000 ఢాబీ/జకార్డు బిగించబడిన పవర్లూమ్స్ పైన ఈ చీరలు తయారు చేశారు .

ఈ ప్రాజెక్టు ద్వారా సదరు ప్రాంతంలోని మరమగ్గాల యొక్క పనివారులు / కార్మికుల జీవన స్థితిని పెంపొందించుటయే గాక సంబందిత కార్మికులు, వర్కర్స్, హమాలీలు, ఆటోడ్రైవర్లు, వ్యాపారులు మొదలగు ప్రజలలో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతూ తెలంగాణ రాష్ట్ర పవర్లూమ్ పరిశ్రమ అభివృద్ధి జరుగుతున్నది.

పవర్లూమ్ నేత పనివారుల యొక్క నెలసరి ఆదాయమును రూ.8,000/- రూ.12,000/- నుండి రూ.16,000/- రూ.20,000/- పెంచుట సాధ్యమని ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం నిరూపించినది. వారితో పాటు వార్పరు, వైపైని పని వారి యొక్క ఆదాయం కూడా దాదాపు రెట్టింపైంది మరియు నేత కార్మికుల నైపుణ్యాన్ని అధికస్థాయికి పెంచడమైనది. నూతన డిజైన్లు, కొత్త రకముల ఉత్పత్తి చేయుటకు వారిలో నైపుణ్యాని, నమ్మకాన్నిపెంచడమైనది.

ఇట్టి బతుకమ్మ చీరలు అన్ని జిల్లాలలోని కలెక్టర్లచే ఎంపిక చేయబడిన గోదాములకు సరఫరా అయినవి మరియు గ్రామస్థాయిలో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం గ్రామ / వార్డు స్థాయి కమిటీ ద్వారా అక్టోబర్ 02 వ తేదీ నుండి కలెక్టరు గారి ఆధ్వర్యంలో ప్రారంభమగును.

ఈ సంవత్సరం కూడా కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని బతుకమ్మ చీరల పంపిణి విధానాన్ని నిర్ణయించు స్వేచ్ఛ జిల్లా కలెక్టర్లకు ఇవ్వడమైనది. ఆయా ప్రాంతంలోని పరిస్థితిని బట్టి – “లబ్ధిదారుల ఇళ్ళ వద్దే చీరల పంపిణి చేయటం” లేదా “కోవిడ్ నిబంధనలను పాటిస్తూ గ్రామ/వార్డు కేంద్రాలలో చీరల పంపిణి చేయటం” అనేది సంబంధిత జిల్లా పరిపాలనాధికారులు నిర్ణయిస్తారు. దీని అనుగుణంగా చీరల పంపిణి సకాలంలో పూర్తి చేయించటానికి అన్ని ఏర్పాట్లు జరిగినవి” అని మీడియాతో అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *