mt_logo

తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వాల్సి వచ్చింది!- హరీష్ రావు

తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని.. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ఇవ్వకతప్పని పరిస్థితులు కల్పించాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. పదేళ్లుగా ఎన్నో చట్టాలు చేశామని కాంగ్రెస్ అంటోందని, అవేవీ తనంతట తానుగా చేసినవి కావని, ప్రజల పోరాటాలు, కోర్టుల ఒత్తిళ్లకు తలొగ్గి చేసినవే అని అయన మండిపడ్డారు. సిద్దిపేటలోని తన ఇంటిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర లేదని సోనియాతో చెప్పించినంత మాత్రాన ఇక్కడి ప్రజలెవరూ నమ్మేపరిస్థితిలో లేరని, ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు పిచ్చిగా మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు.

తెలంగాణలో వేలమంది బలిదానాలకు కాంగ్రెస్ పార్టీ, సోనియానే కారణమని అమరవీరుల సూసైడ్ నోట్లలో పేర్కొన్న విషయం అందరికీ తెలుసని, పార్లమెంటు సాక్షిగా యాదిరెడ్డి అమరుడైతే కనీసం చూడటానికి కూడా రాని జైరాం రమేష్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ఓట్లడుగుతున్నాడని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు 2004లో వచ్చినన్ని సీట్లు కూడా రావని పొన్నాల లక్ష్మయ్య అంటున్నాడని, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పటినుండి ఇప్పటిదాకా తెలంగాణలో 52సార్లు ఉపఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కనీసం రెండు సీట్లయినా గెలుచుకోలేకపోయిన విషయం గుర్తుతెచ్చుకోవాలన్నారు. రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *