హైదరాబాద్ లో కబ్జా చేసిన భూములు కాపాడుకోవడానికే టీడీపీ, బీజేపీ దోస్తీ కట్టాయని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే సీమాంధ్ర నేతల దగ్గర తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేతులు కట్టుకుని నిల్చుంటారని, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేలకోట్లు పంపించడమే దీనికి నిదర్శనమన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా గజ్వేల్ లో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్, టీడీపీ పార్టీల వైఖరిని ఎండగట్టారు. నగరం చుట్టూ భూదాన యజ్ఞంలో భూదాన రాంచంద్రారెడ్డి దానంగా ఇచ్చిన లక్షా 14వేల ఎకరాల భూముల్లో లక్ష ఎకరాలను చంద్రబాబు, వెంకయ్యనాయుడు అల్లుడు సహా ఆంధ్రావాళ్ళు కబ్జా చేశారని, ఆ భూములను బుక్కపెట్టడానికే రెండు పార్టీలు దోస్తీ కట్టాయని, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ భూములను లాక్కుని పేదలకు పంచుతామని కేసీఆర్ తెలిపారు.
ఇన్నేళ్ళు సీమాంధ్ర పాలనలో మగ్గిన మనకు ఆంధ్రా పార్టీలు ఇంకా అవసరమా? అని, ఆంధ్రా పార్టీల కింద ఇంకా సామంతులుగా ఉందామా? స్వతంత్రులుగా ఉందామా? అనే విషయంపై 10 జిల్లాల తెలంగాణ ప్రజలు తేల్చుకోవాల్సి ఉందని కేసీఆర్ సూచించారు. సెటిలర్లకు తాము ఏనాడూ వ్యతిరేకం కాదని, 40 నియోజకవర్గాల్లో సెటిలర్లు ఉన్నారని, వారి ఓట్లు మాకే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ఎక్కడినుంచి వచ్చిన వారైనా ఇక్కడివారికే ఓట్లు వేయాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన అంటే తెలంగాణ ఉద్యోగులు 10 శాతమే ఉంటారని, అందుకే ఉద్యోగులకు ఆప్షన్లు లేవని, సీమాంధ్ర ఉద్యోగులు వారి ప్రాంతానికి వెళ్లిపోవాల్సిందే అని కేసీఆర్ మరోసారి చెప్పారు.
ఆంక్షలతో కూడిన తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, సీమాంధ్రకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చి మనకు మొండి చెయ్యి చూపారని, ప్రజలు ఆశించిన తెలంగాణ ఇంకా ఏర్పాటు కాలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అవినీతిని బొందపెడితేనే ప్రజలకు మంచి పరిపాలన అందించవచ్చని, చాలామంది కాంగ్రెస్ నేతలు సీబీఐ కేసులు ఎదుర్కుంటున్నారని, జైళ్లకు కూడా వెళ్ళారని, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి గీతా రెడ్డిపైన సీబీఐ ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు.
పంపకాలింకా అయిపోలేదని, జూన్ 2నుంచి నీళ్ళు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగాల పంపిణీ ఉంటుందని, మన వాటా కోసం నిలబడి కొట్లాడాల్సి ఉంటుందని, రెండు ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే వేసి గెలిపించాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గజ్వేల్ కు ఏదికావాలంటే అది చేస్తానని, ఇజ్రాయెల్ టెక్నాలజీతో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని, తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి విత్తనాలు ఉత్పత్తి చేసి అనేక దేశాలకు సరఫరా చేస్తామని, ఇవేకాక మరికొన్ని అంశాలకు సంబంధించి కేసీఆర్ హామీ ఇచ్చారు.