mt_logo

తెలంగాణ సినిమాకు పంచముఖ వ్యూహం

By: మామిడి హరికష్ణ

తెలంగాణ సంస్కృతిలో ప్రజా కళారూపాలు, జానపద కళా సంప్రదాయాలకు ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. అందుకే తెలంగాణ ప్రాంతంలో 1948 నుంచి ఇటీవలి వరకు జరిగిన అన్ని రకాల ప్రజా ఉద్యమాలలో ఈ ప్రజా కళారూపాలే ప్రజలను ఉత్తేజపరిచాయి. అయితే ఒక దేశం, జాతి సంస్కృతిని నిర్ధారించే ఆధునిక కళారూపాలలో ప్రస్తుతం సినిమా అనేది అత్యంత ప్రజాదరణను సాధించింది. అందుకే ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ వంటి సంస్థలు ఈ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన కళారూపం-సినిమా అని ప్రశంసించింది. ఆ లెక్కన తెలంగాణ గడ్డమీద కళారూపంగా సినిమాను మరింత పటిష్ఠపరచాల్సిన, మరింత ముందుకుతీసుకెళ్లాల్సిన అవసరం వుంది. తెలంగాణ సినిమా ప్రస్థానం 1974 నుంచే పూర్తిస్థాయిలో ఆరంభమైనప్పటికీ ఈ నలభై ఏళ్ల కాలంలో తెలంగాణ సినిమా ఎదగాల్సినంతగా ఎదగలేకపోయిందనే చెప్పాలి.

ఇంటలెక్చువల్ సినిమాగా, వరల్డ్ సినిమాగా తెలంగాణ సినిమా అంతర్జాతీయ వేదికల స్థాయికి వెళ్లింది. కానీ స్థానికంగా కమర్షియల్ మెయిన్‌స్ట్రీమ్ సినిమాగా పాదుకోవడంలో మాత్రం ఇంకా తడబాటు పడుతూనే వుంది. 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర స్వప్నం నిజమైన ఈ సందర్భంగా సమాకాలీన సాంస్కృతిక రంగంలో సినిమా పాత్రని కమర్షియల్ పరంగా తెలంగాణ సినిమాను నిర్మాణాత్మక పంథాలో ఆవిష్కరించుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. తెలంగాణ సినిమా మూలాలు 1921 నుంచే మొదలైనప్పటికీ వెనుకబడి ఉండటానికి గల కారణాలను విశ్లేషించుకుంటూనే, మరోవైపు తెలంగాణ సినిమాను ఓ స్వతంత్ర పరిశ్రమగా, సృజనాత్మక ఉపాధి అవకాశాల రంగంగా విస్తరించుకోవడానికి పథక రచన చేయాల్సిన అవసరం వున్నది. కొన్ని దశాబ్దాల కాలంగా హైదరాబాద్‌లో స్థిరపడిన సినీ పరిశ్రమలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ను ఉపయోగించుకుంటూ నైజాం ఏరియాలో తెలంగాణా సినిమాకు కావలసిన మార్కెట్‌ను ఏర్పరుచుకుంటూ ఇతర రాష్ట్రాలలో సైతం మార్కెట్ విస్తరణ దిశగా అడుగులు వేయాల్సివుంటుంది. దీనికోసం నిర్ధిష్ఠంగా ఆచరణాత్మక వ్యూహంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సినీ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, ముందడుగు వేయాల్సిన సమయం ఇప్పుడొచ్చింది.

ప్రొడక్షన్ పెరగడమే పరిష్కారం

సినిమా అయినా, వేరే కళారూపం అయినా ఎప్పుడు జనబాహుళ్యంలోకి వెళ్తుంది? జనాల దృష్టిని ఆకర్షించే స్థాయినుంచి జనజీవితంలో అంతర్భాగంగా ఎప్పుడు అవుతుంది? అంటే ఆ కళారూపం కానీ, సినిమా కానీ విస్తృతంగా ప్రదర్శించినపుడు అని సమధానం వస్తుంది. అలాగే తెలంగాణ కమర్షియల్ సినిమా బలంగా పాదుకొనాలంటే ఇప్పుడున్న ఒకే ఒక పరిష్కార మార్గం – కమర్షియల్ పంథాలోనే తెలంగాణ సినిమా ఉత్పత్తి విస్తృతంగా జరగడమే అని చెప్పాలి. అయితే పెట్టుబడులు-లాభాల లెక్కలలో మునిగితేలే ఏ నిర్మాత కూడా ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ సినిమాల నిర్మాణానికి ముందుకురావడంలో సందేహించవచ్చు. అయితే ఎస్టాబ్లిష్‌డ్ నిర్మాతల బదులు కొత్త నిర్మాతలు ఇప్పడు తెలంగాణ వచ్చిన ఉత్సాహంలో ముందుకురావచ్చు. దీనివల్ల సబ్‌స్టాండర్డ్ సినిమాలు ఎక్కువగా వచ్చే అవకాశం వుంది. ఈ వెల్లువను నిరోధిస్తూనే కమర్షియల్ విలువలతో కూడిన తెలంగాణ సినిమాలను ఉత్పత్తి చేయడం ప్రస్తుతావసరం.

ఈ సందర్భంలోనే ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరానికి ఉన్న 52 వారాలలో వారానికొక్క సినిమా కాకపోయినా పక్షానికి ఒక్క సినిమా చొప్పున అయినా సంవత్సరానికి 25 తెలంగాణ సినిమాలు వచ్చేలా పథకరచన చేసుకోవాలి. లోబడ్జెట్‌లలో అయినప్పటికీ పెద్ద సంఖ్యలో సినిమాలు చేస్తే, తెలంగాణ కళాకారులకు, సాంకేతిక నిఫుణులకు అందరికీ చేతినిండా పనిదొరికే అవకాశం వుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా క్రమక్రమంగా రాబోయే కొన్నేళ్లలో తెలంగాణ సినిమా పూర్తిగా కమర్షియల్ సినిమాగా సైతం నిలదొక్కుకునే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత బ్రాండ్ తెలంగాణ సినిమా రూపొందించుకోవడం కష్ట సాధ్యం కాకపోవచ్చు. అంటే ఈ స్థాయిని చేరుకోవాలంటే ఇప్పుడు మనముందున్న ఒకే ఒక లక్ష్యం తెలంగాణ సినిమాల ప్రొడక్షన్‌ను పెంచడం అవుతుంది.

పంచముఖ వ్యూహం

తెలంగాణ కమర్షియల్ సినిమాలను సంఖ్యాపరంగానైనా పెంచాలంటే ఏం చేయాలి? దానికి అనుసరించాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహమేంటి? అని ఆలోచిస్తే ఐదు రకాల పద్ధతులతో పంచముఖ వ్యూహంతో వెళితే తెలంగాణ సినీ నిర్మాణంలో రాశిని పెంచవచ్చు అని అర్థమవుతుంది.

1. ప్రభుత్వపరమైన చర్యలు:

తెలంగాణ కమర్షియల్, నాన్‌కమర్షియల్ సినిమాల నిర్మాణానికి మొదటగా సహకరించాల్సింది, ప్రొత్సహించాల్సింది ప్రభుత్వమే. స్వాతంత్య్రానంతరం జాతీయ స్థాయిలో కానీ, 1970 అనంతరం తెలుగులో కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం, సహకారం వల్లనే అటు నేషనల్ సినిమా, ఇటు తెలుగు సినిమా వృద్ధి సాధించాయి. అదే విధానాన్ని, అదే ప్రోత్సాహకర, రక్షణాత్మక విధానాన్ని ఇప్పుడు తెలంగాణ సినిమాల విషయంలో కూడా పాటించాలి. దీని కోసం ప్రభుత్వం తెలంగాణ సినిమాలకు సబ్సిడీలను, రాయితీలను, పన్ను మినహాయింపులను, ప్రోత్సాహకాలను, అవార్డులను అందించడంతో పాటు సినిమాల నిర్మాణానికి ఆర్థిక సహాయం కూడా అందించాలి.

సినిమా నిర్మాణానికి అర్హత ప్రమాణాలను నిర్ణయించి, వాటిని సంతృప్తి పరిచిన సినిమాలకు రెండు రకాలుగా ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందించవచ్చు. 1)100 శాతం సంపూర్ణ ఆర్థికసాయం. సినిమా నిర్మాణానికి అవసరమైన మొత్తం డబ్బును ప్రభుత్వమే ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థ ద్వారా సమకూర్చాలి. 2) పాక్షిక ఆర్థిక సాయం… నియమాలకు లోబడి ఎంపిక చేసిన సినిమాల నిర్మాణ వ్యయంలో కొంత మొత్తాన్ని (దాదాపు 25శాతం బడ్జెట్) ఆ సినిమాల నిర్మాణ సమయంలోనే అందించి, ఆ సినిమాల పరిపూర్తికి దోహదం చేయొచ్చు.

2. క్రౌడ్ ఫండింగ్:

ఏవో కొన్ని బడా నిర్మాణ సంస్థలు మినహా, మిగతా నిర్మాణ సంస్థలన్నీ కొద్దోగొప్పో ఈ క్రౌడ్ ఫండింగ్ విధానంలోనే సినిమాలు నిర్మిస్తున్నాయి. అయితే ఈ తరహాలో ఎక్కువగా దర్శకనిర్మాతలు తమ సినిమాల నిర్మాణ కోసం ఫైనాన్షియర్స్‌పై కాకుండా బంధువులు, స్నేహితుల నుంచి ఆర్థిక సాయాన్ని స్వీకరించవచ్చు. ఈ విధానంలో లాభనష్టాలతో సంబంధంలేకుండా నిర్మాత వారికి తిరిగి డబ్బులు చెల్లించడమో, వడ్డీకి తిరిగి చెల్లించడమో జరుగుతుంది.ఇక ఈ క్రౌడ్‌ఫండింగ్ విధానంలో నిర్మాత సినిమాకు కావలసిన డబ్బును, పెట్టుబడుల రూపంలో ప్రజల నుంచి స్వీకరిస్తాడు. ఈ విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండిపెండెంట్ సినిమాల నిర్మాణానికి, కమర్షియల్ విలువలతో సంబంధంలేకుండా నిజాయితీ, నిబద్ధతతో కూడిన సినిమాల నిర్మాణానికి ఒక మంచి ఆలంబనగా మారింది. అయితే ఈ ప్రయోగాన్ని ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటిసారిగా సక్సెస్ చేసి చూపించిన క్రెడిట్ మన తెలంగాణ దర్శకుడికే దక్కడం మనందరికీ గర్వకారణం.

1976లో శ్యామ్‌బెనగల్ మంథన్ అనే సినిమాను తీశాడు. ఈ సినిమానే క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా తెరకెక్కిన మొదటి చిత్రం. గ్రామీణ ప్రాంతాల్లో క్షీరవిప్లవం తీసుకొచ్చిన మార్పుల నేపథ్య కథతో వచ్చిన ఈ సినిమాకు 5లక్షల మంది గుజరాతీ రైతులు ఒక్కొక్కరు 2 రూపాయల చొప్పున విరాళాలిచ్చి ఈ సినిమాకు నిర్మాతలైనారు.అలాగే ఆ తర్వాత పదేళ్లకు 1986లో కేరళలో మరో ఫిల్మ్‌మేకర్ జాన్‌అబ్రహమ్ కూడా ఈ క్రౌడ్‌ఫండింగ్ విధానాన్ని అమలుచేసి అమ్మ అరియన్ అనే సినిమాను తీశాడు. కొంతమంది పెట్టుబడిదారుల సొత్తుగా మారిన సినీరంగాన్ని ప్రజా సినిమాగా మార్చే లక్ష్యంతో జాన్ అబ్రహమ్ కేరళలోని గ్రామాలలో తిరిగి, వివిధ కళాప్రదర్శనలు చేసి, అలా వచ్చి డబ్బుతో ఈ సినిమా తీశారు.

ఒడిస్సా కలెక్టివ్ పేరిట ఆయన చేసిన ఈ ప్రయోగం సూపర్‌హిట్ అయింది. బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ చేత టాప్-10 భారతీయ చిత్రాలతో ఒకటిగా ఎంపికచేయడమే కాక, 1987 జాతీయ స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా గెల్చుకుంది. ఈ తరహా క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా కూడా తెలంగాణ సినిమాల నిర్మాణాన్ని చేపట్టవచ్చు. ఐడియాస్ వుండి డబ్బు, బడ్జెట్ లేదనే ఆటంకాన్ని ఈ విధానం ద్వారా అధిగమించవచ్చు.

3. సహకార సినీనిర్మాణం:

సహకార రంగంలో చేనేత, రైతు పరపతి, గృహనిర్మాణం వంటివెన్నో ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్నాయి. ఇదే పంథాలో అభిరుచి, ఆసక్తి వున్న కొంతమంది వ్యక్తులు (వారు సినీరంగానికి చెందిన దర్శకుడు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులైతే మంచిది) కలిసి రిజిస్టర్డ్ సంఘంగా ఏర్పడి, ఆ తర్వాత సినీ నిర్మాణానికి ఏదేనీ ప్రభుత్వ బ్యాంక్ ఆర్థిక సాయాన్ని పొందవచ్చు. ఈ తరహాలో ఇప్పటికే కేరళలో కొన్ని సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. ఇలా తెలంగాణలో కూడా ఫిల్మ్ మేకింగ్ కోపరేటివ్స్ స్థాపించి సినిమాల నిర్మాణం చేయవచ్చు.

4.ఎపిసోడిక్ సినిమా:

ఇటీవల కాలంలో యువతలో చాలామంది షార్ట్‌ఫిల్మ్స్ చేస్తున్నారు. మంచి కథ, కథనం, ఉన్నత సాంకేతిక విలువలు, లో బడ్జెట్‌లు లేదా జీరో బడ్జెట్‌లతో ఈ సినిమాలు తీస్తున్నారు. ఇలాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్ కొందరు కలిసి తాము తీసిన నాలుగైదు షార్ట్ ఫిలింస్‌ను కలిసి ఒక ఫుల్‌లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్‌గా రిలీజ్ చేసుకోవచ్చు. ఈ తరహా సినిమాలను ఎపిసోడిక్ సినిమాలు అంటారు.

ఈ విధానాన్ని మనదేశంలో మొదటగా సక్సెస్ చేసి చూపించిందెవరో తెలుసా? సత్యజిత్‌రే. సినీరంగంలోకి అడుగుపెట్టిన మొదట్లో ఆయన తీన్‌కన్య పేరిట మూడుకథలను కలిసి ఒక సినిమాగా రూపొందించాడు. ఈ కథలన్నీ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినవే. విడివిడి కథలని, విడివిడి షార్ట్‌ఫిల్మ్‌లుగా తీసి ఆ తర్వాత రెండున్నర గంటల చిత్రంగా కలిపాడు. ఈ తరహా విధానమే ఆ తర్వాత రామ్‌గోపాల్‌వర్మ డర్ నా మనాహై డర్ నా జరూరీ హై సినిమాలలో ఫాలో అయ్యారు. ఇదే వరుసలో సంజయ్‌గుప్తా దస్ కహానియా తీయగా, భారతీయ సినిమా వందేళ్ల సందర్భంగా కరణ్‌జోహార్ బాంబే టాకీస్ పేరిట ఆరు షార్ట్ ఫిల్మ్‌లను సినిమాగా రూపొందించారు. ఇటీవలే ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో చందమామ కథలు సినిమా ఈ తరహాలోనే తెరకెక్కింది.

ఈ అనుభవాలను దృష్టిలో వుంచుకొని యంగ్ ఫిల్మ్ మేకర్స్ కొందరు కలిసి తాము తీసిన షార్ట్ ఫిల్మ్స్‌ను ఒక్కచోట చేర్చి ఎపిసోడిక్ సినిమా పేరిట థియేటర్స్‌లో రిలీజ్ చేయొచ్చు. దీనివల్ల తెలంగాణ సినిమాల నిర్మాణం పెరుగుతుంది. యంగ్‌టాలెంట్‌కు ప్రదర్శనావకాశాలు పెరుగుతాయి.

5.ఇండస్ట్రీ సినిమాలు:

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఇప్పటికే నేమ్, ఫేమ్ సాధించిన తెలంగాణ దర్శకనిర్మాతలు కొందరున్నారు. వారిలో దిల్‌రాజు లాంటి నిర్మాతలు వారి తరహాలోనే పూర్తి కమర్షియల్ ఫార్మాట్‌లోనే తెలంగాణ సినిమాలు తీయవచ్చు. భారీ సినిమాల పేరుతో తీసే సినిమాల బడ్జెట్ పరిశ్రమలలో పదోవంతు పెట్టుబడులతో తెలంగాణ సినిమాలను వీరు తీయగలరు. పైగా నైజాం మార్కెట్ కమర్షియల్‌గానూ, బాక్సాఫీస్ కలెక్షన్లపరంగానూ తక్కువది ఏమీకాదు. 50కోట్ల పెట్టుబడి పెట్టి 55కోట్లు సంపాదించడం కన్నా, 2కోట్లు పెట్టుబడి పెట్టి 4కోట్లు సంపాదించడం బిజినెస్‌పరంగా ప్రాఫిట్ అన్నట్లే కదా!

ఇలా, ఈ పంచముఖ వ్యూహాన్ని అమలుచేస్తే, కమర్షియల్ విలువలతో కూడిన తెలంగాణ సినిమాలను, తెలంగాణ రాష్ట్రంలో సుసాధ్యం చేయడం అసాధ్యం కాదు!.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *