మూడు రోజుల ఢిల్లీ పర్యటన కోసం సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయం నుండి బయల్దేరి వెళ్లారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతు న్న సమయంలో కెసిఆర్ ఢిల్లీ పర్యటన చేస్తుండడం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే గత వారంలో జరిగిన పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రం తీరును నిరసిస్తూ టిఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర స్థాయిలో నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తూ సభా కార్యక్రమాలను పూర్తిగా స్తంభింప చేశారు. ఫలితంగా ఎలాంటి చ ర్చలు జరగకుండానే ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఇప్పుడు రాష్ట్ర, దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న అంశంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి సంబంధించిని వివిధ అంశాలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకొచ్చి….వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారా? లేదా మరోసారి మోడీ ప్రభుత్వంపై నిప్పులు కురిపించడానికే ఢిల్లీకి వచ్చారా? తదితర అంశాలపై రాజకీయ వర్గాల్లో వాడివేడిగా చర్చ సాగుతోంది. అదే సమయంలో జాతీయ రాజకీయాలపై పలువురు సీనియర్ నేతలతో కేసీఆర్ భేటీ అవనున్నట్లు తెలుస్తోంది. కాగా సీఎం కేసీఆర్ వెంట ఢిల్లీ వెళ్లిన వారిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎంపిలు జోగినపల్లి సంతోష్‌కుమార్, రంజిత్‌రెడ్డి, ఎల్‌బినగర్ నియోజకవర్గం శాసనసభ్యుడు సుధీర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తదితరులు ఉన్నారు.

