mt_logo

సీజనల్ వ్యాధుల నేపథ్యంలో శానిటేషన్ డ్రైవ్ : మంత్రి హరీష్ రావు

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీజనల్, అంటు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల మంత్రులు సమీక్ష సమావేశం జరిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు… తెలంగాణ వ్యాప్తంగా ఆగస్ట్ 2 వరకు శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఇంటింటికి వెళ్లాలని, ఇళ్లకు వచ్చినప్పుడు అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రజలు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యమే ముఖ్యమని, అధికారులు పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని హరీష్ రావు సూచించారు. ప్ర‌స్తుతం ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో మ‌లేరియా వ్యాధి ప్ర‌బ‌లుతుంద‌ని… మ‌లేరియా, డెంగ్యూ కేసులు పెర‌గ‌కుండా నివార‌ణ చర్య‌లు తీసుకుంటున్నామ‌ని, అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఆదివారం హెల్త్ టీమ్ ఇళ్లకు వెళ్లి పరీక్షించాలని నిర్ణ‌యించామ‌న్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వర్షాలు తగ్గినా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇళ్ల వద్ద నీరు నిల్వకుండా చూసుకోవాలని సూచించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో, హాస్ట‌ల్స్‌లో మ‌ధ్యాహ్న భోజ‌నం క్వాలిటీ ఉండేలా చూసుకోవాల‌ని అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీలు చేయాల‌ని ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *