mt_logo

బాబు బేజారు!!!

-ప్రత్యేక హోదాపై టీడీపీ ద్వంద్వ వైఖరికి నిరసనలు
-ప్రభుత్వంపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు
-ప్రజల్లో నానాటికి తీవ్రమవుతున్న వ్యతిరేకత
-పార్టీని వీడుతున్న టీడీపీ శ్రేణులు
-కీలక నేతల చేరికతో ప్రతిపక్ష వైసీపీ కళకళ
-ఎన్నికల వేళ స్పీడు పెరిగిన ఫ్యాను గాలి

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీకి వ్యతిరేక పవనాలు జోరుగా వీస్తున్నాయా? విశ్లేషకులు అవుననే అంటున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మి ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే.. వారి ఆకాంక్షలను కించిత్తయినా నెరవేర్చకపోవడంతోపాటు.. అంతులేని అవినీతిలో ప్రభుత్వం కూరుకుపోవడంతో టీడీపీ కోటలు కుప్పకూలటం ఖాయమని వారు చెప్తున్నారు. దీనికితోడు సార్వత్రిక ఎన్నికలవేళ టీడీపీ రోజురోజుకు ఖాళీ అవుతున్న తీరు ఏపీ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చింది. సాధారణంగా ఎన్నికల సమయంలో అధికారపార్టీలోకి వలసలు కనిపిస్తుంటాయి. దానికి విరుద్ధంగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి టీడీపీ కీలక నేతలు క్యూ కడుతుండటం విశేషం. ఈ పరిణామాలతో సీఎం చంద్రబాబు బెంబేలెత్తుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. టీడీపీలో భవిష్యత్తు లేదని తేలిపోవడంతో వైసీపీలోకి పెరుగుతున్న చేరికలు.. ఎన్నికల వేళ ఫ్యాను స్పీడును మరింత పెంచుతున్నదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. టీడీపీ పట్ల పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను తమకు అనుకూలంగా మల్చుకోవడంలో వైసీపీ సఫలం అవుతున్నదని అంటున్నారు.

రాజకీయ భవిష్యత్తు కోసమే..

కొంతకాలంగా టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. కాంగ్రెస్, బీజేపీ నుంచి వైసీపీలో చేరుతున్నవారితో పోల్చితే.. టీడీపీ నుంచి వస్తున్నవారే 90%పైగా ఉండటం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ చేరికలు ప్రజల నాడికి అద్దం పడుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీడీపీని వీడినవారిలో ఉద్ధండులుగా చెప్పే నేతలు ఉండటం విశేషం. బుధవారం కూడా పలువురు టీడీపీ కీలక నేతలు వైసీపీలో చేరారు. వాస్తవానికి కొన్నిరోజులుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఆ జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. లోక్‌సభలో టీడీపీ పక్ష నాయకుడు తోట నర్సింహులు తన భార్య వాణితో కలిసి వైసీపీలో చేరారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు.. ఆమంచి కృష్ణమోహన్ (చీరాల), మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి (గుంటూరు పశ్చిమం), అవంతి శ్రీనివాస్ (భీమిలి), మేడా మల్లికార్జున్‌రెడ్డి (రాజంపేట) సైకిల్ దిగి.. ఫ్యాను గాలి కిందకు చేరారు.

వీరితోపాటు తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో మంచి పట్టున్న మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ, ఆమె కుమారుడు రాజబాబు వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, తాడిశెట్టి వెంకటరావు, అడుసుమిల్లి జయప్రకాశ్, బ్రహ్మానందరెడ్డి లోటస్‌పాండుకు క్యూ కట్టారు. చివరకు ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్ సైతం వైసీపీ కండువా కప్పుకొన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే బాబ్జీ, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు జగన్ చెంతకు చేరారు. పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్, పొట్లూరి వరప్రసాద్, నార్నె శ్రీనివాసరావు, పోచా బ్రహ్మానందరెడ్డి, హాస్యనటుడు అలీ, నటుడు రాజారవీంద్ర, ఏపీ పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి, విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు, ఉడుత శ్రీనివాస్, గోరంట్ల మాధవ్.. లిస్టు చదువుకుంటూ పోతే.. చాలామందే ఉన్నారు. ప్రభుత్వంపై నానాటికీ ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గుర్తించి వీరంతా రాజకీయ నిర్ణయం తీసుకుంటే.. టికెట్లు దక్కకే పార్టీని వీడుతున్నారంటూ చంద్రబాబు అండ్‌కో గోబెల్స్ ప్రచారం చేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజాక్షేత్రంలో పడిపోయిన టీడీపీ గ్రాఫ్..

గత సార్వత్రిక ఎన్నికల్లో అత్తెసరు మార్కులతో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ గ్రాఫ్.. గత ఐదేండ్లలో వేగంగా పడిపోవడం విశేషం. రాజధాని అమరావతికి ఐదేండ్లలో కనీస రూపం తేలేకపోవడంతోపాటు.. ప్రభుత్వంపై పెల్లుబికిన అవినీతి ఆరోపణలు ప్రజల్లో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతను రగిలించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఖాళీ ఖజానా.. ఉత్తి చేతులతో వచ్చాం.. అంటూ చెప్పుకొనే చంద్రబాబు.. తన హంగు ఆర్భాటాలకు మాత్రం వందల కోట్లు ఖర్చుచేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి కూడా ప్రజల్లో ఆయన పట్ల నమ్మకాన్ని పోగొట్టిందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. నాలుగేండ్లపాటు ప్రధాని మోదీతో చెట్టపట్టాలేసుకుని తిరిగి, స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకొని, ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా అంటున్న చంద్రబాబు రాజకీయ డ్రామాలను ప్రజలు పసిగడుతున్నారని చెప్తున్నారు. సెంటిమెంట్ అంశంగా మారిన ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు యూటర్న్‌లతో ఏపీ ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇవన్నీ గమనించిన కీలక నేతలు.. వరుసగా టీడీపీకి గుడ్‌బై చెప్తున్నారని పరిశీలకులు అంటున్నారు.

రెండోసారి అధికారం ఎప్పడూ కల్లే!!

అధికారం దక్కించుకోవడం కాదు.. దానిని కాపాడుకోవడమనేది నిజమైన రాజనీతిజ్ఞుడి లక్షణం. కానీ ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు జిమ్మిక్కులనే నమ్ముకుంటారని ప్రతీతి. ఈ కారణాలతోనే ఆయన రెండోసారి వరుసగా అధికారంలోకి వచ్చిన చరిత్రలేదు. 1994లో కనీవినీ ఎరుగని ప్రభంజనంతో ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారాన్ని చేపట్టిన ఎన్టీ రామారావును రాజకీయ వెన్నుపోటుతో పదవీచ్యుతునిచేసి.. సీఎం కుర్చీని గుంజుకున్నారని చంద్రబాబుపై చెరిపివేయలేని మచ్చ పడింది. చంద్రబాబు నేతృత్వంలో తొలిసారి తెలుగుదేశం 1999 ఎన్నికల్లో పోటీకి దిగింది. అప్పుడు విజయం సాధించిన చంద్రబాబు.. తర్వాత 2004 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆపై 2009 ఎన్నికల్లోనూ అధికారాన్ని దక్కించుకోలేకపోయారు. ఆపై రాష్ట్ర విభజన దరిమిలా 2014 ఎన్నికల్లో అత్తెసరు ఓట్లతో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న విశ్వప్రయత్నాలు తీవ్ర రాజకీయ ప్రతికూలతల నేపథ్యంలో ఫలించే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *