mt_logo

సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు..

తెలంగాణలో 16 స్థానాల్లో గులాబీ జెండా, మరో స్థానంలో మిత్రపక్షం ఎంఐఎం జెండా ఎగరాలని, సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు నినాదంతో ఢంకా బజాయించి ఎన్నికలకు వెళదామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం నాడు ఉదయం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల శివారు మాగిలో ఏర్పాటుచేసిన జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం, సాయంత్రం సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలకు హాజరై కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ భావోద్వేగాలతో కాంగ్రెస్, మతాల పేరుతో బీజేపీ పబ్బం గడుపుకుంటున్నాయని, దేశంలో ఇంకా కరెంటు, తాగునీరు, రోడ్లు వంటి కనీస వసతులతో పాటు తినడానికి తిండి కూడా దొరకని అభాగ్యులు ఉన్నారంటే అందుకు కారణం దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు కాదా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్, బీజేపీలు సొంతగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి లేదని, కేసీఆర్ నాయకత్వంలో వందమంది ఎంపీలతో కొత్త కూటమి ఏర్పాటు కాబోతున్నదని, రాబోయే ఎన్నికల్లో ఢిల్లీని శాసిద్దామని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పదహారు స్థానాల్లో విజయం సాధిస్తే ఢిల్లీ మన చేతిలో ఉంటుందని, కావాల్సిన నిధులు తెచ్చుకోవచ్చన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరైనా మొత్తం పదహారు స్థానాల్లో మనం వేసే ఓటు కేసీఆర్ సైనికుడికి అనే విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఢిల్లీకి మనం పంపే నాయకులు మనకోసం తెగించి కొట్లాడేవారని, కాంగ్రెస్ వాళ్ళు పొరపాటున గెలిస్తే ఢిల్లీ దర్బార్ లో గులాంల మాదిరిగా ఉంటారని కేటీఆర్ చెప్పారు.

రాష్ట్రంలో కరెంట్ సమస్యను పరిష్కరించి పరిశ్రమలకు, గృహ, వ్యవసాయ అవసరాలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్న సమర్ధమైన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎకరానికి ఎనిమిదివేల చొప్పున పంట సాయం అందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన సీఎం కేసీఆర్ అని, ఇటీవలి ఎన్నికల్లో దానిని పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారని, అది వచ్చే సీజన్ నుండి అమలుకానున్నదని కేటీఆర్ తెలిపారు. ఆసరా పించన్లు రెట్టింపు చేశారని, తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కావాలన్నదే కేసీఆర్ గారి లక్ష్యమని అన్నారు. జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా ఓడించామో అట్లాగే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కూడా బీజేపీని ఓడించి గులాబీ జెండా ఎగరేసి తీరుతామని కేటీఆర్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *