mt_logo

రెండు రాష్ట్రాల్లో ఒకే తేదీన ఎన్నికలు – టిడిపి విజయావకాశాలకు గండి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. తిరుగులేని ప్రజాదరణతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి పాలనా పగ్గాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేలుపెట్టి చంద్రబాబు విసిరిన సవాల్ ను ఈ ఎన్నికలో కేసీఆర్ సమర్థంగా తిప్పికొట్టాడు.

అదే ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికల్లో పోరుకు సన్నద్ధం అయ్యారు కేసీఆర్. కానీ ఏపీ పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధం. అక్కడ శాసనసభకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు వచ్చాయి. దీనితో చంద్రబాబుకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా తయారయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మొదటి దశలోనే తెలంగాణ, ఏపీలో ఎన్నికలు ఒకేరోజు నిర్వహించడం మూలిగే నక్క మీద తాటికాయ అన్నట్లుగా చంద్రబాబు పరిస్థితి తయారయింది.

ఏపీలో, తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించడం, మంత్రులతో సహా టీడీపీ నాయకులు నాదరూ ఎలక్షన్ కమీషన్ మీద విరుచుకు పడటం రాజకీయ వర్గాలను విస్మయపరిచింది. చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి, దీని వెనుక కేసీఆర్ కుట్ర ఉందని ఆరోపించడం బాబులో నెలకొన్న అభద్రతా భావానికి అద్దం పట్టాయి. కానీ ఇలా చంద్రబాబు గొంతు చించుకోవడం వెనుక కారణాలు లేకపోలేదు.

ఒక్కసారి 2014 ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటే చంద్రబాబులో నెలకొన్న అభద్రతా భావానికి కారణాలు తెలుస్తాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి పోలయిన ఓట్ల శాతం మరియు ప్రతిపక్ష వైసీపీకి పోలయిన ఓట్ల శాతం మధ్య తేడా చాలా స్వల్పంగా ఉంది. ఓట్ల సంఖ్యా పరంగా కూడా ఇద్దరి మధ్య తేడా కేవలం 6 లక్షలు కూడా మించలేదు. కానీ ఫలితం మాత్రం టిడిపికి 102 సీట్లను, వైసీపీకి 67 సీట్లను కట్టబెట్టింది.

ఎలక్షన్ కమీషన్ నివేదిక ప్రకారం రెండు రాష్ట్రాల్లో కామన్ గా ఉన్న ఓట్ల సంఖ్య 30 లక్షలు. ఇందులో అత్యధిక భాగం ఓట్లు హైదరాబాద్ నగరంలో ఉంటున్న సీమాంధ్ర ప్రజలవే. గతంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెండు ప్రాంతాల్లో వేరు వేరు తేదీల్లో నిర్వహించబడేవి. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న వారు తిరిగి ఏపీలో సైతం టిడిపికి అనుకూలంగా తమ ఓటును వినియోగించుకునేవారు. ఈ సారి అలాంటి అవకాశానికి ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకు మింగుడు పడటం లేదు.

ఇప్పుడు 30 లక్షల మందిలో అత్యధికులు కేవలం ఒకే చోట తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన పరిస్థితి. కేవలం 6 లక్షల ఓట్లు అధికార పీఠాన్ని ప్రభావితం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా 30లక్షల ఓట్లు ఏపీ ఎన్నికల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి అనడంలో సందేహం లేదు. విజయం నీదా, నాదా అన్నట్లు దోబూచులాడుతున్న ఏపీ ఎన్నికల్లో ఈ పరిణామాలు టిడిపి విజయావకాశాలను గండి కొట్టబోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *