ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీ బుధవారం కలిశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు ఐటీ, గ్రామీణాభివృద్ధి, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య పథకం, అందరికీ వైద్యం, హైదరాబాద్ నగరాభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు, సత్వర అభివృద్ధి కోసం రూపొందించే ప్రత్యేక విధానాల్లో విశిష్ట అనుభవం కలిగిన టాటా కన్సల్టెన్సీల సలహాలను స్వీకరిస్తామని అన్నారు. హైదరాబాద్ లో 1700 మురికివాడలున్నాయని, వాటిలో ఇండ్లు, రోడ్లు, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తక్కువ వేతనాలు కలిగినవారు కూడా మెరుగైన జీవితాన్ని గడిపేందుకు కాలనీలు ఏర్పడాలని, తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్ యూనిట్ల స్థాపనపై టాటా గ్రూపు అధ్యయనం చేయాలని కోరారు.
సైరస్ మిస్త్రీ మాట్లాడుతూ, పారిశ్రామిక, ఐటీ రంగాల్లోనే కాకుండా చాలా విభాగాల్లో తమ గ్రూప్ సంస్థలు పని చేస్తున్నాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తామని, తమ ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి అవసరమైన సలహాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా మార్చాలన్న కేసీఆర్ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో అవలంబించబోయే పారిశ్రామిక విధాన డ్రాఫ్ట్ బాగుందని, పారిశ్రామికాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రశంసించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎంవో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.