Mission Telangana

సర్వేపై సందేహాలు.. సమాధానాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే అత్యంత కీలకంగా మారింది. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో ఉండి సర్వేలో వివరాలను నమోదుచేసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలు వారికి అందబోవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో సర్వేపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానాలకు అధికారులు వివరణ ఇచ్చారు.

సందేహాలు: సర్వే కోసం ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు కుటుంబసభ్యులందరూ ఇంట్లో ఉండాల్సిందేనా?
సూచన: అవును. ఆరోజున ఇంట్లో ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటారు.

కుటుంబసభ్యులు పలు కారణాల వల్ల ఆ రోజున ఇంట్లో లేకపోతే పరిస్థితి ఏమిటి?
దీనికి ఖచ్చితమైన ఆధారం చూపించాల్సి ఉంటుంది.

ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న వారి సంగతేమిటి?
ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటే వారిని పరిగణనలోకి తీసుకోరు. అయితే పై చదువుల కోసం వేరేచోట ఉంటే అదికూడా ఒక సంవత్సరంలోపు వారు తిరిగి ఆ కుటుంబంలోకి వస్తారనే ఆధారం చూపగలిగితే వారి పేరును నమోదు చేసుకుంటారు.

ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ ప్రైవేటు ఉద్యోగుల మాటేమిటి?
ప్రైవేటు ఉద్యోగులైనా తప్పకుండా ఆ రోజున అందుబాటులో ఉండాల్సిందే.

అయితే వారికి సెలవు మాటేమిటి?
ప్రతి జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. సర్వే రోజును అధికారికంగా అన్ని ప్రైవేటు సంస్థలకు సెలవు ఇవ్వాల్సిందే.

ఒకే ఇంట్లో వేర్వేరు కాపురాలతో ఉన్న వారిని వేర్వేరు కుటుంబాలుగా గుర్తిస్తారా ?
ఒక ఇంట్లో ఒకే వంటగది ఉంటే వారంతా ఒకే కుటుంబంగా రికార్డు చేస్తారు. ఎన్ని వంట గదులుంటే అన్ని కుటుంబాలుగా గుర్తించి నమోదుచేస్తారు.

ఆర్థిక పరిస్థితులను ఎలా అంచనా వేస్తారు?
ఎన్యుమరేటర్‌కు విలేజ్ సర్వెంటు, వీఏఓలు సహాయకారులుగా ఉంటారు. వారు ఒకొక్క కుటుంబ జీవన పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులపై అవగాహన కలిగిఉంటారు. కుటుంబసభ్యులు ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినా వాటిని బేరీజు వేసుకుంటారు.

ఎన్యుమరేటర్ నమోదులోనే పొరపాట్లు ఉంటే ?
ఎన్యుమరేటర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే స్థానికంగా ఉండేవారిని కాదని వేరే ప్రాంత ఉద్యోగులను ఎంపిక చేస్తున్నారు. వారికి రెండు రోజుల పాటు తగిన శిక్షణ కూడా ఇస్తారు.

సర్వే నమోదుషీట్‌ను వెంటనే అందించనట్లయితే..
దీనికి ఆస్కారమే ఉండదు. అదే రోజు సాయంత్రానికి తమ వద్ద ఉన్న అన్ని పత్రాలను అంటే భర్తీ చేసినవి, భర్తీ చేయనివి కూడా గ్రామ ప్రత్యేక అధికారికి ఎన్యుమరేటర్ అందజేయాలి. గ్రామ స్పెషల్ ఆఫీసర్ అదేరోజు రాత్రి వాటిని మండల కేంద్రానికి అందజేస్తారు.

ఈ సర్వే ఫార్మెట్‌లోని వివరాలను భవిష్యత్తులో మార్పులు, చేర్పులు చేస్తే ఎలా?
అందుకనే వచ్చిన అన్ని ఫార్మెట్‌ల వివరాలను ఒకవైపు కంప్యూటర్లలో నమోదుచేయడంతోపాటు ఫార్మెట్‌లన్నింటినీ స్కానింగ్ చేసి భద్రపరుస్తారు. జేపీజీ ఫార్మాట్‌లో వాటిని భద్రపరచడం వల్ల ఎలాంటి మార్పుచేర్పులకు ఆస్కారం ఉండదు.

ఎన్యుమరేటర్‌కు అన్ని వివరాలు చెప్పాల్సిందేనా ?
అవును చెప్పాల్సిందే. వారు చెప్పిన వివరాలను ఆధార్‌కార్డుతో సరిపోల్చుతారు. డూప్లికేషన్‌కు ఆస్కారం లేకుండా భవిష్యత్తులో బ్యాంకు ఖాతాల నెంబర్లతో సరిచూసుకుంటారు.

సర్వే చేయాల్సిన ఇండ్లను ఎన్యుమరేటర్లకు ఏవిధంగా కేటాయిస్తారు ?
ఇటీవలే గ్రామ పంచాయతీ, మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలు జరిగినందున వాటి ఓటరు జాబితాల ఆధారంగా కుటుంబాలను ఎంపిక చేస్తారు. ఒక్కొక్క ఎన్యుమరేటర్‌కు ఇరవై నుంచి ముప్పై ఇండ్లను మాత్రమే కేటాయిస్తారు. ఒక సారి ఒక ఎన్యుమరేటర్ ఆ ఇంటికి వెళ్ళి వచ్చాక తిరిగి మరొకరు వెళ్ళకుండా ఆ ఇంటికి ప్రభుత్వం రూపొందించిన స్టిక్కర్‌ను ఆరుబయట అతికిస్తారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *