mt_logo

నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ పర్యటన

నిజామాబాద్ జిల్లాలో ఈరోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పర్యటించారు. బిక్కునూర్ మండలం బస్వాపూర్ వద్ద పార్టీ కార్యకర్తలు, ప్రజలు సీఎం కు ఘనస్వాగతం పలికారు. బస్వాపూర్ లో పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అక్కడి ప్రజలు సీఎం కు నాగలిని బహూకరించారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆర్మూర్ కు చేరుకొని 114 కోట్లతో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసి ఆర్మూర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభలో మాట్లాడుతూ, ఆర్మూర్ ప్రజలకు 114 కోట్లతో మంచినీటి పథకాన్ని ఏడాదిలోపు పూర్తి చేస్తామని, సిద్ధిల గుట్ట, పులి గుట్టలపై నీటి ప్లాంట్ లను ఏర్పాటు చేస్తామని, నీటి పంపులు లేకుండానే 3 అంతస్థుల బిల్డింగులపైకి నీళ్ళు వస్తాయని, సంవత్సరం తర్వాత ఆర్మూరుకు తానే వచ్చి నల్లా విప్పి నీళ్ళందిస్తానని చెప్పారు.

ఎర్రజొన్న రైతులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తుందని, అందుకోసం 115 కోట్లను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.గత ప్రభుత్వాలు మాటలు చెప్పాయి తప్ప నిధులు ఇవ్వలేదని, బకాయిల కోసం ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళకుండా స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు మీ ఇంటికి వచ్చి చెక్కులు అందజేస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్మూరులో వంద పడకల ఆస్పత్రిని నిర్మించి తీరుతామని, గుత్ప ఎత్తిపోతల పథకాన్ని విస్తరించి 18 గ్రామాలకు నీరందిస్తామని చెప్పారు. రైతు రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆటో రిక్షాలకు రవాణా పన్ను రద్దు చేశామని అన్నారు.

గృహనిర్మాణంలో జరిగిన వేలకోట్ల అవినీతిపై విచారణ జరిపిస్తున్నామని, గృహనిర్మాణ వ్యయం పెరిగినా పేదలకు మూడున్నర లక్షలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. దసరా, దీపావళి పర్వదినాల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పించన్లు ఇస్తామని, బీడీ కార్మికులకు కూడా 1000 రూపాయల భ్రుతిని ఇస్తామని తెలిపారు. దళిత, గిరిజన యువతుల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 50 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తామని సీఎం చెప్పారు.

నేతలు పర్యటనకు వచ్చినప్పుడు పిల్లలను ఎండలో నిలబెట్టవద్దని, ఎండలో నిలబెట్టి స్వాగతం పలికే సంస్కృతిపై నిషేధం విధిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పట్టణాల్లో ఎయిర్ కండిషన్లతో పనిచేసే నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తామని, రజకుల కోసం అధునాతన పద్ధతిలో ఆర్మూర్ లో దోబీఘాట్ నిర్మిస్తామని తెలిపారు. అనంతరం రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం అంకాపూర్ బయలుదేరి వెళ్ళారు.

రైతులతో సీఎం మాట్లాడుతూ, అంకాపూర్ రైతులకు వందశాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తామని, ప్రతి రైతు భూమిలో నిపుణులతో భూసార పరీక్షలు, నీటి పరీక్షలు చేయిస్తామని, భూసార పరీక్షలు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఇజ్రాయెల్ తరహాలో అంకాపూర్ రైతులు పంటలు పండించాలని,అవసరమైతే రైతులను అధ్యయనం కోసం ఇజ్రాయెల్ పంపిస్తామని అన్నారు. అంకాపూర్ లో మొదటగా ఆరుగురు రైతులతో గ్రీన్ హౌస్ కల్టివేషన్ ఏర్పాటు చేస్తామని, అడవి పందుల బెడద తప్పించేందుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దళిత పేదలకు ఆగస్ట్ 15న భూమి పట్టాలను అందజేస్తామని, మార్కెట్ యార్డు కోసం 75లక్షలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *