కమలనాథన్ కమిటీకి, కేంద్రం అనుసరిస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా బుధవారం జలసౌధ ఎదుట తెలంగాణ ఉద్యోగులు చేసిన ధర్నాలో టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు జీ దేవీప్రసాద్, టీఎన్జీవో కేంద్ర కమిటీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ, స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేయకపోతే ఢిల్లీ స్థాయిలో ఉద్యమిస్తామని, రాష్ట్ర విభజన జరిగి ఏడాది దాటినా ఇంకా ఉద్యోగుల విభజన పూర్తి చేయకపోవడం దారుణమని అన్నారు. ఈ విషయంలో కమలనాథన్ కమిటీ తీరు అభ్యంతరకరంగా ఉందని, స్థానికత ఆధారంగానే అక్టోబర్ 15 లోగా ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
నిబంధనల ప్రకారం తెలంగాణ విద్యుత్ సంస్థలు సీమాంధ్రకు చెందిన 1251 మందిని రిలీవ్ చేస్తే ఏపీ ప్రభుత్వం వారిని చేర్చుకోకుండా అనవసర రాద్ధాంతం చేస్తుందని దేవీప్రసాద్ మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగుల మనోభావాలను గౌరవించి చేర్చుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేయాలని, పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా 15,500 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నదని, ఉద్యోగుల పక్షాన సీఎం కేసీఆర్ కు దేవీప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం టీఎన్జీవో కేంద్ర కమిటీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా అధికారుల చెప్పుచేతల్లో కమలనాథ న్ కమిటీ పనిచేస్తూ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేస్తుందని, తమ సహనాన్ని పరీక్షించొద్దని, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజనను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. టీఎన్జీవో కేంద్ర కమిటీ కార్యదర్శి హమీద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని సీమాంధ్రకు, సమైక్య ఉద్యమంలో పాల్గొన్నవారిని తెలంగాణకు కేటాయించడం ఎంతవరకు సమజసమని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడే ఉంటే ఉద్యమం తప్పదని, తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులను తీసుకెళ్ళాల్సిన బాధ్యత చంద్రబాబు, అశోక్ బాబులదేనని అన్నారు.