mt_logo

డిజిటల్ తెలంగాణ దిశగా అడుగులు- ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఫిక్కీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ‘ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సొల్యూషన్స్ ఫర్ ఎ స్మార్టర్ తెలంగాణ’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన సెమినార్ లో ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక ఫలాలను ప్రజలకు అందించేందుకు, డిజిటల్ తెలంగాణ సాధన కోసం అనేక క్రియాశీల కార్యక్రమాలు చేపట్టినట్లు, సప్లై, డిమాండ్ అనే రెండు లక్ష్యాలను విధించుకుని వేగంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ల నేతృత్వంలో డిజిటల్ తెలంగాణ కోసం పలు నిర్ణయాలు తీసుకున్నట్లు, డిజిటల్ తెలంగాణ కోసం నిర్దేశించుకున్న సప్లై లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఇంటర్నెట్ ఫర్ ఆల్ అనే గొప్ప నిర్ణయం తీసుకొన్నదని తెలిపారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టులో నిర్మించే పైపులైన్లతో సమానంగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్సీ) లను వేయనున్నామని, దీనిద్వారా గ్రామాల్లోని అన్ని ఇళ్ళకు ఇంటర్నెట్ ను అందించనున్నామని జయేష్ రంజన్ చెప్పారు. ఫ్రీ వైఫై సేవల్లో భాగంగా హైదరాబాద్ లోని ముఖ్య కేంద్రాల్లో ఇప్పటికే ఉచిత వైఫై సేవలు ప్రారంభించినట్లు, వరంగల్ లో ఉచిత వైఫై సేవల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ-పంచాయితీ పథకంలో భాగంగా పంచాయితీ కేంద్రాలను సేవా కేంద్రాలుగా మార్చనున్నట్లు జయేష్ వివరించారు. డిజిటల్ లిటరసీలో భాగంగా యువతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఆరో తరగతి నుండే కంప్యూటర్ పాఠాలు నేర్పించేందుకు కృషి చేస్తున్నట్లు జయేష్ రంజన్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *