mt_logo

సోషల్ మీడియాలో దుమ్మురేపిన టీ హబ్!!

-ట్విట్టర్‌లో నంబర్‌వన్‌గా #ItStartsHere హ్యాష్‌టాగ్

స్టార్టప్ ఆవిష్కరణలకు అత్యుత్తమ వేదిక అయిన టీ హబ్ సామాజిక మీడియాలో దుమ్మురేపింది. కన్నుల పండువగా సాగిన టీ హబ్ ప్రారంభోత్సవంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఉత్సాహంగా స్పందించడంతో టీ హబ్ సోషల్ మీడియా హ్యాష్‌టాగ్‌లో నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. సోషల్ మీడియాలో దిగ్గజంగా పేర్కొనే ట్విట్టర్‌లో టీ హబ్ ప్రారంభోత్సవానికి చిహ్నంగా ఏర్పాటుచేసిన హ్యాష్‌ట్యాగ్.. దేశవ్యాప్తంగా అనేక అంశాలను తోసిరాజని ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్టార్టప్‌లకు అండదండగా ఉండేందుకు టీ హబ్‌కు శ్రీకారం చుట్టారు.

స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో పేరెన్నికగన్న ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాను కార్యక్రమం ప్రారంభోత్సవానికి వచ్చేలా ఒప్పించారు. మరోవైపు తన మానస పుత్రిక అయిన టీ హబ్‌ను ప్రచారం చేయడంలో విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది.

ఐటీ శాఖ పరిధిలోని డిజిటల్ మీడియా టీం టీ హబ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తోపాటు ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుండటంతో మరింత క్రేజ్ పెరిగింది. టీ హబ్ ప్రారంభోత్సవం దగ్గర పడుతున్న సమయంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని #ItStartsHere పేరుతో ఆకర్షణీయంగా ఉండే హ్యాష్‌ట్యాగ్‌ను రూపొందించారు. కార్యక్రమానికి హాజరైన రతన్‌టాటాతో పాటు మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీలు దిగి #ItStartsHere హ్యాష్‌టాగ్‌తో పోస్ట్‌లు చేశారు. దీంతో టీ హబ్ ప్రారంభం నుంచి కార్యక్రమం ముగిసేవరకు ట్విట్టర్‌లో #ItStartsHere హ్యాష్‌ట్యాగ్ దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచింది. తద్వారా టీ హబ్ ఆరంభంలోనే ప్రపంచానికి సత్తాను చాటింది.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *