రాష్ట్రాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లాల్లో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు మంత్రులను రంగంలోకి దింపారు. అంతేకాకుండా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. అవసరమైన మందులు అందిస్తూ మెరుగైన చికిత్స అందించాలని వైద్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూను నియంత్రించేందుకు రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం గురువారం గాంధీ ఆస్పత్రిలోని అన్ని వార్డులు, స్వైన్ ఫ్లూ వార్డులను పరిశీలించి కేంద్రం నుండి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది.
మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సీఎం బాధ్యులైన వారిపై అనర్హత వేటు వేశారు. ఇన్చార్జి డైరెక్టర్ సాంబశివరావును తొలగించి అదే స్థానంలో కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్ కు డీహెచ్ గా ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా కుటుంబ సంక్షేమ శాఖలో ముఖ్య పరిపాలన అధికారిగా ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్న శ్రీనివాస రెడ్డిని అందులోంచి తప్పించి ఆర్డీ కార్యాలయంలో డీడీగా పరిమితం చేశారు.
స్వైన్ ఫ్లూ బారిన పడ్డ రోగుల కోసం అన్ని జిల్లా, ఏరియా దవాఖానల్లో టామీ ఫ్లూ మాత్రలు అందుబాటులో ఉంచారు. 16 వేల ట్యాబ్లెట్లను ఇప్పటికే సరఫరా చేయగా మరో 20 వేల గోళీలను భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసేందుకు కొనుగోలు చేయనున్నారు. ఒక్కో ఏరియా దవాఖానకు 200, జిల్లా హాస్పిటల్ కు 500 గోళీల చొప్పున సరఫరా చేశారు. అంతేకాకుండా అన్ని జిల్లాల్లో వైద్య సిబ్బందికి అవసరమైన మాస్కులు ఎన్-95 లను కొనుగోలు చేసేలా ఆయా దవాఖానల పర్యవేక్షకులకు అనుమతి ఇచ్చారు. స్వైన్ ఫ్లూ బాధితుల కోసం గాంధీ దవాఖానలో ప్రత్యేకంగా 50 పడకలు, ఉస్మానియాలో 8, ఫీవర్ హాస్పిటల్ లో 50, నిలోఫర్ లో 12 పడకలు ఏర్పాటు చేశారు. సుమారు 1 లక్షా 30వేల పోస్టర్లను ముద్రించి జిల్లాకు 10వేల చొప్పున పంపనున్నారు. రాజధానిలో 40 వేలకుపైగా పోస్టర్లు అంటించి స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు, నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.