నీళ్ళు దోచుకోవడంలో ఇన్నాళ్ళూ చాటుమాటుగా వ్యవహరించిన ఏపీ సర్కార్ ఇప్పుడు బహిరంగంగానే కృష్ణ నీళ్లన్నీ మరల్చుకునే కుట్రలు చేస్తుంది. నాగార్జున సాగర్ కుడి కాల్వను, మొత్తం ఉన్న 26గేట్లలో 13 గేట్లను ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై మాచర్ల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కు ఏపీ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల నుండి లేఖ అందింది. దీంతో మాచర్ల ఈఈ కుడికాల్వను స్వాధీనపర్చుకునేందుకు సహకరించాలని తహసీల్దారుకు లేఖ రాశారు. స్వాధీనం చేసుకునే విషయంలో రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు కూడా లేఖ రాశారు. విషయం తెలిసిన వెంటనే నాగార్జున సాగర్ చీఫ్ ఇంజినీర్ పురుషోత్తమరాజు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
విభజన చట్టం ప్రకారం నాగార్జునసాగర్ నిర్వహణ తెలంగాణ రాష్ట్రానికే చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. వాటితో పాటు కృష్ణా, గోదావరి నదీ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. అయితే నీటి విడుదల, ప్రాజెక్టుల నిర్వహణ మాసాలకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం ప్రభుత్వాల పరిశీలనలో ఉంది. అయితే ప్రాజెక్టుల నిర్వహణ ఏ రాష్ట్రానిది అయినా, రెండు ప్రాజెక్టుల నుండి ఏ ప్రాంతానికి ఎంత నీరు విడుదల చేయాలనే అంశం ఇప్పటికీ బోర్డు నిర్ణయం ప్రకారమే జరుగుతున్నది. బోర్డు చెప్పిన మేరకు నీటి విడుదలకు తెలంగాణ సర్కారు అంగీకరిస్తూనే వస్తుంది. అయినాసారే నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ పెత్తనం ఏమిటంటూ ఏపీలోని టీడీపీ, వైసీపీ నేతలతో పాటు ఇంజినీర్లు, పోలీసులు కొద్దిరోజుల నుండి డ్యాం వద్ద ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.